పొట్టపై బోర్లా పడుకునే అలవాటు మీకుందా? అది ఎంత ప్రమాదకరమో తెలుసా?
Sleeping on Stomach: చాలామందికి పొట్టపై పడుకునే అలవాటు ఉంటుంది. అంటే బోర్లా పడుకునే అలవాటు. దీనివల్ల పొట్ట పరుపుకు తగులుతూ ఉంటుంది. భారమంతా పొట్ట పైనే పడుతుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉంటాయో తెలుసా?

పొట్టపై పడుకోకూడదా?
ఎవరికైనా తమకు అలవాటు ఉన్న భంగిమలోనే పడుకోవడానికి ఇష్టపడతారు. చాలామంది పొట్టను పరుపు వైపుగా పెట్టి.. బోర్లా పడుకునేందుకు ఇష్టపడతారు. ఇలా పొట్టపై పడుకునే అలవాటు ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది శరీరంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా వెన్నెముక, మెడ పై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది దీర్ఘకాలిక శారీరక సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది.
వెన్నెముకపై చెడు ప్రభావం
మీకు కూడా పొట్ట మీద పడుకునే అలవాటు ఉంటే దాన్ని వెంటనే మార్చుకోండి. దీనివల్ల వెన్నెముకపై అధిక ఒత్తిడి కలుగుతుంది. శరీర బరువులో ఎక్కువ భాగం మొండెం మీదే పడుతుంది. ఎప్పుడైతే మీరు పొట్ట మీద పడుకోవడం చేస్తారో.. అప్పుడు వెన్నుముక అసహజ స్థితిలోకి వస్తుంది. ఆ ఒత్తిడిని గ్రహించడానికి వీపు వెనుకకు వంగవలసి వస్తుంది. అంటే వెన్నెముక తన సహజరూపాన్ని కోల్పోతుంది. దీనివల్ల వీపు దిగువ భాగంపై కూడా అదనపు ఒత్తిడి పడుతుంది. కాలక్రమేణా కొన్ని రోజులకు అక్కడ ఉండే కండరాలు, కీళ్లు ఇబ్బందికి లోనవుతాయి. చివరికి అది దీర్ఘకాలిక నొప్పిగా మారిపోతుంది.
మెడపై ప్రభావం
కేవలం వెన్ను నొప్పి మాత్రమే కాదు మెడ నొప్పి కూడా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మీరు పొట్ట మీద పడుకోవడం వల్ల తలను ఒక వైపుకు తిప్పాల్సి వస్తుంది. అలా తిప్పినప్పుడు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. మెడ కూడా ఎక్కువ సేపు వంగినట్టు అవుతుంది. అలా వంగినట్టు అవడం వల్ల నరాలపై ఒత్తిడి కలుగుతుంది. మెడ కండరాలు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల భుజాలు, చేతులకు జలదరింపు, తిమ్మిరి, నొప్పి.. ఇలాంటి భావనలు కలుగుతాయి. తల స్థానం కూడా అసహజంగా ఉంటుంది. ఇది కూడా నొప్పికి నరాల సమస్యకు కారణం అవుతుంది
ఊపిరితిత్తులకూ సమస్యే
పొట్ట మీద పడుకునే అలవాటు ఉన్నవారికి ఎముకలు, కండరాలు, శ్వాస ప్రక్రియ కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అది మీ ఛాతీపై ఒత్తిడిని పెంచుతుంది. ఊపిరితిత్తులు ఊపిరి తీసుకునేటప్పుడు పూర్తిగా విస్తరించకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించదు. రాత్రంతా మీరు నిద్రపోయినా కూడా ఉదయం లేచిన వెంటనే అలసిపోయినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ఆస్తమా, స్లీప్ ఆప్నియా, శ్వాస సమస్యలు ఉన్నవారికి ఇది హానికరంగా మారుతుంది.
పిల్లలు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్త
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇలా పొట్టపై పడుకోవడం వంటివి చేయకూడదు. ఇది వారిలో ఒత్తిడికి కారణమై శరీరంలో రక్తప్రభానికి ఆటంకం ఏర్పడుతుంది. అలాగే ఎవరికైనా కూడా ఇలా బోర్లా పడుకునే అలవాటు ఉంటే ముఖంపై త్వరగా ముడతలు, గీతలు వంటివి వచ్చేస్తాయి. ఇక శిశువులను ఎప్పుడూ కూడా పొట్టపై నిద్రపోయేలా పడుకోబెట్టకూడదు. దీనివల్ల వారికి ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది. ఇది వారి ప్రాణానికి ఎంతో ప్రమాదకరంగా మారుతుంది.