ఈ ఒక్కటి పెట్టినా రాగి పాత్రలు కొత్తవాటిలా తళ తళా మెరుస్తాయి
Copper Utensils: రాగి పాత్రలు తొందరగా నల్లబడతాయి. మరకలు అవుతాయి. వీటిని ఏ రోజుకారోజు శుభ్రం చేసుకుంటేనే నీట్ గా ఉంటాయి. లేదంటే ఎప్పుడో కొన్న వాటిలా కనిపిస్తాయి. మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో చాలా సింపుల్ గా వీటిని శుభ్రం చేయొచ్చు.

రాగి పాత్రలు
ప్రతి ఒక్కరి ఇంట్లో స్టీల్, అల్యూమినియంతో పాటుగా రాగి పాత్రలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఈ కాలంలో వీటి వాడకం తగ్గింది కానీ ఒకప్పుడు వీటినే ఎక్కువగా ఉపయోగించేవారు. ఎందుకంటే ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ ఈ రాగి పాత్రలు చాలా తొందరగా అపరిశుభ్రంగా కనిపిస్తాయి.
అంటే వీటిపై నీళ్లు పడినా మరకలు అవుతాయి. నల్లగా కనిపిస్తాయి. వీటిని క్లీన్ చేయకుండా అలాగే వదిలేస్తే ఎన్నడూ వాడని పాత్రల్లా నల్లగా కనిపిస్తాయి. ఈ పాత్రలను కొన్ని సింపుల్ చిట్కాలతో, ఎక్కువగా కష్టపడకుండా శుభ్రం చేయొచ్చు. దీంతో అవి కొత్తవాటిలా కనిపిస్తాయి.
రాగి పాత్రలను ఎలా శుభ్రం చేయాలి?
నిమ్మకాయ, ఉప్పు
రాగి పాత్రల్ని శుభ్రం చేయడానికి నిమ్మకాయను, ఉప్పును ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది సింపుల్ చిట్కానే అయినా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. నిమ్మకాయంలో ఉండే సిట్రిక్ యాసిడ్ రాగి పాత్రల్ని క్లీన్ చేయడానికి సహాయపడుతుంది. ఇందుకోసం ఒక నిమ్మకాయను తీసుకుని రెండు ముక్కలు చేయండి.
సగం ముక్కను తీసుకుని దానిపై కొంచెం ఉప్పును చల్లండి. దీన్ని రాగి పాత్రలకు రుద్దండి. కొన్ని నిమిషాలు దీన్ని వదిలేసినా, అప్పుడే నీళ్లతో శుభ్రం చేసినా రాగి పాత్రలు తలతలా మెరిసిపోతాయి. వీటికి అంటుకున్న మురికి, మరకలు పూర్తిగా తొలగిపోతాయి. ఇలా కాకుండా మీరు నిమ్మరసంలో ఉప్పును కలిపి స్క్రబ్బర్ లేదా క్లాత్ తో కూడా పాత్రలకు పెట్టొచ్చు.
వెనిగర్, గోధుమ పిండి
వెనిగర్, గోధుమ పిండిని ఉపయోగించి కూడా రాగి పాత్రలను సులువుగా శుభ్రం చేయొచ్చు. ఇందుకోసం ఒక టీ స్పూన్ వెనిగర్ ను తీసుకుని అందులో కొంచెం గోధుమ పిండిని వేసి పేస్ట్ చేయండి. దీన్ని రాగి పాత్రలకు పెట్టండి. తర్వాత స్పాంజ్ ను తడిగా చేసి పాత్రపై నెమ్మదిగా రుద్ది నీళ్లతో శుభ్రం చేస్తే సరిపోతుంది.
టమాటా గుజ్జు
నిమ్మకాయలో మాదిరిగానే టమాటాలో కూడా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి మీరు రాగి పాత్రలను శుభ్రం చేయడానికి టమాటా గుజ్జును కూడా ఉపయోగించొచ్చు. దీనివల్ల రాగి పాత్రలపై ఉన్న మరకలు పూర్తిగా తొలగిపోతాయి. ఇందుకోసం ఒక టమాటా తీసుకుని మిక్సీలో వేసి పేస్ట్ చేయండి. దీన్ని రాగి పాత్రకు రాసి 10 నిమిషాల తర్వాత బ్రష్ తో రుద్ది కడిగేస్తే సరిపోతుంది.
బేకింగ్ సోడా, నిమ్మకాయ
బేకింగ్ సోడా, నిమ్మకాయ కూడా రాగి పాత్రలను శుభ్రం చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఇది మంచి క్లీనింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని రాగి పాత్రలకు రాసి ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత నీళ్లతో కడిగితే కొత్తవాటిలా మెరిసిపోతాయి.
చింతపండు
చింతపండును కూడా రాగి పాత్రలను శుభ్రం చేయడానికి ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది చాలా సింపుల్ పద్దతి. రాగి పాత్రలను ఇది చాలా నీట్ గా శుభ్రం చేస్తుంది. ఇందుకోసం కొంచెం చింతపండును తీసుకుని కొన్ని నీళ్లలో అరగంట పాటు నానబెట్టండి. ఇది మెత్తగా అయిన తర్వాత నీళ్లలో మాష్ చేయండి. దీన్ని రాగి పాత్రలకు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత స్క్రబ్బర్ తో బాగా కడగండి. దీంతో పాత్రలు కొత్తవాటిలా కనిపిస్తాయి.
వెనిగర్, ఉప్పు
వెనిగర్, ఉప్పును ఉపయోగించి రాగిపాత్రలపై పేరుకుపోయిన నలుపును సులువుగా పోగొట్టొచ్చు. ఇందుకోసం ఉప్పును, వైట్ వెనిగర్ ను సమానంగా తీసుకుని మిక్స్ చేయండి. దీనిలో రాగి పాత్రలను నానబెట్టండి. కొన్ని సెకన్ల పాటు ఉంచితే సరిపోతుంది. తర్వాత నీళ్లతో కడిగేసుకుంటే రాగి పాత్రలు తలతలా మెరిసిపోతాయి. అలాగే రాగి పాత్రలను వాడిన వెంటనే కడగడం వల్ల దానిపై మరకలు, పచ్చదనం తక్కువగా ఏర్పడుతుంది. కడిగి పొడి క్లాత్ తో తుడిచి పెట్టుకుంటే రాగి పాత్రలు శుభ్రంగా ఉంటాయి.