గ్రీన్, రెడ్ బెండకాయల్లో.. ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ మంచిది..?
ఎర్ర బెండకాయలను చూసిన వారు చాలా తక్కువే.. ఇక అందులో వాటిని తిన్న వారు ఇంకా తక్కువ సంఖ్యలో ఉంటారు. మనం ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉండే బెండకాయలనే తింటూ ఉంటాం.. మరి ఈ ఎరుపు, ఆకుపచ్చ బెండకాయల్లో పోషకాలు దేనిలో ఎక్కువగా ఉంటాయో తెలుసుకుందాం పదండి..

మీకు తెలుసా.. మన ఆరోగ్యానికి మాంసాహారం కంటె కూరగాయలే ఎక్కువ మంచివి. వీటినుంచే మన శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అందుకే కూరగాయాలను ఎక్కువగా తినాలని డాక్టర్లు చెప్తుంటారు. ఇకపోతే కూరగాయల్లో ఒకటైన బెండకాయ గురించి అందరికీ తెలుసు. బెండకాయలను ఎక్కువగా తింటే లెక్కలు బాగొస్తాయని నమ్మేవారు చాలా మందే ఉన్నారు. దీనిలో నిజమెంతుందో కానీ.. ఇవి మెమోరీ పవర్ ను బాగా పెంచుతాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అయితే ఆకు పచ్చ బెండకాయలను కాకుండా ఎరుపు రంగులో ఉండే బెండకాయలను మీరెప్పుడైనా చూసారా? ఈ ఎరుపు బెండకాయలను చాలా తక్కువగా పండిస్తారు. వీటిని ఆకుపచ్చ బెండకాయల కంటే కాస్త ఎక్కువ ధరకే అమ్ముతారు.
అయితే ఈ రెండు బెండకాయలను చూసినప్పుడు వీటిలో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందన్న ఆలోచన వస్తుంటుంది. మరీ ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆకుపచ్చ బెండకాయల కంటే ఎరుపు రంగులో ఉండే బెండకాయలే ఆరోగ్యానికి ఎక్కువ మంచిది. అంటే దీనిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆకుపచ్చ బెండకాయకు క్లోరోఫిల్ కారణంగా ఆకుపచ్చ రంగు వస్తుంది. ఇక ఎరుపు బెండకాయలు ఆంథోసైనిన్ అనే వర్ణద్రవ్యంతో ఎరుపు రంగులో ఉంటాయి.
ఆకుపచ్చ బెండకాయలతో పోల్చితే ఎరుపు బెండకాయలను తింటే మన శరీరంలో ఐరన్ , హిమోగ్లోబిన్ 30 శాతం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఐరన్, కాల్షియం కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుందట.
ఎరుపు బెండకాయను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఈ ఎరుపు బెండకాయల్లో ఫోలేట్, విటమిన్ బి లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పోషకాలు గర్భిణీలకు చాలా అవసరం. వీటితోనే కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే దీన్ని గర్బిణులకు ప్రయోజనకరమైందిగా భావిస్తారు.
మీకు తెలుసా.. ఎర్ర బెండకాయలను ఎక్కువగా తిన్న వారికి టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందట. ఎందుకంటే ఈ బెండకాయ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందట.
గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు ఎర్ర బెండకాయలను తప్పకుండా తినాలి. ఎందుకంటే ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
ఈ ఎరుపు బెండకాయలో ఫ్లేవనాయిడ్లు, పాలీఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే నియాసిన్, థయామిన్, విటమిన్లు, రిబోఫ్లోవిన్ కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటాయి. ఈ ఎర్ర బెండకాయల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ కూరగాయలో సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి. ఇవి రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. దీంతో రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. ఈ బెండకాయ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.