Jaggery: చలికాలంలో ప్రతిరోజూ ఒక చిన్న బెల్లం ముక్క ఎందుకు తినాలో తెలుసా?
Jaggery: చలికాలం వచ్చేసింది. ఆరోగ్యాంగా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తినాలి. పెద్దలు చెప్పిన ప్రకారం చలికాలంలో రోజుకో బెల్లం ముక్క తింటే ఎంతో మంచిది. ఇలా రోజు చిన్న ముక్క తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసుకోండి.

చలికాలంలో ప్రతిరోజూ బెల్లం తినాలా?
చలికాలం వచ్చిందంటే రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. అందుకోసం బెల్లం ప్రతిరోజూ తింటే మంచిది. ఇలా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లానికి సహజంగానే వేడి చేసే గుణం ఉంది. చలికాలంలో దీన్ని తీసుకుంటే శరీరంలో వేడి పుడుతుంది. ఇందులో ఉండే ఐరన్, మెగ్నీషియం రక్తహీనతను అడ్డుకుని, రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేస్తాయి. రక్తప్రసరణ బాగున్నప్పుడు చలి అంతగా అనిపించదు.
బెల్లం ఎలా తినాలి?
చలికాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు రావడం సహజం. కొద్దిగా బెల్లం, అల్లం, తులసి ఆకుల మిశ్రమాన్ని తీసుకుంటే గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన మలినాలను శుభ్రం చేయడానికి కూడా బెల్లం చాలా ఉపయోగపడుతుంది.
చలికాలంలో ఆకలి పెరిగి వేయించిన స్నాక్స్, పరోటాలు, హల్వా వంటి బరువైన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటాం. దీనివల్ల కడుపులో గ్యాస్, బరువుగా అనిపించడం జరగవచ్చు. భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.
భారతీయ మహిళల్లో రక్తహీనత చాలా సాధారణం. శరీరం పాలిపోవడం, విపరీతమైన అలసట, తలతిరగడం వంటివి కనిపిస్తాయి. ఐరన్ లోపాన్ని అధిగమించడానికి మీ రోజువారీ ఆహారంలో బెల్లాన్ని ఒక సహజ వనరుగా వాడుకోవచ్చు.
ఎంత బెల్లం తినాలి?
రోజుకు 20 నుంచి 25 గ్రాములు, అంటే ఒక చిన్న బెల్లం ముక్క తింటే చాలు. బెల్లాన్ని ఎప్పుడూ భోజనం తర్వాతే తీసుకోవడం మంచిది. దీన్ని రొట్టెతో లేదా వేడి టీలో పంచదారకు బదులుగా వాడొచ్చు. కానీ పాలలో బెల్లం వేసి మరిగించకండి. పాలను ముందుగా బాగా మరిగించి, స్టవ్ ఆపిన తర్వాతే బెల్లం కలపాలి. లేదంటే పాలు విరిగిపోతాయి.











