Royyala Iguru: రొయ్యల ఇగురు ఇలా వండారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, స్పైసీగా అదిరిపోతుంది
Royyala Iguru: రొయ్యలంటే ఎంతో మందికి ఇష్టం ఉంటుంది. కానీ రొయ్యల ఇగురు నీచు వాసన రాకుండా పర్ఫెక్ట్ గా వండడం మాత్రం కొద్దిమందికే వస్తుంది. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో రెసిపీ ఫాలో అయి చూడండి. రొయ్యలు ఇగురు అదిరిపోవడం ఖాయం.

టేస్టీ రొయ్యల ఇగురు
చికెన్, మటన్ తర్వాత అంతే పర్ఫెక్ట్ గా ఇగురు వండాలంటే రొయ్యలే మంచి ఆప్షన్. గరిటెతో కలుపుతున్నప్పుడు రొయ్యలు ముక్కలుగా విరగవు. కాబట్టి దీన్ని సులువుగా వండవచ్చు. రొయ్యలు ఇగురు వండడం అందరికీ రాదు. ఇక్కడ మేము పర్ఫెక్ట్ గా రొయ్యలు ఇగురు ఎలా వండాలో ఇచ్చాము. ఇలా వండితే రుచి అదిరిపోతుంది. ఎవరైనా ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఒకసారి రొయ్యల ఇగురు మేము చెప్పిన పద్ధతిలో ఫాలో అయ్యి చూడండి.
రొయ్యల ఇగురు రెసిపీకి కావలసిన పదార్థాలు
రొయ్యలు పొట్టు తీశాక కిలో ఉండేలా చూసుకోండి. మిరియాల పొడి పావు స్పూను, చింతపండు ఉసిరికాయ సైజులో, గరం మసాలా అర స్పూను, ధనియాల పొడి ఒక స్పూను, టమోటోలు రెండు, పచ్చిమిర్చి ఐదు, కారం రెండు స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు, ఉల్లిపాయ తరుగు అరకప్పు, జీలకర్ర ఒక స్పూన్, ఆవాలు ఒక స్పూన్, ఎండుమిర్చి నాలుగు, ఆయిల్ మూడు స్పూన్లు, పసుపు అర స్పూను సిద్ధం చేసుకోండి.
రొయ్యల ఇగురు ఇలా చేసేయండి
రొయ్యలు ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడగండి. ఈ లోపు చింతపండును నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టి నూనె వేయండి. ఆ నూనెలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేయించండి. ఆ తర్వాత ఉల్లిపాయ తరుగును వేసి రంగు మారేవరకు వేయించుకోండి. ఉల్లిపాయల రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి బాగా కలుపుకోండి. తర్వాత నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన టమోటో ముక్కలను వేసి, ఉప్పు వేసి పైన మూత పెట్టి ఉడికించండి. టమోటాలు మెత్తగా ఇగురులాగా అవుతాయి. అప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండు రసం అందులో వేసి బాగా కలపండి. ఐదు నిమిషాల పాటు అలా ఉడకనివ్వండి.
రొయ్యలు వేసి మగ్గించండి
ఇప్పుడు అది ఇగురులాగా దగ్గరగా అయ్యాక ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలను అందులో వేసి బాగా కలపండి. కారం, ధనియాల పొడి, మిరియాల పొడి,గరం మసాలా అన్నింటిని వేసి కలుపుకోండి.అవసరమైతే ఉప్పును కూడా జోడించండి.ఇప్పుడు అరగ్లాసు నీళ్లు పోసి రొయ్యలు ఉడికేందుకు చిన్న మంట మీద పెట్టి ఉంచండి.కనీసం పావుగంటసేపు రొయ్యలు ఉడికేందుకు సమయం పడుతుంది. అది దగ్గరగా ఇగురులాగా అయ్యేంతవరకు ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పైన కొత్తిమీరను చల్లండి. అంతే టేస్టీ రొయ్యల ఇగురు సిద్ధమైపోతుంది.
ఇలా తింటే ఆ రుచే వేరు
వేడి వేడి అన్నంలో తింటే అదిరిపోతుంది. లేదా బగారా రైస్ కు కాంబినేషన్ గా కూడా బాగుంటుంది. రొయ్యలను రోటి, చపాతీతో తిన్నా కూడా రుచిగా ఉంటుంది. ఇంటిల్లిపాదికి ఇవి నచ్చేలా ఉంటాయి. అతిధులు వచ్చినప్పుడు ఇలా రొయ్యలు ఇగురు చేసి పెడితే వారికి కచ్చితంగా నచ్చుతుంది. కొందరికి రొయ్యలు పడవు. అలెర్జీలు వంటివి వస్తుంటాయి. అలాంటివారు మాత్రం రొయ్యలకు దూరంగా ఉంటేనే మంచిది.