జుట్టును ఆరోగ్యంగా, పొడవుగా పెంచే మందార పూల నూనె.. ఇంట్లోనే ఇలా తయారుచేసుకోండి
జుట్టును ఆరోగ్యంగా పొడవుగా పెంచాలనుకుంటే మందార పూలతో నూనెను తయారుచేసుకోవచ్చు. దీనికి పెద్దగా ఖర్చు కూడా కాదు. మందార పూల హెయిర్ ఆయిల్ ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకుంటే ఎంతో మంచిది.

జుట్టు రాలకుండా అడ్డుకునే నూనె
మారుతున్న వాతావరణం, పెరుగుతున్న కాలుష్యం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల నేటి కాలంలో చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. కొందరికి జుట్టు విపరీతంగా రాలిపోతుంటే, మరికొందరికి పొడిబారి నిర్జీవంగా మారడం, చుండ్రు వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడటానికి చాలామంది ఖరీదైన రసాయన సీరమ్‌లు, హెయిర్ మాస్క్‌లను వాడుతుంటారు. కానీ రసాయనాలు లేని సహజమైన పరిష్కారం మన ఇంట్లోనే అందుబాటులో ఉంది. అదే మందార నూనె. అధ్యయనం ప్రకారం మందార నూనె వాడటం వల్ల బట్టతల వంటి సమస్యలను కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. ఈ అద్భుతమైన మందార నూనెను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
మందారపూల టీ తయారీ
ఇందుకోసం ఒక కప్పు కొబ్బరి నూనె, ఎనిమిది నుంచి పది మందార పూలు, అంతే సంఖ్యలో మందార ఆకులు తీసుకోవాలి. కొబ్బరి నూనెకు బదులుగా ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనెను కూడా ఉపయోగించవచ్చు. ముందుగా మందార పూలు, ఆకులను ఎండలో కానీ ఫ్యాన్ గాలికి కానీ ఇరవై నాలుగు గంటల పాటు బాగా ఆరబెట్టాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక అందులో మందార పొడిని వేసి సన్నని మంటపై కనీసం పది నిమిషాల పాటు మరిగించాలి. ఇలా చేయడం వల్ల మందారలోని పోషకాలన్నీ నూనెలోకి బాగా దిగుతాయి. నూనె పూర్తిగా చల్లారిన తర్వాత వడకట్టి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.
నూనెను ఇలా వాడండి
తయారు చేసుకున్న ఈ నూనెను సరైన పద్ధతిలో వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఒక చిన్న గిన్నెలో రెండు చెంచాల నూనె తీసుకుని, దూది సహాయంతో తల మాడుకు అంటే జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. ఆ తర్వాత వేళ్లతో సున్నితంగా ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. నూనె రాసుకున్న నలభై నుంచి నలభై ఐదు నిమిషాల తర్వాత గాఢత తక్కువగా ఉండే మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈ నూనెను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గి కుదుళ్లు బలంగా మారతాయి. మరింత మెరుగైన ఫలితాల కోసం రాత్రిపూట నూనె రాసుకుని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయడం ఉత్తమం.













