Bathukamma 2023 : పూల పండుగలో ఏడో రోజు వేపకాయల బతుకమ్మ.. ప్రత్యేకతలేంటో తెలుసా?
Bathukamma 2023 : తెలంగాణలో బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగ ఆడపడుచులకు ఎంతో ప్రత్యేకమైనది. బతుకమ్మను కూడా ఆడబిడ్డగానే భావిస్తారు. అందుకే పసిపాపను అందంగా ముస్తాబు చేసినట్టు బతుకమ్మను తీరొక్క పువ్వులతో తీర్చిదిద్దుతారు. బతుకమ్మలో గౌరమ్మను పెట్టి సుఖ, సంతోషాలు, సౌభాగ్యాలు కలగాలని మొక్కుతారు.
పూల పండుగ బతుకమ్మ తెచ్చే సంబురం అంతా ఇంతా కాదు. ఈ పండుగ ప్రతి ఇంటిని పూల వనంలా మారుస్తుంది. తీరొక్క పూల గుభాళింపుతో ప్రతి ఇల్లూ సువాసనతో నిండి పోతుంది. బతుకమ్మ వచ్చిందంటే తెలంగాణాలోని ప్రతి పళ్లె, పట్టణాల్లోని ప్రతి గల్లీ, వీధి తీరొక్క బతుకమ్మలతో అందంగా ముస్తాబవుతుంది.ఇక సాయంత్రం వేళలల్లో ప్రతి ఇంటిముందు అందమైన బతుకమ్మలు కనువిందు చేస్తాయి.
బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటాం. ఇప్పటికే మనం ఆరు రోజుల బతుకమ్మను జరుపకున్నాం. ఈ రోజు ఏడో రోజు బతుకమ్మను జరుపుకుంటున్నాం. ఎంగిలి బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానెబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మలు అయిపోయాయి. ఇక ఏడో రోజు వేపకాయల బతుకమ్మను జరుపుకుంటున్నాం. అయితే ఆరో రోజు అలిగిన బతుకమ్మను చేయరు. దీని వెనుక పెద్ద కథే ఉంది. కాగా ఆరో రోజు తర్వాత ఆడపడుచులంతా తిరిగి ఏడో రోజు రకరకాల పువ్వులతో బతుకమ్మను అందంగా తయారుచేసి వాకిట్లో పెట్టి బతుకమ్మను ఆడుతారు.
Bathukamma 2023
బతుకమ్మ అంటే 'తిరిగి జీవం పోసుకోండి తల్లి' అని అర్థం వస్తుంది. ఈ బతుకమ్మ పండుగ ఆడబిడ్డలను కలకాలం ఆనందంగా జీవించండని ఆశీర్వదిస్తుంది. అందుకే బతుకమ్మను కూడా తమ బిడ్డలాగే భావిస్తారు. చంటిపిల్లలను అందంగా ముస్తాబు చేసినట్టే దీనిని కూడా తీరొక్క పువ్వులతో చూడచక్కగా పేర్చి మురిసిపోతారు. బతుకమ్మను ఒక్క తెలంగాణాలోనే కాదు ఇతర దేశాల్లో ఉండే తెలంగాణ వాళ్లు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు.
Bathukamma 2023
తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పండుగలో ప్రతి వీధి, గల్లీ పూల గుభాళింపుతో, తీరొక్క పవ్వులతో అందంగా కనిపిస్తాయి. ఈ పండుగ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ తొమ్మిది రోజుల పాటు రోజుకో నైవేద్యాలను కూడా సమర్పిస్తుంటారు.
ఇకపోతే ఈ పూల పండుగలో ఏడో రోజు అంటే ఈ రోజు మనం వేపకాయల బతుకమ్మను జరుపుకుంటున్నాం. ఈ రోజు తంగేడు, బంతి, చామంతి, గునుగు వంటి తీరొక్క పువ్వులతో ఏడు వరుసల్లో బతుకమ్మను అందంగా పేరుస్తారు. ఈ రోజు సకినాల పిండితో వేపకాయల్లా చేసిన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. అందుకే ఈ రోజు బతుకమ్మను వేపకాయల బతుకమ్మ అంటారు. అంతేకాదు ఈ రోజు బెల్లం, పప్పును కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.