Nonveg in Pregnancy: ప్రెగ్నెన్సీలో మాంసాహారం తినడం అంత ప్రమాదమా?
Nonveg in Pregnancy: గర్భం ధరించాక తినే ఆహారంపై ఎంతో శ్రద్ధ అవసరం. ఎంతో మంది ప్రెగ్నెన్సీలో మాంసాహారం తినవచ్చా లేదా? అనే సందేహం ఉంటుంది. ఇది పుట్టబోయే బిడ్డకు హాని కలిగిస్తుందని అనుకుంటారు. దీనిపై వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.

గర్భంతో ఉంటే నాన్ వెజ్ తినకూడదా?
గర్భిణీ స్త్రీలు తాము తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వారు తినే ఆహారం నుంచే పోషకాలను గర్భస్థ శిశువు స్వీకరిస్తుంది. తల్లి ఆరోగ్యం సరిగా లేకపోతే అది బిడ్డపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. అందుకే గర్భిణులు ఎలాంటి ఆహారాలు తినాలో… వైద్యులు ముందుగానే చెబుతారు. అయితే గర్భిణులకు మాంసాహారం మంచిదేనా? ప్రతిరోజూ తినవచ్చా వంటి ప్రశ్నలకు వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.
పోషకాహారం అవసరం
గర్భిణీ స్త్రీలు తినే ఆహారంలోని శిశువుకు అవసరమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. తల్లి రక్తం ద్వారా బిడ్డకు పోషకాలు అందుతాయి. అందుకే గర్భిణులు ఆరోగ్యకరమైన ఆహారం ఎంపిక చేసుకుని తినాలి. అయితే మాంసాహారంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి గర్భిణులు నాన్ వెజ్ తినవచ్చా? వారంతో ఎన్నిసార్లు తినవచ్చు?
ఇవి తింటే మంచిది
చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారాలలో మనకు అత్యవసరమైన ప్రోటీన్ అధికంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో బిడ్డ ఎదుగుదలకు ప్రోటీన్ చాలా ముఖ్యం. అవయవాలు, కండరాలు, కణజాలాల అభివృద్ధిలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. గర్భిణీ స్త్రీల కండరాలకు కూడా ఇది అవసరం.
రక్తహీనత తగ్గుతుంది
గర్భిణులకు అవసరమైన ఇనుము మేక, గొర్రె మాంసంలో అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ మాంసాన్ని తినడం వల్ల ఇది రక్తహీనత సమస్య రాకుండా అడ్డుకోవచ్చు. ఇవి ఎర్ర రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ల కోసం సాల్మన్, మాకేరెల్, ట్రౌట్ వంటి చేపలను తినవచ్చు. దీనిలోని డోకోసాహెక్సానోయిక్ యాసిడ్ (DHA) బిడ్డ మెదడు, కళ్ళ అభివృద్ధికి అవసరం.
ఆమ్లెట్ తింటే మంచిది
బిడ్డలో నరాల వ్యవస్థ ఆరోగ్యం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బి, బి12 అత్యవసరం. ఇందుకోసం ఉడికించిన గుడ్లు లేదా తక్కువ నూనెతో చేసిన ఆమ్లెట్ తరచుగా తీసుకుంటే మంచిది. ఆమ్లెట్ లో అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే గుడ్డుతో చేసిన ఆహారాలను తింటే మంచిది. అందుకే వైద్యులు గుడ్డును తినమని సూచిస్తారు. కానీ మితంగా తింటేనే ఆరోగ్యం.
మాంసాహారాన్ని శుభ్రం చేశాకే
మాంసాహారాన్ని ఎప్పుడైనా నీటితో, ఉప్పుతో శుభ్రం చేయాలి. దీనిపై రకరకాల ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవులు ఉండవచ్చు. ఈ పచ్చి మాంసం వేసిన వంట పాత్రలు, కట్ చేసేందుకు వాడిన కత్తులను కూడా శుభ్రం చేయాలి. ఎక్కువ నూనెలో వేయించిన మాంసాన్ని తినకూడదు. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన చేపలకు దూరంగా ఉండాలి. తాజా చేపలను మాత్రమే తినడం మంచిది.
వారానికి రెండు సార్లు చాలు
మాంసాహారం కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా వండాలి. తక్కువ మసాలాలు వేసి, బాగా ఉడికించాకే తినాలి. కానీ తరచుగా తినడం మానాలి. వారానికి రెండు సార్లు మాంసాహారం తింటే సరిపోతుంది. గర్బిణుల ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.