Paneer: పనీర్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుందా?
శాకాహారులకు అత్యంత ఇష్టమైన వంటలలో పనీర్ (Paneer)తో చేసిన వంటకాలు ప్రథమ స్థానంలో ఉంటాయి. దీంతో చేసే బిర్యాని, పాలక్ పనీర్, పనీర్ బటర్ మసాలా వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే పనీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలో పెరుగుతాయా?

పనీర్ ఎంతో ప్రత్యేకం
భారతీయ ఆహారంలో పనీర్ ఎప్పుడో భాగం అయిపోయింది. ముఖ్యంగా శాఖాహార ఆహారాలలో ప్రత్యేకమైన వంటలంటే కచ్చితంగా పనీర్ ఉండాల్సిందే. పనీర్లో ఉండే ప్రోటీన్, కాల్షియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో కూరలే కాదు ఎన్నో రకాల స్నాక్స్ కూడా తయారు చేయవచ్చు. పనీర్ ను పూర్తిగా క్రీమ్ నిండిన పాలతో తయారుచేస్తారు. అయితే ఎంతో మందికి పనీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలో శరీరంలో పెరుగుతాయనే ఆందోళన ఉంది. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం
పనీర్ అధికంగా తింటే...
పనీర్.. పాల నుండి వచ్చే ఉత్పత్తి. కాబట్టి ఇందులో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్.. రెండూ ఉంటాయి. పనీర్ ను అధిక స్థాయిలో తింటే మాత్రం సంతృప్త కొవ్వులు శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అవుతాయి. పనీర్ ను పూర్తిగా కొవ్వు ఉన్న పాలతో లేదా ఎక్కువ నూనెతో కలిపి వండినప్పుడు కొలెస్ట్రాల్ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. నిజానికి మన శరీరానికి ఎంతో కొంత కొలెస్ట్రాల్ అవసరం.. కానీ పరిమితికి మించి కొలెస్ట్రాల్ ఉంటే అది చెడు కొలెస్ట్రాల్ గా మారిపోతుంది. శరీరం బరువు పెరుగుతుంది. అంతే కాదు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాన్ని కూడా పెంచుతుంది.
కొలెస్ట్రాల్ అవసరమేనా?
కొలెస్ట్రాల్ పూర్తిగా హానికరమని చెప్పలేము. కొలెస్ట్రాల్ తో మన శరీరానికి ఎంతో ఉపయోగముంది. ఇది హార్మోన్ల ఉత్పత్తికి కణాల పని తీరుకు అవసరమైనవి. అయితే చెడు కొలెస్ట్రాల్ ఎప్పుడైతే శరీరంలో పేరుకుపోతుందో అప్పుడే సమస్య మొదలవుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. మీరు ఎప్పుడైతే పనీర్ ను తింటారో ఆ రోజు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తినేందుకు ప్రయత్నించండి. ఇది ఆహారాన్నీ సమతుల్యం చేస్తుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా అడ్డుకోవచ్చు. ఎప్పుడైతే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందో గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఎక్కువ.
తక్కువ కొవ్వు ఉన్న పాలతో...
పనీర్ ని ఎప్పుడూ కూడా పరిమితంగానే తినాలి. దీనిలో ఆరోగ్యకరమైన ప్రోటీన్ ఉంటుందనేది నిజమే. అయితే అధికంగా తింటే చెడు కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోవచ్చు. ముఖ్యంగా మీరు కొనే పనీర్ తక్కువ కొవ్వు ఉన్న పాలతో తయారు చేసినది అయితే ఉత్తమం. అలాగే పనీర్ ను కూరగాయలు, పప్పులతో కలిపి వండడం వల్ల దాని వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. ఎవరైతే బరువు అధికంగా ఉన్నారో వారు పనీర్ ను చాలా తక్కువగా తినాలి. లేకుంటే బరువు నిర్వహణ కష్టమైపోతుంది.
బరువు పెరుగుతారు జాగ్రత్త
బరువు తగ్గాలనుకునే వారికి కూడా పనీర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మీరు పనీర్ తో ఆహారాన్ని తిన్నప్పుడు అది మిమ్మల్ని ఎక్కువసేపు ఆకలి వేయకుండా అడ్డుకుంటుంది. అయితే పనీర్ ను అధికంగా తినకూడదు. పరిమితంగా తినాలి. పొట్ట నిండిపోయే వరకు పనీర్ ను తింటే అందులో సగం కొలెస్ట్రాల్ రూపంలో పేరుకుపోయే అవకాశం ఉంది. అలాగే క్యాలరీలు, కొవ్వు శాతం పెరిగి బరువు కూడా పెరిగిపోతారు. కాబట్టి పరిమితంగా తింటే మీరు బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అదే అధికంగా తింటే బరువు పెరిగిపోయే అవకాశం ఉంది.
పనీర్ ఎవరు తినకూడదు?
అయితే పనీర్ ను ఎవరు తినకూడదో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. మీ కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఉంటే పనీర్ తీసుకోవడానికి చాలా తగ్గించాలి. అలాగే నూనెలో వేయించిన పనీర్ ను తినకూడదు. ఒకవేళ పనీర్ తినాల్సి వచ్చినా నూనె ఎక్కువగా వేయకుండా.. స్టీమింగ్ లేదా గ్రిల్లింగ్ పద్ధతిలో వండుకొని తినడం ఉత్తమం. లేకుంటే పనీర్లోని కొవ్వుతో పాటు నూనెలో ఉన్న కొవ్వులు కూడా కలిసి శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకు పోవడానికి కారణం అవుతుంది.