బాత్రూమ్ డ్రెయిన్‌లో చిక్కుకున్న వెంట్రుకలను తొలగించాలా? సింపుల్ టిప్స్ ఇవిగో!
Bathroom Drain: బాత్రూమ్ డ్రెయిన్‌లో వెంట్రుకలు చిక్కుకుపోయి తరచూ నీరు ఆగిపోతూ ఉంటుంది కదా.. ఈ వెంట్రుకలను తొలగించడానికి ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో సులభంగా తొలగించవచ్చు. అదెలాగో ఇక్కడ చూద్దాం.

సాధారణంగా తల స్నానం చేసినప్పుడు వెంట్రుకలు ఊడి పడి డ్రెయిన్ దగ్గర చిక్కుకుపోతుంటాయి. వీటిని తీయడం కష్టమైన పనే. అవి ఒక పట్టాన రావు. పోనీ నీళ్లు ఎక్కువ పోస్తే డ్రెయిన్ లోకి వెళ్లిపోతాయా అంటే అదీ జరగదు. అందుకే నీరు నిలిచిపోతుంది.
కొందరు ఇలాంటి వెంట్రుకలను శుభ్రం చేయడానికి యాసిడ్ లాంటివి వాడతారు. అలాంటి రసాయన పదార్థాల అవసరం లేకుండా ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో కొన్ని నిమిషాల్లోనే వెంట్రుకలను తొలగించవచ్చు. అవేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
బేకింగ్ సోడా, వెనిగర్
బాత్రూమ్ డ్రెయిన్‌ను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, వెనిగర్ మీకు ఉపయోగపడతాయి. దీనికి ముందుగా బాత్రూమ్ డ్రెయిన్‌లో బేకింగ్ సోడాను వేయాలి. ఆ తర్వాత దానిపై వెనిగర్ పోయాలి. నీళ్లు పోయకుండా కొద్దిసేపు అలాగే ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత వేడి నీటిని డ్రెయిన్‌లో పోయాలి. బేకింగ్ సోడా, వెనిగర్ కలిసి ఒక రసాయన చర్య జరిగి చిక్కుకున్న వెంట్రుకలు సులభంగా డ్రెయిన్ లోకి వెళ్లిపోతాయి.
ఇది కూడా చదవండి: వేసవిలో ప్రతి నీటి బొట్టు బంగారమే.. నీటిని పొదుపుగా వాడేందుకు సింపుల్ టిప్స్
ఉప్పు, వేడి నీరు
మీ బాత్రూమ్ డ్రెయిన్ వెంటుక్రలతో మూసుకుపోయిందా? దాన్ని శుభ్రం చేయడానికి ముందుగా మూసుకుపోయిన డ్రెయిన్‌లో ఉప్పు వేయండి. ఆ తర్వాత మరిగే నీటిని అందులో పోసి అలాగే ఉంచండి. ఉప్పు వెంట్రుకలను తేలిక చేస్తుంది. దీనివల్ల వెంట్రుకలను సులభంగా తొలగించవచ్చు.
కోకా కోలా
కోకా కోలా వంటి కూల్ డ్రింక్ సహాయంతో బాత్రూమ్‌లో చిక్కుకున్న వెంట్రుకలను తొలగించవచ్చు. దీనికి బాత్రూమ్ డ్రెయిన్‌లో కోకా కోలాను పోసి కొద్దిసేపు అలాగే ఉంచండి. అందులో ఉండే కార్బోనిక్ ఆమ్లం వెంట్రుకలను ముక్కలు చేయడానికి సహాయపడుతుంది. దీంతో మీరు వెంట్రుకలను తేలికగా శుభ్రం చేయవచ్చు.