డయాబెటిస్ ఉన్నవారు సమంతలా భోజనం చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు
డయాబెటిస్ వచ్చాక దాన్ని నిర్వహించడం చాలా కష్టం. అలాగని అసాధ్యం మాత్రం కాదు. సమంతలాగా మీరు కూడా ఆహారపు అలవాట్లు మార్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా అడ్డుకోవచ్చు.

డయాబెటిస్ ఎఫెక్ట్
డయాబెటిస్ ఒకసారి వచ్చిందంటే జీవితాంతం వెన్నంటే ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోకపోతే డయాబెటిస్ రోగం విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని వ్యాయామం, ఆహారం అలవాట్లతో నియంత్రించుకుంటూ ఉండాలి. లేకుంటే గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, నరాల దెబ్బతినడం, కంటి చూపు కోల్పోవడం అంటూ తీవ్రమైన సమస్యలు వస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు ఆహారాన్ని ఎలా నిర్వహించుకోవాలో తెలుసుకోవాలి. ఇందుకోసం సమంత చెప్పిన సీక్రెట్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.
సమంత చెప్పిన చిట్కాలు
దక్షిణాది టాప్ హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. ఆమె డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన డైట్ గురించి చెప్పారు. రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గించడానికి తన డైట్ ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. ఆరోగ్యకరమైన ఆహారం తిన్నప్పటికీ చక్కెర స్థాయిలు పెరుగుతూ ఉండడం తాను గమనించాకే భోజనం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు సమంత వివరించారు.
ఫైబర్ అధికంగా ఉండాలి
సమంత చెబుతున్న ప్రకారం మనం ఏమి తింటామో అదే ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఒక భోజన క్రమాన్ని అలవర్చుకోవాలి. శరీరంలో చక్కెర నెమ్మదిగా విడుదలయ్యే విధంగా ఆహారాన్ని తినాలి. అకస్మాత్తుగా పెరుగుదలకు కారణమయ్యే ఆహారాన్ని తినకూడదు. ముందుగా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. అంటే పాలకూర, బెండకాయ, బ్రోకలీ, బీన్స్, చిక్కుళ్లు వంటి ఆకుపచ్చ కూరగాయలతో భోజనాన్ని ప్రారంభించాలి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు. అవి స్థిరంగా ఉంటాయి.
తరువాత ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు
ఫైబర్ తో చేసిన ఆహారాలు తిన్నాక ప్రోటీన్ నిండిన ఆహారాన్ని తినాలి. అంటే గుడ్డు, చికెన్, చేపలు, సోయా, పప్పులు వంటివి. వీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్ల ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. కాబట్టి రక్తంలో చక్కర స్థాయిలో అమాంతం పెరగవు.
ఆ తర్వాత చివరిలో పిండిపదార్థాలు ఉన్న ఆహారాలను తీసుకోవాలి. అంటే రోటి, చపాతీలు, బియ్యంతో చేసిన ఆహారాలను తింటే మంచిది. ఇవి రక్తంలో చక్కెరను అమాంతం పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని చివరలో తీసుకోవడం వల్ల ముందు తిన్న ఫైబర్, ప్రోటీన్లు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి. ఆ తర్వాత చివరలో పిండి పదార్థాలు కలిగిన ఆహారాలు తక్కువగా తీసుకోవాలి.
బరువును కూడా నియంత్రణలో
ముందుగా మనం ఫైబర్, ప్రోటీన్ తినడం వల్ల కడుపు చాలా వరకు నిండిపోతుంది. ఇది అధికంగా తినకుండా అడ్డుకుంటుంది. చివరిలో బియ్యము, చపాతీలు, రోటీలు వంటివి తిన్నా కూడా ఎక్కువ తినలేము. చాలా తక్కువ మొత్తంలో తిని ఆపేస్తాము. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగే అవకాశం ఉండదు. అలాగే ఈ పద్ధతి బరువును కూడా నియంత్రణలో ఉంచుతుందని సమంత వివరిస్తోంది. మీకు కూడా ఈ చిట్కాలు నచ్చితే ఒకసారి పాటించండి.

