Tea: టీని మళ్ళీ మళ్ళీ వేడి చేసుకొని తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?
వేడివేడిగా కప్పు టీ (Tea) తాగితే ఆ మజాయే వేరు. కానీ ఎంతోమంది ఒకసారి చేసిన టీ ని మళ్లీ మళ్లీ వేడి చేసుకొని తాగుతూ ఉంటారు. ఇది ఎంతో ప్రమాదకరమో తెలుసా? టీని ఎలా తాగకూడదో ఇక్కడ వివరించాము.

కప్పు టీ తాగితేనే...
ఉదయం అయ్యిందంటే కప్పు టీ తాగాల్సిందే. బ్రష్ చేసామా? లేదా? అన్నది అనవసరం. ఒక కప్పు టీ తాగితేనే పొట్ట ప్రశాంతంగా ఉండేది. ఈ అలవాటు భారతదేశంలో ఎంతో మందికి ఉంది. అయితే టీ చల్లారిపోయిన తర్వాత మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తాగే వారు ఎంతోమంది. అది ఏ మాత్రం మంచి పద్ధతి కాదని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఒకేసారి తయారుచేసి
కొందరు ఉదయాన్నే ఒక అర లీటర్ టీ ని తయారు చేసుకుంటారు. ఒక కప్పు టీ తాగి మిగతాది దాచుకుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. పొట్టలో విపరీతంగా ఆమ్లాలు పెరిగిపోతాయి. అలాంటి టీ తాగినా తాగకపోయినా ఒక్కటే.
పొట్ట సమస్యలు
మళ్లీ మళ్లీ వేడి చేసిన టీ ని పదే పదే తాగడం వల్ల కడుపులో మంట, కడుపు ఉబ్బరంగా అనిపించడం వంటి సమస్యలు మొదలవుతాయి. టీని ముందే తయారుచేసుకుని గంటల పాటూ నిల్వ చేయడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. ఇది అనేక సమస్యలకు కారణమవుతుంది.
అధికంగా కెఫీన్
దీని పదే పదే వేడి చేసినప్పుడు అందులో కెఫీన్ కూడా అధికంగా చేరిపోతుంది. దీనివల్ల పెద్ద సమస్యలు వచ్చేస్తాయి. రక్తంలో ఐరన్ ను కూడా శరీరం శోషించుకోలేదు. దీనివల్ల రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ఒంట్లో చురుకుతనం కూడా తగ్గిపోతుంది. మీకు టీ వల్ల లాభాలు కావాలంటే తాజాగా అప్పటికప్పుడు తయారు చేసుకుని తాగడమే మంచిది. మిగిలిపోతే పడేయండి కానీ తాగకండి.