నెయ్యి కలిపిన టీ తాగితే మంచిదేనా.? ఈ మధ్య ట్రెండ్ ఎందుకు ఎక్కువైంది..
Ghee Tea: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ చిన్న సమాచారమైనా సరే క్షణాల్లో వైరల్ అవుతోంది. అన్ని రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలైతే లెక్కే లేదు. ఇలాంటి వాటిలో ఒకటి నెయ్యితో తయారు చేసిన టీ. ఈ టీ తాగడం వల్ల నిజంగానే లాభాలు ఉంటాయా.? అసలు నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. అదే నెయ్యితో చేసిన టీ తాగడం. సాధారణంగా మనం చాయ్‌లో చక్కెర, టీ పౌడర్ వేసుకుంటాం. మహా అయితే ఇలాచి లేదా అల్లం లాంటివి యాడ్ చేసుకుంటుంటాం. అయితే ఇటీవల చాయ్‌లో నెయ్యిని కలుపుతున్నారు. నెయ్యి చాయ్ ద్వారా ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. రెగ్యులర్‌గా ఈ టీని తీసుకుంటే సమస్యలన్నీ దూరమవుతాయని అంటున్నారు. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందంటే.
బరువు తగ్గడంలో..
బరువు తగ్గడంలో నెయ్యి టీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మనం తాగే టీలో చక్కెర ఉంటుంది. ఇది బరువు పెరగడంతో పాటు డయాబెటిస్ వచ్చేందుకు కారణమవుతుంది. అందుకే టీలో నెయ్యి కలుపుకొని తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లాక్టోజ్‌ను జీర్ణం చేసుకోలేని వారు కూడా చాయ్‌లో నెయ్యి వేసుకుని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు.
మలబద్ధకానికి చెక్..
ఇక మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. ఇలాంటి వారికి కూడా నెయ్యి కలిపిన టీ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నెయ్యి, వెన్న కలిపిన టీని రెగ్యులర్‌గా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయని అంటున్నారు. ఈ నెయ్యి టీని అన్ని వయసుల వారు తీసుకోవచ్చని చెబుతున్నారు. అయితే ఫలితం రావడానికి కొంతమేర సమయం పడుతుందని అంటున్నారు.
చర్మ ఆరోగ్యం..
చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఈ నెయ్యి టీ ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ ఏ,డీ,ఈ కే వంటివి చర్మాన్ని నిత్యం హైడ్రేట్‌గా ఉంచుతాయి. దీంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ముఖ్యంగా చలికాలం నిర్జీవంగా మారే చర్మం ఈ టీని క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల తిరిగి కాంతివంతంగా మారుతుందని చెబుతున్నారు.
వీరికి మంచిది కాదు..
అయితే కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు మాత్రం ఈ టీకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎసిడిటీ, రక్తహీనత సమస్యలతో ఇబ్బంది పడే వారు ఈ నెయ్యి టీ తాగకూడదని చెబుతున్నారు. ఈ టీ వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.
గమనిక: ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే సూచించతదగ్గ అంశమని రీడర్స్ గమనించాలి. ఆరోగ్యం విషయంలో స్వీయ నిర్ణయాలు ఎప్పటికీ మంచివి కావని గుర్తించాలి.