ప్రపంచవ్యాప్తంగా న్యూఇయర్ వేడుకల్లో ఎంత మద్యం తాగారో తెలుసా? లెక్క తెలిస్తే కిక్కు దిగాల్సిందే..
కాలగర్భంలో మరో ఏడాది గడిచిపోయింది. యావత్ ప్రపంచం గ్రాండ్‌గా కొత్తేడాది వెల్‌కమ్ చెప్పింది. 2025లోకి అడుగుపెట్టే అద్భుత క్షణాన్ని ప్రజలంతా సంతోషంగా జరుపుకున్నారు. ఇక న్యూఇయర్ వేడుకల్లో కనిపించే రొటీన్ సీన్ మద్యం. ప్రపంచమంతా మద్యం ఏరులై పారింది. ఈ న్యూఇయర్‌కి ప్రపంచంలోని పలు దేశాల్లో మద్యం ప్రియులు ఎంత విలువైన మద్యాన్ని తాగారో ఇప్పుడు తెలుసుకుందాం..
డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ ఈ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. న్యూఇయర్ వేడుకల్లో మ్యూజిక్, డ్యాన్స్ ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో మద్యం కూడా అంతే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో భారత్‌తో పాటు విదేశాల్లోనూ మద్యం అమ్మకాలు ఓ రేంజ్‌లో జరిగాయి. చాలా వరకు బార్‌లు, పబ్‌లు ప్రజలతో కిక్కిరిసి పోయాయి. ఒక్కరాత్రిలోనే కోట్ల రూపాయాల మద్యాన్ని తాగేశారు.
ప్రముఖ స్టాటస్టిక్స్ పోర్టల్ Statista.com ప్రపంచవ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలకు ఎంత మద్యం తాగారన్నదానికి సంబంధించిన డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం ఆల్కహాల్ వినియోగంలో రొమేనియా మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ తలసరిగా ఒక్కో వ్యక్తి 16.91 లీటర్ల మద్యాన్ని సేవించారు. రొమేనియా తర్వాత జార్జియాలో రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ సగటున 14.4 లీటర్ల మద్యాన్ని సేవించారు.
ఇక 13.3 లీటర్ల తలసరి ఆల్కహాల్ వినియోగంతో చెక్ రిపబ్లిక్ దేశం మూడవ స్థానంలో నిలిచింది. తలసరి ఆల్కహాల్ వినియోగం లాట్వియాలో 12.95 లీటర్లు, జర్మనీలో 12.20 లీటర్లు, సీషెల్స్‌లో 12.13 లీటర్లు, ఆస్ట్రియాలో 12.02 లీటర్లుగా ఉంది. ఇక భారతదేశం విషయానికొస్తే మనదేశంలో ఈ న్యూఇయర్‌కి సగటున 4.96 లీటర్ల మద్యం తీసుకున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. అదే విధంగా మన దాయాది దేశం పాకిస్థాన్‌లో ఈ సంఖ్య 0.11 లీటర్లుగా ఉంది.
కొత్తేడాది రోజు దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని గ్రేటర్ నోయిడాలో రూ. 14 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే డిసెంబర్ 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏకంగా 926 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు గణంకాలు చెబుతున్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఒక్క డిసెంబర్ నెలలోనే సుమారు రూ.4 వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోయిందని తేలింది. డిసెంబర్ 31వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ. 282 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా అందించినవి మాత్రమే. మద్యం విక్రయాలకు సంబంధించి ఎలాంటి ధృవీకరించిన సమచారం లేదు. అయితే మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్తేడాదికి రూ. వేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.