- Home
- Life
- Mutton Pulao: సింపుల్‌గా మటన్ పులావ్ ఇలా చేసేయండి, బిగినర్లు కూడా వండేయచ్చు, రెసిపీ తెలుసుకోండి
Mutton Pulao: సింపుల్‌గా మటన్ పులావ్ ఇలా చేసేయండి, బిగినర్లు కూడా వండేయచ్చు, రెసిపీ తెలుసుకోండి
మటన్ పలావ్ (Mutton Pulao) పేరు చెబితే నోరూరిపోతుంది. కానీ దాన్ని చేయడం చాలా కష్టం అనుకుంటారు. బిగినర్లు చేసేలా ఇక్కడ రెసిపీ ఇచ్చాము. మటన్ నీటిలో ఉడకబెట్టి రెడీగా పెట్టుకుంటే చాలు.. అరగంటలో మటన్ పలావ్ చేసేసుకోవచ్చు.

టేస్టీ మటన్ పలావ్
ఆదివారం వస్తుందంటే మటన్ తినాలా? చికెన్ తినాలా? చేపల తినాలా? అనే చర్చ ముందు రోజే మొదలైపోతాయి. ఇక్కడ మేము మీ కోసం మటన్ పలావ్ రెసిపీ ఇచ్చాము. వంట రాని వాళ్లు కూడా చాలా సులువుగా దీన్ని వండేయచ్చు. బిగినర్స్ కూడా వండేలా ఈ రెసిపీని ఎలా చేయాలో తెలుసుకోండి. మటన్ ను ముందుగా కుక్కర్లో ఉడికించి రెడీగా పెట్టుకుంటే మటన్ పలావ్ సింపుల్ గా అయిపోతుంది.
మటన్ పలావ్ చేసేందుకు కావలసిన పదార్థాలు
మటన్ అరకిలో చిన్న ముక్కలు కొట్టించి తెచ్చుకోవాలి. ఇప్పుడు బాస్మతి బియ్యం ఒక కిలో, పెరుగు రెండు కప్పులు, బిర్యానీ ఆకులు రెండు, ఉప్పు రుచికి సరిపడా తీసి పక్కన పెట్టుకోవాలి. సరిపడినంత నూనె, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా తీసి పెట్టుకోవాలి. అలాగే గసగసాలు ఒక పావు స్పూన్ తీసుకోవాలి. ధనియాలు రెండు స్పూన్లు, వెల్లుల్లి పది రెబ్బలు, అల్లం చిన్న ముక్క తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు నాలుగు తీసుకోవాలి. నెయ్యి నాలుగు స్పూన్లు , జీడిపప్పులు గుప్పెడు ఉంటే చాలు.
మటన్ పులావ్ రెసిపీ
బాస్మతి బియ్యాన్ని అరగంట సేపు ముందే నానబెట్టుకోవాలి. అలాగే మటన్ ను కుక్కర్లో వేసి శుభ్రంగా కడిగి అందులో పసుపు, ఉప్పు వేసి రెండు యాలకులు వేసి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ పలావు చేయడానికి సిద్ధమవ్వాలి. స్టవ్ మీద కళాయి పెట్టి గసగసాలు వేయించి మిక్సీ జార్ లో వెయ్యాలి. అదే మిక్సీ జార్లో ధనియాలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పలావ్ చేసేందుకు ఒక పెద్ద బాండీని తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. అందులో నెయ్యి వేసి నిలువుగా తరిగిన ఉల్లిపాయలను, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించాలి.
పావుగంటసేపు ఉడికిస్తే
ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత జీడిపప్పు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత బిర్యాని ఆకులు, పెరుగు కూడా వేసి బాగా కలపాలి. అవసరం అయితే మరి కొంచెం నూనె వేసుకోవచ్చు. ఈ మొత్తం మిశ్రమం బాగా వేగాక ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను అందులో వేసి కలపాలి. పైన మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ మసాలా దినుసులన్నీ మటన్ కు బాగా పట్టాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి బాగా కలపాలి. బాస్మతి బియ్యం ఉడకడానికి సరిపడా నాలుగు గ్లాసుల నీళ్లను వేసి రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూను కారం పైన చల్లుకోవాలి. తర్వాత మూత పెట్టి పావుగంట సేపు ఉడికించాలి. దీన్ని చిన్నమంట మీద ఉడికిస్తే మంచిది. లేకపోతే మాడిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే చాలా సింపుల్ గా మటన్ పలావ్ రెడీ అయినట్టే.
చిన్న మటన్ ముక్కలతో
ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఇలా మటన్ పలావు చేసి చూడండి.. అద్భుతంగా ఉంటుంది. దీన్ని రైతాతో తింటే అదిరిపోవడం ఖాయం. మటన్ ముక్కలను పెద్ద ముక్కలు కొట్టించకుండా చిన్నవి కొట్టిస్తేనే మటన్ పలావ్ రుచిగా ఉంటుంది.