Dandruff: ఇందుకే చుండ్రు ఏర్పడి జుట్టు రాలుతుంది..
Dandruff: తలలో దుమ్ము, దూళీ పేరుకుపోవడం, తలస్నానం చేయకపోవడం, వేడినీళ్లతో స్నానం చేయడం వంటి రకరకాల కారణాల వల్ల తలలో చుండ్రు సమస్య వస్తుంది.

రకరకాల కారణాల వల్ల తలలో చుండ్రు ఏర్పడి జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది. చుండ్రు నుంచి వీలైనంత తొందరగా బయటపడకపోతే మాత్రం తలలో దురద పెట్టడంతో పాటుగా.. హెయిర్ ఫాల్ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అయితే చుండ్రు ఎందుకు వస్తుందో తెలుసుకుంటే.. దీన్ని నుంచి బయటపడటం చాలా సులువు అవుతుంది. మరి చుండ్రు ఎందుకు ఏర్పడుతుందో తెలుసుకుందాం పదండి..
ఫంగల్ ఇన్ఫెక్షన్.. ఫంగల్ ఇన్ ఫెక్షన్ కారణంగా డాండ్రఫ్ వస్తుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒకరి దువ్వెనలను మరొకరు వాడటం వల్ల కూడా వస్తుంది. తలస్నానం చేయకపోవడం వల్ల తలపై చెమట పేరుకుపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి ఒకరి దువ్వెనలను మరొకరు వాడకూడదు.
మురికి పేరుకుపోతే.. జుట్టును సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే.. జుట్టులో మురికి చాలా పేరుకుపోతుంది. ఈ కారణంగా కూడా చుండ్రు వచ్చే అవకాశం ఉంది.
వేడి నీళ్లతో స్నానం చేస్తే.. కాలాలతో సంబంధం లేకుండా కొంతమందికి వేడినీళ్లతో స్నానం చేసే అలవాటు ఉంటుంది. కానీ వేడినీళ్లతో తలస్నానం చేయడం వల్ల చుండ్రు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తలకు సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీళ్లను మాత్రమే ఉపయోగించండి.
చర్మ రకం.. స్కాల్ప్ పొడిగా, జిడ్డుగా ఉంటే కూడా డాండ్రఫ్ సమస్య వస్తుంది. జిడ్డు చర్మం ఉన్న వాళ్లకు దుమ్ము ఎక్కువగా పేరుకుపోతుంది. దీంతో చుండ్రు ఎక్కువగా వస్తుంది. ఈ సమస్య ఎక్కువగా తలస్నానం చేయని, జుట్టును సరిగ్గా దువ్వని వారిలోనే కనిపిస్తుంది.
ఆహారపు అలవాట్లు.. మనం తినే ఆహారం చర్మంపైనే కాదు జుట్టుపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి హెల్త్ కు మంచివి కానీ ఆహార పదార్థాలను ఎక్కువగా తినకండి. ఇకపోతే శరీరానికి సరిపడా నీళ్లను తాగకపోతే కూడా చుండ్రు ఏర్పడుతుంది.
షాంపూని సరిగ్గా కడగకపోవడం.. జుట్టును క్లీన్ చేసేందుకు పెట్టిన షాంపూని సరిగ్గా కడగకపోతే కూడా చుండ్రు విపరీతంగా ఏర్పడుతుంది.
ఒత్తిడి.. అతిగా ఆలోచించడం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీని వల్ల స్కాల్ప్ పై ప్రభావం పడి చుండ్రు ఏర్పడుతుంది. వెంట్రుకలను చాలా రోజుల వరకు క్లీన్ చేసుకోకపోతే జుట్టు బేస్ దగ్గర ఫంగస్ ఏర్పడి చుండ్రు వస్తుంది.
దువ్వెన లేదా టవల్.. మీ కుటుంబంలో ఎవరికైనా చుండ్రు సమస్య ఉన్నట్టైతే వారు వాడిన దువ్వెన లేదా టవల్ ను మీరు ఉపయోగిస్తే అది మీకు కూడా వచ్చే అవకాశం ఉంది.