Basundi recipe: నోట్లో పెడితే కరిగిపోయేలా బాసుంది పాయసం రెసిపీ ఇదిగో
Basundi recipe: పుట్టినరోజులు, వేడుకలకు టేస్టీ స్వీట్ కావాలంటే బాసుంది పాయసం ప్రయత్నించండి. ఇది అద్భుతంగా ఉంటుంది. దీని రెసిపీ కూడా చాలా సులువు. దీన్ని మీరు ఒక్కసారి తింటే మర్చిపోలేరు.

టేస్టీ బాసుంది పాయసం
పండగలైనా, వేడుకలైనా ఇంట్లో పాయసం ఉండాల్సిందే. తీపి పదార్థాన్ని ముందుగా దేవతలకు నివేదించాకే అందరూ స్వీకరిస్తారు. ఎప్పుడూ ఒకేలాంటి పరమాన్నం, సేమ్యా వంటివి కాకుండా ఓసారి బాసుంది పాయసం ప్రయత్నించండి. దీన్ని పూర్తిగా పాలతో తయారు చేస్తారు. నోట్లో పెడితేనే కరిగిపోయేలా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి అయ్యే సమయం కూడా కొంచెం ఎక్కువే. ఓపికగా చేయాల్సి ఉంటుంది.
బాసుంది పాయసం రెసిపీకి కావలసిన పదార్థాలు
బాసుంది పాయసంలో ముఖ్యంగా మనం వాడేవి పాలు. కాబట్టి వెన్న తీయని ఫుల్ క్రీం పాలు ఒక లీటర్ తీసి పెట్టుకోండి. ఇక పంచదార ముప్పావు కప్పు, బాదం పప్పులు అర కప్పు, యాలకుల పొడి అర టీ స్పూను రెడీ చేసుకుంటే చాలు.. వీటితోనే టేస్టీ బాసుంది పాయసం రెడీ అయిపోతుంది.
బాసుంది పాయసం ఇలా వండేయండి
ఫుల్ క్రీమ్ పాలను ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి మరిగించండి. మీడియం మంట మీద పెట్టి పాలను మరిగించండి. పాలు బాగా మరిగి సగం అయ్యేవరకు ఉంచాలి. అప్పుడు పాల రంగు కూడా మారుతుంది. ఇది కాస్త చిక్కగా అవుతుంది. అలా లీటర్ పాలు కాస్త అర లీటరు అయ్యే వరకు కలుపుతూ ఉండండి. ఆ తర్వాత అందులో చక్కెరను వేసి బాగా కలపండి. ఈలోపు బాదం పప్పులను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోండి. ఆ బాదం పప్పుల మిశ్రమాన్ని కూడా పాల మిశ్రమంలో వేసి బాగా కలుపుకోండి. పైన యాలకుల పొడిని కూడా వేసి బాగా కలపండి. ఒక పావు గంటసేపు స్టవ్ మీద మరిగించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని చల్లారాక ఫ్రిజ్లో పెట్టండి. తర్వాత తీసి తింటే అద్భుతంగా ఉంటుంది. నోట్లో పెడితేనే కరిగిపోయేలా అనిపిస్తుంది.
బాసుంది పాయసం తినవచ్చా?
బాసుంది పాయసంలో మనం పంచదార అధికంగా వేసాము. అలాగే ఫుల్ క్రీం పాలను కూడా వాడాము. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు ఈ స్వీట్ కు దూరంగా ఉంటేనే మంచిది. రెండు మూడు స్పూన్లు తిన్నాచాలు రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగిపోతాయి. ఇక డయాబెటిస్ లేని వారు హ్యాపీగా బాసుంది పాయసాన్ని ఎంజాయ్ చేయవచ్చు. పుట్టినరోజులు, పెళ్లిరోజులు సమయంలో ఇది పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీ అని చెప్పుకోవాలి. కాస్త నెయ్యిని కూడా జోడిస్తే ఇది మరింతగా ఘుమఘుమలాడిపోతుంది. గార్నిషింగ్ కోసం మీకు నచ్చిన పిస్తాలు, గులాబీ రేకులు, బాదం, గుమ్మడి గింజలు వేయవచ్చు.