రోజూ 20 నిమిషాలపాటు సైక్లింగ్ చేస్తే ఏమౌతుందో తెలుసా?
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం తప్పనిసరి. అందులోనూ సైక్లింగ్ చేయడం వల్ల ఫిట్ గా ఉండటంతో పాటు ఆరోగ్యం కూడా సొంతమౌతుంది. రోజూ 20 నిమిషాల పాటు సైక్లింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..
సైక్లింగ్: వ్యాయామం సులభ మార్గం
దాదాపు అందరూ చిన్నతనంలో సైకిల్ తొక్కినవారే. ఆరోజుల్లో సైకిల్ నేర్చుకోవడంపై చాలా ఇంట్రస్ట్ ఉంటుంది. కానీ.. ఆ సైకిల్ తొక్కడం వచ్చేసిన తర్వాత, ముఖ్యంగా పెద్దయ్యాక.. దాని జోలికి పోం. పక్కన పడేస్తాం. అసలు.. పిల్లలకు తప్ప.. ఎవరి దగ్గరా సైకిల్ అనేది కనిపించడం లేదు. జిమ్ లో ఫిట్నెస్ కోసం పరుగులు తీసేవారు మాత్రం.. అక్కడ సైక్లింగ్ చేస్తారు. కానీ.. సరదాగా.. రోజులో కనీసం 20 నిమిషాలపాటు సైకిల్ తొక్కితే మనం ఊహించని చాలా ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
సైకిల్ అందరికీ చవకగానే దొరుకుతుంది. చిన్నప్పుడు రాకపోయినా, నేర్చుకోవడం సులభమే. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి వ్యాయామం. దీని వల్ల శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది మొత్తం శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. కండరాలు, ఎముకలను బలపరుస్తుంది. శరీరానికి పూర్తి వ్యాయామం అవుతుంది.
సైక్లింగ్ క్రమంగా కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా తుంటి , మోకాళ్లలో కండరాలను బలపరుస్తుంది. ఇది ఓర్పును పెంపొందించడానికి , శారీరక , మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆనందదాయకమైన మార్గం.
సైక్లింగ్ గుండెను బలపరుస్తుంది. హృద సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సైక్లింగ్ బరువు తగ్గడానికి సమర్థవంతమైన మార్గం, గంటకు దాదాపు 300 కేలరీలు బర్న్ చేస్తుంది. క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల కాలక్రమేణా బరువు తగ్గుతారు.
సైక్లింగ్ చేతులు, కాళ్ళు, కళ్ళు శరీరం మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ప్రకృతితో సంబంధాన్ని కూడా అందిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. మనస్సును రిఫ్రెష్ చేస్తుంది.