- Home
- Life
- Mutton Paya soup: మటన్ పాయ సూప్ ఇలా చేసుకొని వేడివేడిగా తిన్నారంటే ఆ రుచి జన్మలో మర్చిపోలేరు
Mutton Paya soup: మటన్ పాయ సూప్ ఇలా చేసుకొని వేడివేడిగా తిన్నారంటే ఆ రుచి జన్మలో మర్చిపోలేరు
మటన్ పాయ సూప్ (Mutton) చాలా మంది వినే ఉంటారు. కానీ వండడం వచ్చిన వారి సంఖ్య చాలా తక్కువ. నిజానికి మటన్ పాయను వండడం సులువు. రెసిపీ (Recipe) ఎలాగో తెలుసుకోండి.

మటన్ పాయా సూప్
ఎముకలు విరిగిన వాళ్ళు అధికంగా మటన్ పాయ సూప్ తయారు చేసుకొని తినేందుకు ఇష్టపడతారు. అయితే దీన్ని రుచిగా వండడం వచ్చేది చాలా తక్కువ మందికే. మటన్ కాళ్ళను శుభ్రం చేసి ఉల్లి, అల్లం వెల్లుల్లి, టమోటాలు అన్నీ వేసి చేసే ఈ మటన్ పాయాను అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. రెసిపీ అదిరిపోతుంది.
మటన్ పాయ సూప్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
గొర్రె కాళ్లు ఆరు, నిమ్మరసం ఒక స్పూను, కొత్తిమీర తరుగు రెండు స్పూన్లు, నూనె తగినంత, బిర్యానీ ఆకు రెండు, యాలకులు మూడు, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు నాలుగు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గరం మసాలా పొడి పావు స్పూను, ధనియాల పొడి ఒక స్పూను, కారం పొడి ఒక స్పూన్లు, పసుపు పొడి పావు స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ఉల్లిపాయల తరుగు పావు కప్పు సిద్ధం చేసుకోవాలి.
మటన్ పాయా సూప్ ఇలా వండేయండి
మటన్ పాయ సూప్ వండడానికి ముందు గొర్రె కాళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఉప్పు నీటితో వాటిని కడగాలి. ఆ తర్వాత కుక్కర్ ను తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. అందులో నూనె వేసి బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వంటివి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా రంగు మారేవరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసిన గొర్రె కాళ్ళను కుక్కర్లో వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు వేయించాలి. ఆ తర్వాత పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి.
Mutton paya soup
పాయ ఉడకడానికి సరిపడా నీళ్లను పోసి కుక్కర్ మూత పెట్టేయాలి. పైన విజిల్ పెట్టి దాదాపు పది విజిల్స్ వచ్చేదాకా చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి మరి కాసేపు స్టవ్ మీద చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి. పైన కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఆ సూపు గోరువెచ్చగా మారాక పైన నిమ్మరసం చల్లుకోవాలి. అంతే వేడి వేడి మటన్ పాయా రెడీ అయినట్టే. దీన్ని తింటే అద్భుతంగా ఉంటుంది.
మటన్ పాయాతో ఆరోగ్యం
నీరసంగా ఉన్నప్పుడు మటన్ పాయ సూప్ తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే ఎముకలు విరిగి ఇబ్బంది పడుతున్న వారు కూడా మటన్ పాయ సూప్ తినడం వల్ల అవి త్వరగా అతుక్కునే అవకాశం ఉంటుందని చెబుతారు.