Post Covid : కోవిడ్ తర్వాత చాలా మంది రాత్రిపూట ఈ సమస్యతో బాధపడుతున్నారట..
Post Covid : లాంగ్ కోవిడ్ లక్షణాలలో శరీర నొప్పులు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి మొదలైన సమస్యలే కాదు.. రాత్రిపూట మాత్రమే ఎదురయ్యే కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారని నిపుణులు వెల్లడిస్తున్నారు.

Post Covid : కోవిడ్ -19తో యుద్దం ఇంకా ముగిసిపోలేదు. దీని నుంచి రక్షించడానికి ఎన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. దీని వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా కోవిడ్ నుంచి బయటపడ్డాక శారీరకంగా, మానసికంగా మనల్ని ప్రభావితం చేసే సమస్యలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా సోకిన తర్వాత వారాలు, నెలల తరబడి కొనసాగే ఈ సమస్యలను 'లాంగ్ కోవిడ్' లేదా 'పోస్ట్ కోవిడ్ 19 సిండ్రోమ్' అని అంటారు.
లాంగ్ కోవిడ్ లో కనిపించే సమస్యలు కోవిడ్ సంబంధిత లక్షణాలలో ఎక్కువగా కనిపించే లక్షణాల మాదిరిగానే ఉంటాయి. అలసట, శరీర నొప్పులు, ఏ విషయాన్ని అంత తొందరగా అర్థం చేసుకోకపోవడం, అస్పష్టత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు దీర్ఘకాలిక కోవిడ్ లో సాధారణంగా కనిపిస్తాయి. కొంతమందిలో అయితే వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. వీటితో పాటు అనేక మానసిక, ఆరోగ్య సమస్యలు కూడా కోవిడ్ అనంతరం ప్రజలలో ఒక వర్గాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
వీటిలో ఎక్కువగా ఆందోళన, వ్యాకులత, పిటిఎస్డి (Post Traumatic Stress Disorder) వల్ల సంభవిస్తాయి. దీనికి తోడు కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత రాత్రిపూట మాత్రమే ఎదురయ్యే ఒక సమస్యను గుర్తించారు నిపుణులు.అదే నిద్ర రుగ్మతలు. అవును కోవిడ్ తర్వాత చాలా మంది నిద్రకు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని పలు నివేదికల్లో పేర్కొన్నారు.
సాధారణంగా కోవిడ్ సోకిన వారిలో 80 శాతం మంది రెండు వారాల్లోనే కోలుకుంటారు. మిగిలిన 20 శాతం మందికి మూడు నుండి ఆరు వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు ఉన్నవారిలోనే కాదు లేని వ్యక్తులలో కూడా నిద్ర సమస్యలు విస్తృతంగా కనిపిస్తాయని పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి.
నిద్రకు ఉపక్రమించలేకపోవడం, పడుకున్న తర్వాత కూడా గాఢనిద్ర రాకపోవడం, తరచుగా మేల్కోవడం, మేల్కొన్న తర్వాత మళ్లీ నిద్ర రాకపోవడం, కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తుల్లో ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీరిలో చాలా మందికి డిప్రెషన్, యాంగ్జైటీ, బ్రెయిన్ ఫాగ్ (విషయాల గురించి అస్పష్టంగా అనిపించడం - ఆలోచన మరియు జ్ఞాపకశక్తి తగ్గడం), మరియు పిటిఎస్డి వంటి కోవిడ్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు నివేధికలు వెల్లడిస్తున్నాయి.
జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. కోవిడ్ -19 తర్వాత 40 శాతానికి పైగా ప్రజలు నిద్ర సమస్యలతో బాధపడుతునట్టు తేలింది. వీరిలో చాలా మంది మానసిక సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. ఈ ఈ రకమైన మానసిక ఆరోగ్య సమస్యలు రోజు రోజుకు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్ నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరు తమ లైఫ్ స్టైల్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తగినంత విశ్రాంతి, ఆరోగ్యకరమైన ఆహారం, తేలికపాటి వ్యాయామాలు, ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించే వాతావరణం లభించినప్పుడే రోగి కోవిడ్ సంబంధిత సమస్యల నుంచి సులభంగా బయటపడతాడని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు సంక్రమణ తరువాత వీటిని పాటించడం మంచిది.