Dish Washing: అమ్మాయిలు కాదు, అబ్బాయిలు రోజూ గిన్నెలు తోమితే ఏమౌతుంది...?
Dish Washing: చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ.. గిన్నెలు తోమడం అనేది మానసిక ఆరోగ్యంతో సంబంధం ఉంటుంది. రెగ్యులర్ గా అబ్బాయిలు గిన్నెలు తోమితే.. ఒక మెడిటేషన్ లా పని చేస్తుంది.

Dish Washing
దాదాపు ఏ ఇంట్లో చూసినా... వంట చేయడం, పాత్రలు తోమడం, ఇంటి పనులు చేయడం అన్నీ మహిళలే చేస్తూ ఉంటారు. దాదాపు అందరి మనసుల్లో, మెదడుల్లో ఇవి ఆడవారి పనులు మాత్రమే అనే భావన నానుకుపోయింది. ఈ మధ్యకాలంలో మాత్రమే ఈ అభిప్రాయం కాస్త మారుతోంది అని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే ఇంటి పనుల్లో అబ్బాయిలు కూడా పాలుపంచుకుంటున్నారు.
ఇంటి పనుల్లో పాత్రలను కడగడం కూడా ఒక భాగం అని చెప్పొచ్చు. ఈ పని అమ్మాయిల కంటే.. అబ్బాయిలు చేస్తేనే మంచిదని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. రోజూ అబ్బాయిలు గిన్నెలు కడగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం....
1.ఒత్తిడిని తగ్గించే మార్గం....
అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీలో చేసిన ఒక పరిశోధన ప్రకారం, పాత్రలు తోమేటప్పుడు మనం దానిపై దృష్టిపెట్టడం వల్ల మన మెదడులో Mindfulness పెరుగుతుంది. అంటే, గతం లేదా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రస్తుత క్షణంలో మనసు కేంద్రీకరిస్తుంది. ఈ చిన్న చిన్న పనుల్లో మన దృష్టిని నిలిపినప్పుడు, ఒత్తిడి హార్మోన్ అయిన కార్టసాల్ స్థాయిలు తగ్గుతాయి. అంటే, పాత్రలు తోమడం కూడా ఒక రకమైన థెరపీలా పని చేస్తుంది.
2.కుటుంబ బంధాలను బలపరుస్తుంది...
పురుషులు ఇంటి పనుల్లో, ముఖ్యంగా పాత్రలు కడగడంలో భాగస్వామ్యం చూపినప్పుడు, ఇంట్లో సమానత్వ బావన పెరుగుతుంది. భార్య లేదా కుటుంబ సభ్యులు కూడా ఈ సహకారాన్ని చూసి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇంటి పనులు పంచుకోవడం వల్ల గొడవలు తగ్గుతాయి. ఒకరికొకరు గౌరవం పెరుగుతుంది. పాత్రలు కడగడం చిన్న పని అయినా, దానిలోని సహకారం ప్రేమను మరింత పెంచుతుంది.
3.మెదడుకు విశ్రాంతి...
రోజంతా పని చేసిన తర్వాత మన మెదడు నిరంతరం ఆలోచనల్లో నిమగ్నమై ఉంటుంది. కానీ, చేతులతో పాత్రలు కడుగుతుండగా, నీటి స్పర్శ, సబ్బు వాసన, గిన్నెలు మెరుస్తూ ఉండటం.. ఇవన్నీ మెదడును ప్రశాంతంగా ఉంచే సెన్సరీ థెరపీలా (Sensory Therapy) పనిచేస్తాయి.ఇది మైండ్ డీటాక్స్ (Mind Detox) లా పని చేస్తుంది.
4.మానసిక తృప్తి....
పాత్రలు కడగడం చిన్న పని అయినా, అది పూర్తయ్యాక కలిగే సంతృప్తి భావన చాలా గొప్పది. మనం ఏదో పని పూర్తి చేశామనే ఆనందం మెదడులో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. దీని వల్ల మనసు హాయిగా ఉంటుంది, నిద్ర కూడా బాగుంటుంది. కాబట్టి, ఇది మానసికంగా కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది.
5. జీవితం పట్ల అవగాహన పెరుగుతుంది
పాత్రలు కడుగుతుంటే మనకు ఓపిక పెరుగుతుంది. ప్రతి పనిలోని విలువ అర్థమవుతుంది. చిన్న పనులు కూడా పెద్ద మార్పు తీసుకురాగలవని మనకు తెలుస్తుంది. ఇది వినయాన్ని నేర్పుతుంది, “ప్రతి పని గొప్పదే” అనే భావనను బలపరుస్తుంది.
ఫైనల్ గా....
ఇంటి పనులు “ఆడవారి పని” అనే భావనను వదిలి, పురుషులు కూడా వాటిలో భాగస్వామ్యం కావాలి. అది కేవలం కుటుంబ సమతౌల్యానికి కాదు, వారి మానసిక ఆరోగ్యానికి కూడా సహాయం చేస్తుంది.