Healthy period: పీరియడ్స్ టైంలో వీటిని తింటే నొప్పి వెంటనే తగ్గుతుంది..
Healthy period: పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, వికారం, అలసట, చికాకు వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

రుతుస్రావం (Menstruation) అనేది స్త్రీ శరీరంలో ఒక సహజ ప్రక్రియ. ఇక ఈ సమయంలో ఆడవారికి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా పొత్తికడుపు నొప్పి, వాంతులు, మైకముతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు.
ఈ నొప్పులు, ఇతర సమస్యలు బహిష్టు (Menstruation) అయిన వెంటనే లేదా రుతుస్రావం అయిన మొదటి రోజునే వస్తాయి. అయితే కొన్ని రకాల ఆహారాలు ఈ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయని PCOs and Gut Health Nutritionist అవంతి దేశ్ పాండే చెబుతున్నారు. అవేంటే ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కాల్షియం, మెగ్నీషియం, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మరియు ఇనుము అధికంగా ఉండే ఆహారాలు ఆరోగ్యకరమైన రుతుస్రావానికి సహాయపడతాయి. ఈ ఆహారాలు మానసిక స్థితి మెరుగుపరుస్తాయి. అలాగే నొప్పిని కూడా తగ్గిస్తాయి. హార్మోన్లు సమతుల్యతకు కూడా సహాయపడతాయి.
కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు మానసిక స్థితిని, రుతుస్రావం నొప్పిని, పిఎంఎస్ లక్షణాలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాల్షియం అధికంగా ఉండే ఆహారాలలో పాలు, పాల ఉత్పత్తులు (Dairy products) ముఖ్యంగా పెరుగు, చియా విత్తనాలు, ఆకుకూరలు, కాయధాన్యాలు ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. బియ్యం, గోధుమలు, కాయధాన్యాలు వంటి తృణధాన్యాలు మరియు ఆకుకూరలు మాంగనీస్ ను ఎక్కువగా కలిగి ఉంటాయి.
మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు ప్రొజెస్టెరాన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. రుతువిరతి దశలో ఇది ఎంతో సహాయపడుతుంది. ఓట్స్, గోధుమలు, విత్తనాలు, బాదం, పెరుగు, చేపలు, బ్రోకలీ, క్యారెట్లు, అరటిపండ్లు, కివి, బొప్పాయి, జామ, ఎండిన అత్తి పండ్లు మరియు బెర్రీలు వంటి పండ్లలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పీరియడ్స్ నొప్పిని తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. సార్డినెస్, సాల్మన్ వంటి కొవ్వు చేపల్లో ఇది సమృద్ధిగా ఉంటుంది, అలాగే అవిసె గింజలు, గుమ్మడికాయ విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం వంటి గింజల్లో ఇది ఎక్కువగా ఉంటుంది.
రాగి, వేరుశెనగ, బాదం, వాల్ నట్స్ వంటి వాటిలో ఇనుము అధికంగా ఉంటుంది. ఇవి కూడా నొప్పిని తగ్గిస్తాయి. పీరియడ్స్ సమయంలో స్వీట్స్ ను తినాలనకుకుంటే ఐస్ క్రీములు లేదా ఇతర బేకరీ స్నాక్స్ మానేసి నువ్వులు, బెల్లం, డార్క్ చాక్లెట్ వంటివి తినొచ్చని అవంతి దేశ్ పాండే చెప్పారు.