ఆడవారి కన్నీళ్ల వాసనకు ఇంత పవర్ ఉంటుందా?
ఆడవాళ్లు కొన్ని కొన్ని సార్లు నోటితో కాకుండా కళ్లతోనే మాట్లాడేస్తుంటారు. కళ్లేం తక్కువ కాదండోయ్.. ఇవి కూడా మనకు ఎన్నో ఊసులను చెప్తాయి. ఆడవాళ్ల కళ్లు చెప్పే ముచ్చట్లు భర్తలకు బాగా తెలుస్తయ్. ఆడవాళ్ల కంటికే కాదు.. కన్నీళ్లకు కూడా మంచి పవర్ ఉంది తెలుసా? మగవాళ్లు ఆడవాళ్ల కన్నీటి వాసనను చూస్తే చాలు..
ఏడుపు ఒక్క ఆడవాళ్ల సొంతమైనట్టే చేస్తుంటారు కొంతమంది. ఎందుకంటే ఎంత దు:ఖమొచ్చినా, తట్టుకోనంత బాధవచ్చినా.. మగాళ్లను మాత్రం ఏడవనివ్వరు. ఒకవేళ ఏడిస్తే ఆడవాళ్లలాగ ఏడుస్తావేంటిరా అని హేళన చేస్తారు. ఈ ఏడుపు సంగతి పక్కన పెడితే.. ఆడవారి కళ్లుచెప్పే ఊసులను ఎప్పుడైనా గమనించారా? నోటితో చెప్పలేని ఎన్నో మాటలను ఆడవారు కళ్ల ద్వారే వ్యక్తపరుస్తారు. కళ్లు చెప్పే ఊసులు అన్నీ ఇన్నీ కాదండోయ్. ఒక్క చూపులో ఎన్నో హావ భావాలను వెతుక్కోవచ్చు. ఏదేమైనా ఆడవారి చూపునకు అంత పవర్ ఉంటుంది. కంటిచూపు ఒక్కటే కాదు.. కన్నీళ్లకు కూడా చాలా పవర్ ఉంటుంది తెలుసా? అవును మగవారు ఆడవారి కన్నీటి వాసన చూస్తే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు.
ఆడవాళ్లు బాధొచ్చినా, సంతోషమొచ్చినా ఏడుస్తుంటారు. కొంతమంది ఆడవారు చిన్న చిన్న విషయాలకు కూడా ఏడుస్తుంటారు. ఆడవారి ఏడుపు కొంతమంది మగవారికి చిరాకు కలిగిస్తుంది. అయితే ఆడవారి ఏడుపు అవతలి వ్యక్తిని మాత్రం పక్కాగా కరిగిస్తుంది. సానుభూతి చూపేలా చేస్తుంది. కానీ ఇది స్త్రీపురుషుల మధ్య సంబంధాన్ని మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది.
పీఎల్ఓఎస్ బయాలజీలో ప్రచురించిన పరిశోధనల ప్రకారం, అలాగే మానవ ప్రవర్తనా అధ్యయనాలు, బ్రెయిన్ ఇమేజింగ్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ద్వారా ధృవీకరించబడిన పరిశోధనల ప్రకారం.. ఆడవారి కన్నీళ్ల వాసన పురుషులలో దూకుడును తగ్గిస్తాయట. మహిళలు భావోద్వేగ కన్నీళ్లు కార్చడానికి ఒక ప్రాథమిక కారణం "దూకుడును తగ్గించే రసాయన సంకేతాన్ని తెలియజేయడం" అని ఇజ్రాయెల్లోని వీజ్మాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో న్యూరోబయాలజీలో డాక్టరేట్ పట్టా కోసం నిర్వహించిన అధ్యయనం సహ-ప్రధాన రచయిత షాని అగ్రోన్ చెప్పారు.
parents crying
ఉదాహరణకు.. కుక్కలు విడిపోయిన తర్వాత వాటి యజమానులను తిరిగి కలిసినప్పుడు కన్నీళ్లు పెడతాయి. ఆడ ఎలుక కన్నీళ్లలోని ఫెరోమోన్లు మగ ఎలుకలను ఒకదానితో ఒకటి పోరాడటం మానేసి..ఆడ ఎలుకలతో జతకట్టడానికి ప్రోత్సహిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
కన్నీళ్లు మానవ ప్రవర్తనను రసాయనికంగా ప్రభావితం చేస్తాయని 2011 లో మొదటిసారిగా బయటపడింది. అప్పుడు చేసిన అధ్యయనం ప్రకారం.. ఇది మహిళల కన్నీళ్లు పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను, లైంగిక ఉద్రేకాన్ని తగ్గిస్తాయని చూపించింది. ఇక తాజా అధ్యయనం మగవారి దూకుడును తగ్గించడానికి ఆడవారి కన్నీటి వాసన సహాయపడుతుందని తేల్చింది.