కౌగిలింతతో ఇన్ని లాభాలున్నాయా?
కౌగిలి ఒక వ్యక్తిపై ఉన్న ప్రేమను తెలపడమే కాదు.. ఇది మన శరీరానికి ఔషదంలాగే పనిచేస్తుంది తెలుసా..? అవును ఇష్టమైన వారిని రోజూ కాసేపు కౌగిలించుకోవడం వల్ల మానసిక, శారీరక సమస్యలు తగ్గిపోతాయి.
కౌగిలి ఇద్దరి మధ్య బంధాన్ని బలపర్చడమే కాదు.. ప్రేమను కూడా పెంచుతుంది. అంతెందుకు ఈ కౌగిలి భార్యా భర్తల మధ్య సెక్స్ ను ప్రేరేపిస్తుంది కూడా. ఈ కౌగిలి ప్రేమికులకు, భార్యా భర్తలకు, తల్లీ బిడ్డలకు, తండ్రీ కొడుకులకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పవిత్ర బంధానికి పునాది కూడా. కౌగిలితో ఎన్నో మానసిక, ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఇష్టమైన వారిని కౌగిలించుకోవడం వల్ల స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ ఉత్పత్తి తగ్గుతుంది. అంటే కౌగిలితో ఒత్తిడి తగ్గుతుందన్న మాట. అంతేకాదు హగ్ తో ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. దీంతో మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. హగ్ తో ఇంకా ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం పదండి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
కౌగిలించుకోవడం వల్ల ఒత్తిడంతా పోయి.. ఆనందం కలుగుతుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు శరీరంలో సెరోటోనిన్, ఆక్సిటోసిన్ హార్మోన్లు విడుదల అవుతాయి. ఈ సెరోటోనిన్ గట్ ఆరోగ్యానికి సంబంధించినది. ఈ గట్ ఆరోగ్యం రోగనిరోధక శక్తికి సంబంధించినది. సెరోటోనిన్ విడుదలైనప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, అనారోగ్యంతో పోరాడటానికి, మంటను తగ్గించడానికి, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
గుండెను కాపాడుతుంది
కౌగిలి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ కొద్ది సమయం కౌగిలించుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. హగ్ వల్ల ఆక్సిటోసిన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో అధిక రక్తతపోటు నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల గుండెపోటు ప్రమాదం తప్పుతుంది. పార్టనర్ లేదా ఫ్రెండ్ ను కౌగిలించుకోవడం వల్ల గుండె ఆనందంతో నిండిపోతుంది. గుండెను ప్రమాదంలో పడేసే ఒత్తిడి, అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి పెద్దగా మీరు కష్టపడిపోవక్కర్లేదు. కౌగిలించుకుంటే సరిపోతుంది.
నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది
కౌగిలి కొన్నిసార్లు మెదడును చేరుకునే నొప్పి సంకేతాలను నిరోధిస్తుంది. శరీరక నొప్పి ఉన్నప్పుడు మీకు ఇష్టమైన వారిని కౌగిలించుకోవడం, వారి చేతులను పట్టుకోవడం వల్ల నొప్పి చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కౌగిలి నొప్పిని తట్టుకోవడానికి మనకు సహాయపడుతుంది.
ప్రేమను పెంచుతుంది
కౌగిలి భాగస్వాముల మధ్య దూరాన్ని తగ్గించి ప్రేమను పెంచుతుంది. కౌగిలి ఆక్సిటోసిన్ హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఈ ఆక్సిటోసిన్ ను "లవ్ హార్మోన్" అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది ముద్దు, కౌగిలింత, లైంగిక కోరికలను ప్రేరేపిస్తుంది. భార్యా భర్తలు అన్యోన్యంగా, సెక్స్ లైఫ్ బాగుండాలంటే కౌగిలి చాలా ముఖ్యం.
ఫీల్ గుడ్ హార్మోన్ విడుదల అవుతుంది
ఇష్టమైన వారి చేతులు తాకినప్పుడు లేదా కౌగిలించుకున్నప్పుడు లేదా పట్టుకున్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దీని వల్ల శరీరం ప్రశాంతంగా, ఒకరకమైన హాయి అనుభూతిలో ఉంటుంది. అలాగే ఇది ఇతరులతో కనెక్ట్ అవడానికి సహాయపడుతుంది. దీనిలో డోపామైన్, సెరోటోనిన్ అనే హార్మోన్ కూడా ఉన్నాయి. ఇవి శరీరంలో విడుదలైన తర్వాత సంతోషం కలుగుతుంది. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. నిరాశ, ఆందోళన వంటి సమస్యలు ఉండవు.
బిడ్డ ఆరోగ్యానికి మంచిది
పిల్లలకు తల్లిదండ్రుల కౌగిలి చాలా అవసరం. తల్లిదండ్రుల స్పర్శతోనే బిడ్డ ఎలాంటి భయాలు లేకుండా ఉండగలుగుతారు. వారిని ప్రోత్సహిస్తూ.. ప్రేమతో కౌగిలించుకుంటే వారిలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. వారి శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి. నొప్పి నుంచి ఉపశమనం కూడా పొందుతారు. ఇది మెదడు సక్రమంగా పనిచేయడానికి, సంక్రామ్యత, హైపోథెర్మియా మొదలైన ఇతర వ్యాధులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్ వల్ల బిడ్డ సంతోషంగా ఉంటాడు. రాత్రిళ్లు హాయిగా నిద్రపోతారు.