శీతాకాలంలో తెల్లగా మారిపోయే జంతువులేంటో తెలుసా?
సాధారణంగా ఏ జంతువైనా అది పుట్టినప్పుడు ఏ రంగులో ఉంటుందో చనిపోయే వరకు అలాగే ఉంటుంది. కాని శీతాకాలం వస్తే తెల్లగా మారిపోయే కొన్ని అద్భుతమైన జంతువులున్నాయి. వాటి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు ఇవిగో..
ఆర్కిటిక్ ఫాక్స్
ఆర్కిటిక్స్ ఫాక్స్ మామూలుగా గోధుమ రంగులో ఉంటుంది. అయితే శీతాకాలం వస్తే మాత్రం తెల్లగా మారిపోతుంది. మంచులో కలిసిపోయి శత్రు జంతువుల నుంచి తమను తాము కాపాడుకుంటాయి. ఇవి గరిష్టంగా 11 సంవత్సరాలు జీవిస్తాయి. ఆర్కిటిక్ నక్కలు సాధారణంగా లెమ్మింగ్‌లు , వోల్స్ , ఇతర ఎలుకలు, కుందేళ్ళు , పక్షులు , గుడ్లు , చేపలు, క్యారియన్‌లతో సహా తమకు దొరికిన ఏదైనా చిన్న జంతువులను తింటాయి. తోడేళ్ళు, ధృవపు ఎలుగుబంట్లు వంటి పెద్ద మాంసాహారులు విడిచిపెట్టిన కళేబరాలను తినేస్తాయి.
స్నోషూ హేర్
ఈ కుందేలు నలుపు, తెలుపు కలిగిన రంగులో ఉంటుంది. అయితే శీతాకాలంలో మాత్రం పూర్తి తెల్లగా మారిపోతుంది. దాని వెనుక పాదాలు పెద్ద పరిమాణంలో ఉన్నందున దీనికి "స్నోషూ" అని పేరు వచ్చింది. ఇది దూకినప్పుడు, నడిచేటప్పుడు మంచులో కూరుకుపోకుండా దాని పాదాలు కాపాడతాయి.
ఆర్కిటిక్ హేర్
ఈ కుందేలు బొచ్చు సాధారణంగా బూడిద రంగులోనూ, గోధుమ రంగులోనూ ఉంటుంది. శీతాకాలంలో మాత్రం తమను వేటాడే జంతువుల నుంచి రక్షించుకోవడానికి తెల్లగా మారిపోతాయి. ఆర్కిటిక్ కుందేలు గంటకు 60 కిలోమీటర్లు వరకు పరుగెత్తగలదు. ఇవి ఏడాదిన్నర మాత్రమే బతకగలరు.
సైబేరియన్ చిట్టెలుక
చలికాలంలో ఈ చిట్టెలుక బొచ్చు మొత్తం తెల్లగా మారుతుంది. మంచులో దాక్కుని జంతువుల నుంచి రక్షణ పొందుతుంది. వీటి జీవితకాలం గరిష్టంగా 2 సంవత్సరాలు మాత్రమే.
కాలర్డ్ లెమ్మింగ్
ఆర్కిటిక్‌లో కనిపించే కాలర్డ్ లెమ్మింగ్, తన గోధుమ రంగు శరీరాన్ని తెల్లగా మార్చుకుంటుంది. ఇవి ఉత్తర అమెరికాకు చెందిన ఎలుకలు.
ఎర్మైన్
ఎర్మైన్ గోధుమ రంగులో కోటు ధరించినట్లు ఉంటుంది. చలికాలం వచ్చిందంటే పూర్తిగా తెల్లగా మారిపోతుంది. 15వ శతాబ్దంలో కాథలిక్ చక్రవర్తులు ఈ పిల్లి బొచ్చును కోటుగా ఉపయోగించేవారట. వారు దీనిని కొన్నిసార్లు టోపీగానూ పెట్టుకొనే వారట.
ప్టార్మిగన్
ఇది ఒక రకమైన పక్షి. ఇది నునావట్, న్యూఫౌండ్‌ల్యాండ్, లాబ్రడార్ ప్రావిన్స్, గిఫు , నాగానో, టొయామా ప్రిఫెక్చర్స్ దేశాలకు అధికారిక పక్షి. దీన్ని కేవలం ఐరోపాలో మాత్రమే ప్టార్మిగన్ అంటారు. ఇతర ప్రాంతాల్లో అకిగ్గిక్ , రైచో అంటూ వేరువేరుగా పిలుస్తారు. శీతాకాలంలో తెల్లగా, వేసవిలో గోధుమ రంగులోకి మారుతాయి.