Pepper Chicken: రెస్టారెంట్ స్టైల్ లో పెప్పర్ చికెన్ ఇలా నిమిషాల్లో వండేయండి, రెసిపీ ఇదిగో
Pepper Chicken: పెప్పర్ చికెన్ పేరు చెబితేనే ఈ చల్లని వాతావరణంలో నోరూరిపోవడం ఖాయం. దీన్ని చాలా సులువుగా ఇంట్లోనే చేసుకోవచ్చు... రెస్టారెంట్లకు ఆర్డర్ పెట్టాల్సిన అవసరం లేదు. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

టేస్టీ పెప్పర్ చికెన్
చల్లని వాతావరణంలో స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులకు కచ్చితంగా చికెన్ వంటకాలే గుర్తొస్తాయి. అలాంటప్పుడు ఇంట్లోనే పెప్పర్ చికెన్ వండుకునేందుకు ప్రయత్నించండి. రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ పెడితే ఖర్చు ఎక్కువ.. పైగా వచ్చే క్వాంటిటీ తక్కువగా ఉంటుంది. ఇంట్లోనే మీరు పెప్పర్ చికెన్ సులువుగా కొన్ని నిమిషాల్లో చేసుకోవచ్చు. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
పెప్పర్ చికెన్ రెసిపీకి కావలసిన పదార్థాలు
అరకిలో చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నల్ల మిరియాల పొడి ఒక అర స్పూను రెడీ చేసుకోండి. పసుపు పావు స్పూను, నూనె తగినంత, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటిన్నర స్పూను, కరివేపాకులు గుప్పెడు, కొత్తిమీర తరుగు గుప్పెడు, టమోటో ఒకటి, ఉల్లిపాయ ఒకటి తీసి పక్కన పెట్టుకోండి. వెనిగర్ ఒక అర స్పూను సిద్ధం చేసుకోండి.
పెప్పర్ చికెన్ ఇలా వండేయండి
స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి. నూనె వేడెక్కాక ఉల్లిపాయలను వేసి బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించండి. ఇప్పుడు అందులోనే కరివేపాకు తరుగు, టమోటో తరుగు వేసి బాగా కలపండి. పైన మూత పెడితే టమోటోలు మెత్తగా ఇగురులాగా అవుతాయి. ఆ తర్వాత పసుపు, ముందుగా రెడీ చేసుకున్నా మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి. టమోటాలు మెత్తగా మెత్తగా అయిన తర్వాతే వీటన్నిటినీ వేసుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడి వేశాక ఇగురు కాస్త ముదురు రంగులోకి మారుతుంది. అప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలపండి. తర్వాత మూత పెట్టి మీడియం మంట మీద ఉడికించండి.
చికెన్ లోంచి నీళ్లు దిగి అవి ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. చికెన్ లోని నీరు అంతా ఇంకిపోయి దగ్గరగా ఇగురు లాగా అయ్యే వరకు ఉడికించండి. ఆ తర్వాత కొంచెం వెనిగర్, కొత్తిమీర తరుగు వేసి కలపండి. పెప్పర్ చికెన్ మసాలా ప్యాకెట్లు బయట దొరుకుతాయి. వీలైతే అది కూడా తెచ్చి కలుపుకుంటే మరింత స్పైసీగా వస్తుంది. మీకు కొద్దిగా గ్రేవీతో కావాలనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేయండి. పొడిగా కావాలనిపిస్తే మరి కాసేపు చిన్న మంట మీద పెప్పర్ చికెన్ వేయించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే టేస్టీ పెప్పర్ చికెన్ రెడీ అయినట్టే.
ఇంట్లో వండుకుంటేనే బెటర్
పెప్పర్ చికెన్ చేయడం చాలా సులువు. కానీ బయట ఆర్డర్ పెడితే మాత్రం ఎక్కువ ఖరీదుకు కొనాల్సి వస్తుంది. ఇందులో రెస్టారెంట్లలో వేసేది కూడా అర స్పూను మిరియాలపొడి. కానీ ఆ మిరియాల పొడికే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు. కాబట్టి ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో పెప్పర్ చికెన్ ప్రయత్నించి చూడండి.. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. దీనికి కాస్త గ్రేవీలా ఉంచుకుంటే చపాతీతో, రోటితో తింటే అదిరిపోతుంది. అలాగే ఒక బగారా రైస్ కాంబినేషన్ గా కూడా రుచిగా ఉంటుంది.
ఎంతో ఆరోగ్యం కూడా
చికెన్ తో చేసే వంటకాలు ఏవైనా ఆరోగ్యానికి మంచివే. ఎందుకంటే దీనిలో లీన్ ప్రోటీన్ ఉంటుంది. ఇది మనకి అత్యవసరమైనది. ఇక ఈ పెప్పర్ చికెన్ లో ఉండే మిరియాలు, కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయ వంటివన్నీ కూడా మనకు ఎన్నో పోషకాలను అందిస్తాయి. అలాగే చికెన్ లో ఉన్న పోషకాలు కూడా శరీరంలోకి చేరుతాయి. వానాకాలంలో పెప్పర్ చికెన్ తినడం వల్ల శరీరానికి కొంచెం వేడి అందుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం చెప్పిన పద్ధతిలో పెప్పర్ చికెన్ చేసేందుకు సిద్ధమైపోండి.