Recipes: మీ స్నాక్స్ రొటీన్ గా ఉన్నాయా.. అయితే డిఫరెంట్ గా కీమా లుక్మీ సమోసా ట్రై చేద్దాం!
Recipes: రొటీన్ స్నాక్స్ తినీ తినీ బోర్ కొట్టిందా. అయితే రంజాన్ మాసంలో ఎక్కువగా చేసుకునే రుచికరమైన స్నాక్ కీమా లుక్మి ని ట్రై చేద్దామా. ఇది హైదరాబాదులో హలీం తర్వాత ఎక్కువగా తినే స్నాక్. అయితే దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
ముందుగా కీమా లుక్మీ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మటన్ కీమా అరకిలో, మైదా ఒక కిలో, నిమ్మకాయ ఒకటి, కొత్తిమీర ఒక కట్ట, పచ్చిమిరపకాయలు ఐదు, ఉల్లిపాయ ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు, పాలు ఒక కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా పౌడర్ ఒక స్పూన్, ఎగ్ వైట్ ఒకటి,నూనె వేయించడానికి సరిపడా.
ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మైదా పిండిలో ఉప్పు, కొంచెం నూనె లేదా నెయ్యి, పాలు పోసి బాగా కలపండి. తర్వాత కొన్ని నీళ్లు వేస్తూ చపాతీ ముద్దలాగా చేసుకుని 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు మటన్ కీమాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక స్టవ్ పై పాత్ర పెట్టుకొని అందులోని కొంచెం నూనె వేసి ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. తరువాత పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ బాగా వేసి వేగనివ్వండి తరువాత కీమా కూడా వేయండి.
నూనె పైకి తేలిన వరకు బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత అందులో కారం, జీలకర్ర, గరం మసాలా పౌడర్ వేసి బాగా కలపండి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి బాగా ఉడికించండి. నీరు మొత్తం ఇగిరిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపి కూరని దించేయండి.
ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మనం సమోసాలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చపాతీలు వత్తుకొని అందులో మటన్ కీమాని పెట్టి చివర్లు తడి చేస్తూ చుట్టూ అతికించేయండి. ఆ తరువాత నూనెలో బంగారం రంగు వచ్చేవరకు వాటిని వేయించండి.
అంతే నోరూరించే హైదరాబాదీ కీమా లుక్మి రెడీ. అయితే సమోసా లాగా ట్రయాంగిల్ షేప్ లో కాకుండా చతురస్రాకారంలో చేసుకుంటే చూడటానికి మరింత అందంగా ఉంటుంది.ఇది సాయంత్రం వేళ స్నాక్స్ గా చాలా బాగుంటుంది.