- Home
- Feature
- Volcano Bird: అగ్నిపర్వతాల దగ్గర గుడ్లు పెట్టే వింత పక్షి.. పుట్టిన కాసేపటికే ఎగిరే పిల్లలు
Volcano Bird: అగ్నిపర్వతాల దగ్గర గుడ్లు పెట్టే వింత పక్షి.. పుట్టిన కాసేపటికే ఎగిరే పిల్లలు
Volcano Bird: చెట్లపై గుడ్లు పెట్టే పక్షులు తెలుసు.. కానీ వేడిగా ఉండే అగ్నిపర్వతాల దగ్గర గుడ్లు పెట్టే వింత పక్షి గురించి ఇక్కడ చెబుతున్నాము. ఇది గుడ్లు పెట్టిన కొన్ని నిమిషాలకే ఆ పక్షి పిల్లలు ఎగరగలవు. ఆ వింత పక్షుల గురించి తెలుసుకోండి.

అగ్నిపర్వతాల దగ్గర గుడ్లు పెట్టే పక్షి
సాధారణంగా పక్షులు చెట్లపై గూళ్లు కట్టుకుని గుడ్లు పెడతాయి. ఆ తర్వాత వాటిపై కూర్చుని పొదిగి పిల్లలు బయటకు వచ్చేలా చూస్తాయి. కానీ ప్రపంచంలో ఒక పక్షి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది చెట్లపై గూడు కట్టుకోదు. గుడ్లపై కూర్చుని పొదగదు. ఏకంగా అగ్నిపర్వతాల వేడిని ఉపయోగించుకుని తన పిల్లలకు జన్మనిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ వింత పక్షి పేరు మాలియో (Maleo). ఇది ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో ఎక్కువగా కనిపిస్తుంది. మెగాపోడ్ అనే పక్షుల కుటుంబానికి చెందిన ఈ జాతికి బలమైన కాళ్లు, పెద్ద పాదాలు ఉంటాయి. వీటి సాయంతో నేలలో లోతైన గుంతలు తవ్వగలవు.
అగ్నిపర్వతాలనే పొదిగే యంత్రంగా..
మాలియో పక్షులు గుడ్లు పెట్టడానికి అగ్నిపర్వతాల వల్ల వేడెక్కిన నేలను ఎంచుకుంటాయి. సూర్యుడి వేడికి వేడెక్కిన నల్లటి ఇసుకను కూడా ఉపయోగిస్తాయి. ఆడ పక్షి నేలలో సుమారు అర మీటరు లోతు గుంత తవ్వి అందులో గుడ్డు పెడుతుంది. తర్వాత దానిపై మట్టిని కప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. గుడ్డు.. తాను పొదగడానికి కావాల్సిన వేడిని భూమి నుంచి అందుకుంటుంది. ఈ పక్షుల గుడ్లు సుమారు 33 నుంచి 34 డిగ్రీల ఉష్ణోగ్రతలో అభివృద్ధి చెందుతాయి. మాలియో పెట్టే ఒక్కో గుడ్డు బరువు దాదాపు 240 గ్రాములు ఉంటుంది. ఇది సాధారణ కోడి గుడ్డు కంటే సుమారు ఐదు రెట్లు పెద్దది. గుడ్డులో పచ్చసొన ఎక్కువగా ఉండటం వల్ల పిల్ల పెరిగేందుకు కావాల్సిన పోషకాలు అందుతాయి. గుడ్డు నుంచి పిల్ల బయటకు రావడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది.
పుట్టిన కొన్ని గంటల్లోనే ఎగిరే పక్షి పిల్లలు
మాలియో పక్షుల పిల్లలు పుట్టిన తర్వాత మరో అద్భుతం జరుగుతుంది. సాధారణ పక్షుల పిల్లల్లా తల్లిదండ్రుల సాయం కోసం ఎదురుచూడవు. గుడ్డు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేలలోని మట్టిని తవ్వుకుంటూ పైకి వస్తాయి. అప్పటికే వాటి శరీరంపై ఈకలు ఉంటాయి. కళ్లు కూడా తెరిచి ఉంటాయి. బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే ఆకాశంలోకి ఎగరగలవు. తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఆహారం, సంరక్షణ పొందకుండానే తమ జీవితాన్ని ప్రారంభిస్తాయి. ప్రకృతిలో జీవులు తమ పిల్లలను పెంచుకునే పద్ధతులు ఒక్కో రకంగా ఉంటాయని చెప్పడానికి మాలియో పక్షి మంచి ఉదాహరణ.











