మన ఆరోగ్యానికి గేదె నెయ్యి మంచిదా? ఆవు నెయ్యి మంచిదా?
నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మార్కెట్ లో మనకు రెండు రకాల నెయ్యి లభిస్తుంది. ఒకటి గేదె నెయ్యి, ఇంకోటి ఆవు నెయి. మరి ఇందులో ఏ నెయ్యిని తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటుంటే ఎంత రుచి ఉంటుందో కదా.. రుచిలోనే కాదు దీనిని సరైన పరిమాణంలో తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ కారణంగానే ఆహారంలో నెయ్యిని చేర్చుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. ఆయుర్వేదంలో (Ayurveda) నెయ్యిని శక్తివంతమైన ఆహారంగా భావిస్తారు. ఈ నెయ్యిని మన దేశంలో పప్పు, కిచిడీ నుంచి హల్వా మరియు చపాతీ వరకు ప్రతిదాంట్లో వాడుతుంటారు. శుద్ధి చేసిన నూనెల కంటే నెయ్యితో వండటం వల్ల ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ghee
నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు విటమిన్లు ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నెయ్యి హార్మోన్లను సమతుల్యం చేయడానికి, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ను నిర్వహించడానికి సహాయపడుతుంది.
మొత్తం మీద మంచి ఆరోగ్యానికి నెయ్యి చాలా అవసరం. ఇది చర్మం, జుట్టు, మెదడు, బరువు తగ్గడం, బలమైన ఎముకలు మొదలైన వాటితో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. నెయ్యిని గేదె లేదా ఆవు పాల నుంచి తయారు చేస్తారు. కానీ ఈ రెండింటిలో ఏది మంచి నెయ్యి అనే ప్రశ్న ఎల్లప్పుడూ తలెత్తుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నెయ్యిలోని పోషకాలు: నెయ్యి పోషకాల భాండాగారం. ఆవు నెయ్యిలో విటమిన్లు ఎ, డి, ఇ మరియు కె పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఎదుగుదలకు ఎంతో సహాయపడతాయి. దీనిలో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్ ను బయటకు పంపుతాయి. ఇది గుండె, కొన్నిరకాల క్యాన్సర్లను నివారించడంలో సహాయపడుతుంది.
ఆవు నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలు: ఆవు నెయ్యి పసుపు రంగులో ఉంటుంది. ఇది అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు మరియు కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. దీనిలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. ఇది పిల్లలు, పెద్దలు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అలాగే ఊబకాయాన్ని తగ్గిస్తుంది.
గేదె నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలు: గేదె నెయ్యి తెలుపు రంగులో ఉంటుంది. ఆవు నెయ్యిలో ఉండేటన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో లేవని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇందులో ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంటాయి. ఇందులో కొవ్వు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది.
ఆయుర్వేదంలో నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యి శరీరానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, ఇ మరియు డి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో కీళ్ళనొప్పులు, పిత్తం, కఫం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి నెయ్యిని ఎలా తినాలి: నెయ్యిని తినడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి నెయ్యిని ఎలా తీసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికి సమాధానం ఏమిటంటే.. కూరగాయలు, రోటీ లేదా పప్పుతో కలుపుకుని తినొచ్చు. అలాగే పాలకు కూడా నెయ్యిని కలిపితీసుకోవచ్చు.