కందిపప్పుతో అప్పటికప్పుడు రుచికరమైన పచ్చడి ఇలా చేసేయండి, స్పైసీగా అదిరిపోతుంది
kandi Pachadi: ఆంధ్రా, తెలంగాణా వంటల్లో పచ్చళ్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కంది పచ్చడి అంటే ఎంతో మంది ఇష్టం. దీన్ని తయారుచేయడం చాలా సులువు. దీన్ని తినడం వల్ల శరీరానికి ప్రోటీన్ అందుతుంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

కంది పచ్చడి
కందిపప్పుతో కేవలం పప్పు, సాంబారు మాత్రమే కాదు పచ్చడి కూడా చేయవచ్చు. దీన్ని స్పైసీగా చేస్తే రుచి అదిరిపోతుంది. తినేకొద్దీ తినాలనిపిస్తుంది. కందిపచ్చడి చేసే విధానం ఇక్కడ ఇచ్చాము. ఈ రెసిపీ చాలా సులువు. ఈ పద్ధతిలో చేసి చూడండి అద్భుతంగా ఉండడం ఖాయం.
కందిపచ్చడికి కావాల్సిన పదార్థాలు
కంది పప్పు – ఒక కప్పు, జీలకర్ర – ఒక చెంచా, చింతపండు – చిన్న ముక్క, ఎండు మిరపకాయలు – 4 లేదా 5, వెల్లుల్లి రెబ్బలు – 5 నుండి 6, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, మినప్పప్పు – అరస్పూను, శెనగపప్పు – అరస్పూను, కరివేపాకులు – గుప్పెడు, నూనె – ఒక చెంచా
కంది పచ్చడి తయారీ ఇదిగో
ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి కంది పప్పును వేసి పొడిపొడిగా వేయించాలి. ఆ పప్పు బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే కళయిలో ఎండు మిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారాక మిక్సీలో వేయాలి. అలాగే చింతపండు, ఉప్పు, పసుపు కలిపి మిక్సీలో వేసి రుబ్బాలి. తగినంతన నీటిని వేసి రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బాక తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో మినప్పప్పు, శెనగపప్పు, కరివేపాకులు వేసి వేయించాలి. ఇప్పుడు తాళాంపును పచ్చడిపై వేసి కలుపుకోవాలి. అంతే టేస్టీ కంది పచ్చడి సిద్ధమైనట్టే.
కంది పచ్చడి ఇలా తింటే...
ఈ కంది పచ్చడిని వేడి వేడి అన్నంలో ఒక స్పూను నెయ్యి వేసి కలిపి తింటే రుచి అదిరిపోతుంది. అలాగే ఈ చట్నీ ఇడ్లీ, దోశ, ఉప్మాలతో కూడ అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే దీన్ని మీరు మర్చిపోలేరు. కందిపప్పును బాగా వేయించాలకే పచ్చడి చేయాలి. లేకుంటే పచ్చి వాసన వచ్చేస్తుంది. ఈ పచ్చడి ఎక్కువ సేపు నిల్వ ఉండాలంటే గాలి చొరబడని సీసాలో వేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే మంచిది.