ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రేపిస్టులే? ఏ పార్టీలో ఎక్కువ మంది ఉన్నారో తెలుసా
ఎంపీలు, ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులు: కోల్‌కతాలో శిక్షణ పొందుతున్న వైద్యురాలిపై అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా ప్రజల ఆగ్రహానికి దారితీసింది. బదలాపూర్, అకోలాలోనూ పాఠశాల విద్యార్థులపై దుష్ప్రవర్తన ప్రజలను రోడ్లపైకి వచ్చేలా చేసింది. ఎంత మంది ప్రజాప్రతినిధులపై లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయో మీకు తెలుసా?
151 మందిఎంపీలు, ఎమ్మెల్యేలపై ఎఫ్ఐఆర్
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఎడీఆర్) పరిశోధన నివేదిక ప్రకారం దేశంలోని ప్రస్తుత 151 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై మహిళల వేధింపులకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఏయే నేరాల్లో ప్రజాప్రతినిధులపై కేసులు నమోదయ్యాయి?
దేశంలోని ప్రస్తుతం ఉన్న 150 మంది ప్రజాప్రతినిధులపై యాసిడ్ దాడులు, లైంగిక వేధింపులు, వేధింపులు, స్త్రీని నగ్నంగా చేయడం, ఆమెను వెంబడించడం, మైనర్ బాలికలను వ్యభిచారం కోసం కొనుగోలు చేయడం, అమ్మడం, మహిళలపై గృహ హింస, వివాహిత స్త్రీని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, కిడ్నాప్, అంగీకారం లేకుండా స్త్రీతో బలవంతంగా ఉండటం, కట్నం హత్య, భార్య ఉండగానే మరో వివాహం వంటి అంశాలలో ఎఫ్ఐఆర్ నమోదైంది.
బీబీసీ నివేదిక ప్రకారం..
బీబీసీ నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా 775 మంది ఎంపీలు, 3938 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 151 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ అఫిడవిట్‌లో తమపై మహిళా లైంగిక వేధింపుల కేసు నమోదైందని అంగీకరించారు. ప్రస్తుతం 16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఏ పార్టీలో ఎక్కువ కేసులు?
ఏడీఆర్ నివేదిక ప్రకారం దేశంలో కళంకిత ఎంపీలలో బీజేపీ ప్రజాప్రతినిధులే అధికంగా ఉన్నారు. వీరిలో 44 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 10 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన 23 మంది, తెలుగుదేశం పార్టీకి చెందిన 17 మంది ప్రజాప్రతినిధులపై కేసులు నమోదయ్యాయి. ఆప్‌కు చెందిన 13 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు నమోదు కాగా, టీఎంసీకి చెందిన 10 మంది, ఆర్జేడీకి చెందిన 5 మంది ప్రజాప్రతినిధులపై కేసులు నమోదయ్యాయి.
ఎంత మందిపై అత్యాచార కేసులు?
ఏడీఆర్, ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం, దేశంలోని 16 మంది ప్రజాప్రతినిధులపై అత్యాచార కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. డేటా ప్రకారం బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన ఐదుగురు ప్రజాప్రతినిధులపై అత్యాచార కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలపై అత్యాచార కేసులు ఉన్నాయి. వీటితో పాటు ఆప్, టీఎంసీ, ఏఐయూడీఎఫ్, భారత్ ఆదివాసీ పార్టీ, బీజేడీలకు చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యేపై అత్యాచార కేసు నమోదైంది.