Recipes: డ్రై గులాబ్ జామున్ .. స్పెషల్ అకేషన్ కోసం.. స్పెషల్ స్వీట్!
Recipes: డ్రై గులాబ్ జామున్ ఇది పన్నీర్ తో చేయబడే రుచికరమైన వంటకం పండగలప్పుడు, ప్రత్యేక సందర్భాలలోనూ చేసుకోవటానికి ఈ స్వీట్ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా ఇంట్లో గులాబ్ జామున్లు చేసుకుంటాం కానీ డ్రై గులాబ్ జామున్ అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన స్వీట్. ఇది రొటీన్ గా మనం చేసుకునే గులాబ్ జామున్లు కన్నా చాలా భిన్నంగా ఉంటాయి. పండగలకి, ప్రత్యేక సందర్భాలకి చేసుకోవడానికి ఈ స్వీట్ చాలా బాగుంటుంది.
ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. కోవా 300 గ్రాములు, 200 గ్రాముల పన్నీర్ తురుము, నాలుగు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్, మైదా 3/4 కప్పు, 1/4 టీ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ చక్కెర పొడి, ఒకటిన్నర కప్పు చక్కెర అరకప్పు డెసికేటెడ్ కొబ్బరి,
రెండు కప్పులు నెయ్యి. ముందుగా చక్కెరని లేత పాకం వచ్చేవరకు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకొని కోవా, తురిమిన పన్నీరు, పాలపొడి, యాలకుల పొడి, పంచదార పొడి వేసి బాగా కలపండి.
దీనిపై మెల్లగా మైదా వేసి ఇంకా గట్టి పిండిలాగా కలపండి. చిన్న నిమ్మకాయ సైజులో బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ లో నెయ్యి వేడి చేసి అది తగినంత వేడి అయ్యాక ఈ బాల్స్ అందులో వేసి వేయించండి.
గోధుమ రంగు వచ్చేవరకు వేయించండి మరీ ముదురు గోధుమ రంగు అయ్యేవరకు వేయించకండి. చేదు వచ్చేస్తుంది.వీటిని తీసి ఇందాక మనం చేసి పెట్టుకున్న లేత పంచదార పాకంలో వేయాలి.
ఒక రెండు నిమిషాలు ఉంచి తర్వాత వెంటనే తీసి వేరే ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఎండు కొబ్బరిని ఒక ప్లేట్లో వేసి ఈ జామున్లు అన్ని ఆ ఆ కొబ్బరి పై పూత వచ్చేలాగా అందులో దొర్లించండి. ఇంకేముంది రుచికరమైన డ్రై గులాబ్ జామున్ రెడీ. ఇక వడ్డించడమే తరువాయి.