ఈ 6 జంతువులు నీళ్లు తాగకుండా జీవితాంతం బతికేస్తాయి తెలుసా?
తిండి తినకుండా సుమారు 40 రోజులు బతకొచ్చు. నీళ్లు తాగకుండా మూడు రోజులు దాటి బతకలేం తెలుసా. కాని నీళ్లు తాగకుండా ఈ ప్రపంచంలో హాయిగా బతికేస్తున్న కొన్ని జంతువులున్నాయి. అవి నీటిని నోటితో తాగవు. కాని ఇతర శరీర భాగాల ద్వారా తేమను తీసుకొంటాయి. అలాంటి 6 జంతువుల గురించి తెలుసుకుందాం రండి..
ఎడారి తాబేలు:
నైరుతి యునైటెడ్ స్టేట్స్ లో ఈ ఎడారి తాబేలు కనిపిస్తుంది. ఈ తాబేళ్లు అవి తినే మొక్కల నుంచే నీటిని గ్రహిస్తాయి. ఆ నీటిని ఎక్కువ కాలం తమ శరీరంలో నిల్వ ఉంచుకుంటాయి. అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటాయి. ఈ తాబేళ్లు చాలా అరుదుగా నీటిని తాగుతాయి.
ఇసుక జింక:
ఇది అరేబియా ఎడారిలో ఉంటుంది. ఇసుక జింక తాను తినే మొక్కల నుండి తేమను గ్రహిస్తుంది. ఆ తేమతోనే జీవించగలదు. నీరు లేకపోవడం వల్ల తన శరీరం దెబ్బతినకుండా ఉండటానికి ఈ ఎడారి జింక తన డైజేషన్ సిస్టమ్ లో తగిన మార్పులను కూడా చేసుకోగలదు.
ముళ్ల బల్లి:
ఆస్ట్రేలియా ఎడారుల్లో కనిపించే ఈ బల్లి దాని చర్మం ద్వారా నీటిని తీసుకుంటుంది. ఇసుక, మంచులోని తేమను తీసుకొని నీరుగా మార్చుకొంటుంది. ఇది నోటితో నీరు తాగకుండానే దాని చర్మం నుండి తేమను తీసుకొని శరీరభాగాలకు నీటిని పంపిస్తుంది.
ఫాగ్‌స్టాండ్ బీటిల్:
ఆఫ్రికాలోని నమీబ్ ఎడారిలో నివసిస్తుంది ఈ ఫాగ్ స్టాండ్ బీటిల్. ఇది దాని శరీరాన్ని తెల్లవారుజామున ఒక కోణంలో ఉంచి నిలబడుతుంది. తెల్లవారుజామున కురిసే పొగమంచు ఆస్వాదిస్తుంది. అంతే నీటిని తాగాల్సిన అవసరమే దానికి ఉండదు.
కోలా:
ఆస్ట్రేలియాలోని యూకలిప్టస్ అడవుల్లో కోలాలు కనిపిస్తాయి. కోలాలు తాము తినే యూకలిప్టస్ ఆకుల నుండి ఎక్కువగా నీటిని తీసుకుంటాయి. ఇవి అధిక నీటి శాతాన్ని కలిగి ఉంటాయి. దీంతో ఇతర మార్గాల ద్వారా నీరు తీసుకోవాల్సిన అవసరం లేదు వాటికి. అవి అరుదుగా నీరు తాగుతాయి.
కంగారూ ఎలుక:
ఉత్తర అమెరికా ఎడారుల్లో కంగారూ ఎలుకలు కనిపిస్తాయి. ఇవి కూడా కంగారూల్లాగానే వెనుక కాళ్లపై నిలబడతాయి. వాటితోనే గెంతుతాయి. ఇవి పురుగులు, పండ్లు, గింజలు, చిన్న మొక్కలు తిని బతుకుతాయి. ఇవి దాని శరీర నిర్మాణం వల్ల ఎక్కువగా నీటిని తీసుకోవాల్సిన అవసరం ఉండదు. చాలా అరుదుగా నీరు తాగుతాయి.