Gold Jewellery: మనం రోజూ వేసుకునే బంగారం ఏడాదికి ఎంత అరిగిపోతుందో తెలుసా?
Gold Jewellery: చాలామంది బంగారు నగలను రోజూ వేసుకొని మురిసిపోతుంటారు. కానీ మనం వేసుకునే నగలు పదేళ్ల తర్వాత కూడా అదే బరువుతో ఉంటాయా? రోజూ వేసుకోవడం వల్ల బంగారం అరిగిపోతుందా? ఐదేళ్లు, పదేళ్ల ఏళ్ల పాటు ఉపయోగిస్తే ఎంత బంగారం తగ్గే అవకాశం ఉంటుందో చూద్దాం.

రోజూ వేసుకోవడం వల్ల బంగారం అరిగిపోతుందా?
బంగారం అంటే ఇష్టపడనివారు చాలా తక్కువ. ముఖ్యంగా మహిళలకు బంగారానికి విడదీయరాని బంధం ఉంటుంది. పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల్లో మాత్రమే కాకుండా.. కొంతమంది రోజూ బంగారు గొలుసులు, ఉంగరాలు, గాజులు, చెవిపోగులు పెట్టుకుంటారు. అయితే మనం కొన్న బంగారు నగలు ఎప్పటికీ అదే బరువుతో ఉంటాయా? రోజూ వేసుకోవడం వల్ల వాటి బరువు తగ్గుతుందా? ఐదేళ్లు, పదేళ్లు, ఇరవై ఏళ్ల పాటు వాడితే ఎంత బంగారం అరిగిపోతుంది? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
బంగారు నగలు ఎందుకు అరుగుతాయి?
సాధారణంగా బంగారం మెత్తని లోహం. అందుకే స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలు తయారు చేయడం చాలా అరుదు. నగలు గట్టిగా ఉండేందుకు రాగి, వెండి వంటి ఇతర లోహాలను కలిపి 22 క్యారెట్లు, 18 క్యారెట్ల ఆభరణాలను తయారు చేస్తారు. అయినప్పటికీ రోజూ ధరించడం వల్ల నగలు ఇతర వస్తువులకు తగలడం, ఒకదానితో మరొకటి రాపిడికి గురికావడం, చెమట, దుమ్ము, ధూళి ప్రభావం వంటి కారణాలతో వాటి ఉపరితలంపై స్వల్పంగా అరుగుదల ఏర్పడుతుంది. ముఖ్యంగా ఉంగరాలు, గాజులు ఎక్కువగా వస్తువులకు తగులుతుంటాయి. దీంతో కాలక్రమంలో వాటి అంచులు, ఉపరితల భాగాలు కొంత అరిగే అవకాశం ఉంటుంది.
గొలుసులు, నెక్లెస్లు ఎంత అరుగుతాయి?
బంగారు గొలుసులు సాధారణంగా ఉంగరాలు, గాజులతో పోలిస్తే తక్కువ రాపిడికి గురవుతాయి. అయితే గొలుసులోని లింకులు ఒకదానితో మరొకటి నిరంతరం రాసుకోవడం వల్ల క్రమంగా అరుగుదల ఏర్పడుతుంది. ముఖ్యంగా మెడలో రోజూ ధరించే సన్నని గొలుసుల్లో హుక్స్, జాయింట్లు, లింకుల దగ్గర అరుగుదల ఎక్కువగా ఉండవచ్చు.
22 క్యారెట్ల బంగారం ఎక్కువ అరుగుతుందా?
బంగారం క్యారెట్లను బట్టి దాని స్వచ్ఛత మారుతుంది. 24 క్యారెట్ల బంగారంలో దాదాపు 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 22 క్యారెట్లలో సుమారు 91.6 శాతం, 18 క్యారెట్లలో 75 శాతం బంగారం ఉంటుంది. మిగిలిన భాగంలో ఇతర లోహాలు ఉంటాయి. సాధారణంగా ఎక్కువ స్వచ్ఛత కలిగిన బంగారం మెత్తగా ఉంటుంది. అందువల్ల 22 క్యారెట్ల నగలపై గీతలు, చిన్నపాటి డెంట్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. 18 క్యారెట్ల నగలు కొన్ని సందర్భాల్లో ఎక్కువ గట్టిదనాన్ని కలిగి ఉంటాయి.
ఐదేళ్లు, పదేళ్లలో ఎంత బంగారం తగ్గుతుంది?
రోజూ వేసుకునే బంగారు నగలు ఐదేళ్లకు ఇన్ని గ్రాములు, పదేళ్లకు ఇన్ని గ్రాములు తగ్గుతాయని కచ్చితంగా చెప్పలేము. కానీ కొన్ని అంచనాల ప్రకారం రోజూ వేసుకునే బంగారం ఏడాదికి 0.01 గ్రాముల నుంచి 0.05 గ్రాముల వరకు తగ్గే అవకాశం ఉందట. అది కూడా నగలను ఉపయోగించే విధానంపై ఆధారపడి ఉంటుందట.
పాలిష్ చేయిస్తే బంగారం తగ్గుతుందా?
బంగారు నగలు కొన్నేళ్లు వాడిన తర్వాత వాటి మెరుపు తగ్గుతుంది. చిన్న చిన్న గీతలు కనిపిస్తాయి. దీంతో చాలామంది నగలను పాలిష్ చేయిస్తుంటారు. అయితే పాలిష్ చేసే సమయంలో నగ ఉపరితలంపై ఉండే అతి పలుచని లోహపు పొర తొలగిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొంత బంగారం తగ్గొచ్చు. ఒక్కసారి పాలిష్ చేయిస్తే పెద్దగా తేడా కనిపించకపోయినా.. పదేపదే పాలిష్ చేయిస్తే మాత్రం బరువులో తేడా కనిపించే అవకాశం ఉంది.
నగలు ఎక్కువకాలం మన్నికంగా ఉండాలంటే?
బంగారు ఆభరణాలు ఎక్కువకాలం అందంగా, మన్నికగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి పనులు చేసేటప్పుడు, బరువైన వస్తువులు ఎత్తేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు ఉంగరాలు, గాజులు తీసి భద్రపరచడం మంచిది. సబ్బులు, డిటర్జెంట్లు, బ్లీచింగ్ వంటి రసాయన పదార్థాలను నగలపై ఎక్కువగా పడకుండా చూసుకోవాలి. ఒక నగను మరొక నగతో కలిపి ఉంచకుండా వేర్వేరుగా భద్రపరచడం మంచిది.













