ప్రేమ పెళ్లి కంటే.. పెద్దలు కుదిర్చిన పెళ్లే ఎందుకు మంచిదో తెలుసా..?
ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే ఎక్కువగా జరిగాయి. కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెద్దవాళ్లకు పనిలేకుండా పిల్లను లేదా పిలగాన్ని వీళ్లే చూసుకుని పెద్దలను ఎదిరించి మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ ప్రేమ పెళ్లి కంటే పెద్దలు కుదిర్చిన పెళ్లే బెటర్ అని మీకు తెలుసా..?
భారతదేశంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే ఎక్కువగా జరిగేవి. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం కూడా. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు.. చూసి పిల్లను లేదా పిలగాన్ని సెలక్ట్ చేయడం ఎప్పటి నుంచో జరుగుతున్న తంతు. పెళ్లి ఎంత ముఖ్యమో.. వారి కుటుంబం గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం అంటారు పెద్దలు. ఎందుకంటే ఆ జంటకు ఏ కష్టం రాకుండా ఉండాలని. మంచి, చెడులు తెలుసుకుని ఇవ్వడం మంచిదని. కానీ ప్రస్తుతం Arranged marriage ల కంటే ప్రేమ వివాహాలు (Love marriages)లే ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రేమ వివాహాలే మంచివని చాలా మంది నమ్ముతున్నారు కూడా. ఎందుకంటే వివాహం అనేది ఒక సంబంధం పునాదిని నిర్మించే ఒక ముఖ్యమైన అంశం కాబట్టి. లవ్ లో ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకోవడం, వారి గురించి పూర్తిగా తెలుసుకుంటారని. కానీ ప్రేమ పెళ్లి కంటే పెద్దలు కుదిర్చిన పెళ్లే చాలా మంచిదని కొందరంటున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒకరినొకరు తెలుసుకుంటారు: పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఎలాంటి అపార్థాలు వచ్చినా వాటిని అర్థం చేసుకుని ముందుకు వెళతారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపాలని భావిస్తారు. అలాగే తమ భాగస్వామి లైఫ్ స్టైల్ కు అనుగణంగా మారడానికి ప్రయత్నం చేస్తారు. అదే ప్రేమ వివాహంలో అయితే వివాహానికి ముందే తమ భవిష్యత్తు గురుంచి ఎన్నో ఆలోచలు పెట్టుకుంటారు. కానీ వివాహం తర్వాత సామాజిక కట్టుబాట్లకు సంబంధించినప్పుడు ఈ అవగాహనకు కట్టుబడి ఉండటం కష్టం.
కనీస అంచనాలు ఉంటాయి: అరేంజ్డ్ మ్యారేజ్ లో జీవితభాగస్వామి గురించి అంచనాలు చాలా తక్కువగా ఉంటాయి. అదే ప్రేమ వివాహాలైతే అంచనాలతో నిండి ఉంటాయి. అలా ఉంటాం.. ఇది చేయబోతున్నాం.. అని ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఇక ఇవి నిజం కానప్పుడు విడాకుల వరకు దారితీసే ప్రమాదముంది. కానీ అరేంజ్డ్ మ్యారేజ్ లో మాత్రం అలాంటి అంచనాలు తక్కువగా ఉంటాయి. విడాకులు తీసుకునే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
తల్లిద౦డ్రులను ఒప్పి౦చే౦దుకు ప్రయత్నమూ ఉండదు: అరేంజ్డ్ మ్యారేజ్ లో ఇది ముఖ్యమైన అంశమనే చెప్పాలి. ప్రేమించడం ఎంత తేలికో.. ఇరువైపులా తమ ఫ్యామిలీలను ఒప్పించడం అంత కష్టం. కొన్ని కొన్ని సార్లైతే.. ఏండ్లు గడిచినా.. తల్లిదండ్రులు ఒప్పుకోని వారు చాలా మందే ఉన్నారు. ఇంకొంత మంది ప్రేమించిన వాళ్లను పెళ్లి చేసుకుని తల్లిదండ్రులకు దూరమవుతుంటారు. కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఎలాంటి టెన్షన్స్ ఉండవు. ఎవరినీ వదులుకోవాల్సి అవసరమూ రాదు. అందులోనూ తమ బిడ్డ గుణగణాలకు సరిపోయే వారినే జీవిత భాగస్వామిగా తెస్తారు. అయితే కొన్ని కొన్ని సార్లు పెద్దలు కుదిర్చిన సంబంధాలు కూడా విడిపోయే అవకాశం ఉందనుకోండి.
మరింత ఉత్సాహం ఉంటుంది: అరేంజ్డ్ మ్యారేజ్ లో జీవిత భాగస్వామి గురించి పూర్తిగా తెలియదు కాబట్టి ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత ఉంటుంది. అరేంజ్డ్ మ్యారేజ్ లో ఉన్న వ్యక్తులు తమ భాగస్వామి గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటారు. నిశ్చితార్థం తర్వాత వివాహం చేసుకోబోయే జంటలు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఉంటారు. అదే ప్రేమ వివాహంలో తమ భాగస్వామి గురించి తెలుసుకోవడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే పెళ్లికి ముందే వీళ్లన్నీతెలుసుకుంటారు కాబట్టి. అంతేకాదు వీళ్లు ఎక్కువ సేపు కలిసి ఉంటే విసుగు వస్తుంది కూడా. అదే అరేంజ్డ్ మ్యారేజ్ లో అయితే జీవితాంతం భాగస్వామితో మాట్లాడటానికి కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తుంటాయి.