ఏ వయసు వారు ఎంత నిద్ర పోవాలో తెలుసా?
ఏ వయసు వారికైనా తగినంత నిద్ర చాలా అవసరం. మనిషికి ఆహారం ఎంత అవసరమో, కంటి నిండా నిద్ర కూడా చాలా ముఖ్యం. పౌష్టికాహారం తీసుకుంటున్నప్పటికీ సరిగా నిద్రపోని వారు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరి మీ వయసు ప్రకారం రోజూ మీరు ఎంత సేపు నిద్రపోవాలో CDC(centres for disease control and prevention) చెప్పిన వివరాలు ఒకసారి తెలుసుకుందాం..
నిద్ర వల్ల కలిగే ప్రయోజనాలు..
శరీరానికి తగినంత విశ్రాంతి ఇస్తూ నిద్రపోవడం వల్ల నిరోధక శక్తి పెరుగుతుంది. నిద్ర ఆకలిని కలిగించే హార్మోన్లను నియంత్రిస్తుంది. మానసిక ప్రశాంతతను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నియంత్రిస్తుంది.
0-3 నెలల వయసు ఉన్న నవజాత శిశువులు ప్రతిరోజు 14-17 గంటలు నిద్ర పోయేలా చూడాలి. 4-12 నెలల పసిబిడ్డలు 12-16 గంటలు నిద్రించాలి.
1-2 సంవత్సరాలు వయసున్న చిన్నారులు 11-14 గంటలు పడుకోవాలి. 3-5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు 10-13 గంటలు నిద్రపోయేలా చూడాలి.
బడికి వెళ్ళే 6-12 ఏళ్లున్న పిల్లలు 9-12 గంటలు, 13-17 సంవత్సరాల వారు 8-10 గంటలు తప్పనిసరిగా నిద్రించాలి.
18 ఏళ్లు నిండిన యువత మొదలు కొని 60 సంవత్సరాల వయసు ఉన్న పెద్దలు వరకు అందరూ కచ్చితంగా 7 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. పని ఒత్తిడిలో పడి నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
61-64 వయసు మధ్య ఉన్న పెద్దలు 7-9 గంటలు, 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసున్న వారు 7-8 గంటలు కచ్చితంగా నిద్రించాలి. లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.