ఈ రోజు కట్ చేసిన ఉల్లిపాయలను రేపు తింటున్నారా.? ఏం జరుగుతుందో తెలుసా..
'ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు' అనే సామెత గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. ఉల్లితో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అలాంటివి మరి. దాదాపు ప్రతీ ఒక్క కూరలో ఉపయోగించే ఉల్లితో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఉల్లి పాయ ముక్కలను ఎక్కువ కాలం నిల్వ చేసి తింటే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అవేంటంటే..
ఇంట్లో ఉల్లిపాయల లేకపోతే రోజు గడవని పరిస్థితి ఉంటుంది. దాదాపు ప్రతీ ఒక్క వంటకంలో ఉల్లిపాయలను ఉపయోగిస్తుంటారు. ఉల్లిపాయలో యాంటీ బయోటిక్ మొదలు యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబయల్, కార్మినేటివ్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉల్లిపాయలో రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఉంటాయి. అలాగే ఉల్లి రసంను తేనెతో కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు త్వరగా తగ్గుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఉల్లితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే ఉల్లిపాయలను అవసరానికి మించి కట్ చేసిన సమయంలో వాటిని మనలో చాలా మంది నిల్వ చేస్తుంటారు. దాదాపు ప్రతీ ఒక్కరి ఇంట్లో ఇలాంటి సన్నవేశాలను చూసే ఉంటాం. రాత్రి కట్ చేసిన ఉల్లిపాయలను ఉదయం తిరిగి ఉపయోగించడం లేదా ఉదయం కట్ చేసిన వాటిని సాయంత్రం తినడం వంటివి చేస్తుంటాం. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కట్ చేసిన చెప్పటిన ఉల్లిపాయ వాతావరణంలోని బ్యాక్టీరియాను వేగంగా గ్రహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఉల్లిపాయ ముక్కలను తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు. కొన్ని సందర్బాల్లో ఇది ఫుడ్ పాయిజిన్‌కు కూడా దారి తీసే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. ఉల్లిపాయలను కోసిన తర్వాత ఆలస్యంగా తీసుకుంటే వాంతులు, డయేరియా, తలనొప్పి లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఉల్లిపాయ ముక్కలను ఫ్రిడ్జ్‌లో ఉంచడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. కేవలం ఉల్లిపాయలు పాడవడమే కాకుండా ఫ్రిజ్‌లోని ఇతర వస్తువులపై కూడా ప్రభావం పడుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెడితే దుర్వాసన ఏర్పడి అది ఫ్రిజ్‌లోని ఇతర ఆహార పదార్థాలకు వ్యాపిస్తుంది. ఫలితంగా రుచిని కోల్పోతాయి.
ఎలా నిల్వ చేయాలి.?
వీలైనంత వరకు ఉల్లిపాయను కట్ చేసిన వెంటనే ఉపయోగించేయాలి. అలా కుదరని పరిస్థితుల్లో వాటిని ప్రత్యేక పద్ధతుల్లో నిల్వ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అస్సలు గాలి చొరబడని డబ్బాలో మూత పెట్టి నిల్వ చేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలను గాలి చొరబడకుండా ఉండే జిప్ కవర్స్‌లో నిల్వ చేసుకోవచ్చు. గాలి తగలకపోతే ఉల్లిపాయలు త్వరగా పాడు కావు. మిగిలిన ఉల్లి ముక్కలను పేస్ట్ రూపంలో నిల్వచేసుకొని వంటల్లో ఉపయోగించుకోవచ్చు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.