Parenting: పిల్లల ముందు పేరెంట్స్ మాట్లాడుకోకూడని మూడు విషయాలు ఇవే..!
Parenting: పిల్లలు ఏ విషయాన్ని అయినా చాలా తొందరగా నేర్చుకుంటారు. మనం నేర్పించిన విషయాలు మాత్రమే కాదు.. మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుకుంటున్నామో అన్నీ గ్రహిస్తూ ఉంటారు.

Parenting Tips
పిల్లల పెంపకం అనేది కేవలం వారికి ఇది చెయ్, అది చెయ్ అని చెప్పడం మాత్రమే కాదు.. మనం ఎలా జీవిస్తున్నామో చూపించడం. మన మాటలు, మన ప్రవర్తనే పిల్లలకు మొదటి పాఠశాల. మన ఇంట్లోని వాతావరణం, మనం తోటివారితో మాట్లాడే విధానమే వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
ముఖ్యంగా, పెద్దలు ఏం చేసినా, ఏం మాట్లాడినా కూడా వారు స్పాంజ్ లా పీల్చుకుంటారు. మనం పిల్లలకు చెప్పకపోయినా.. భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారు. అందుకే, పిల్లల ఎదురుగా ఉన్నప్పుడు మూడు విషయాల గురించి పొరపాటున కూడా పేరెంట్స్ మాట్లాడుకోకూడదు. అవేంటో చూద్దాం....
1.టీచర్లు, స్కూల్స్ గురించి తక్కువ చేసి మాట్లాడటం..
చాలా మంది తల్లిదండ్రులు.. పిల్లలు చదువుకునే స్కూల్, వాళ్లకు చదువు చెప్పే టీచర్ల గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ‘ ఆ టీచర్ కి ఏం తెలుసు..? మాకే ఎక్కు తెలుసు’ అని లేదా స్కూల్ ని విమర్శించడమూ చేస్తూ ఉంటారు. ఈ మాటలు పిల్లలు వినడం వల్ల వారి మనసులో టీచర్స్ పట్ల గౌరవం తగ్గుతుంది. టీచర్లు చెప్పే మంచి మాటలను కూడా వారు పెడచెవిన పెట్టే ప్రమాదం ఉంది. స్కూల్ పట్ల గౌరవం కూడా పోతుంది. అందుకే, ఈ పొరపాటు చేయకూడదు.
2. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల గురించి చర్చించడం:
"మన దగ్గర డబ్బులు లేవు", "అప్పులు ఎక్కువైపోయాయి", లేదా ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవల గురించి పిల్లల ముందు బహిరంగంగా మాట్లాడటం చాలా ప్రమాదకరం.
దీని ప్రభావం పిల్లలపై చాలా ఎక్కువగా పడుతుంది. చిన్న వయసులోనే పిల్లలు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతారు. భద్రతా భావం కోల్పోయి, అభద్రతా భావంతో భయపడుతూ పెరిగే అవకాశం ఉంది. డబ్బు విలువను నేర్పడం వేరు, ఆర్థిక భారాన్ని వారి చిన్నవయసులోనే వారిపై పడేలా చేయడం వేరు.
3. ఇతరుల గురించి గాసిప్లు, నెగిటివ్ మాటలు మాట్లాడటం:
చుట్టాలు, పక్కింటివారు లేదా బంధువుల గురించి చెడుగా మాట్లాడటం, వాళ్ళని విమర్శించడం, లేదా వారి లోపాలను ఎత్తిచూపుతూ నవ్వుకోవడం వంటివి పిల్లల ముందు అస్సలు చేయకూడదు.
దీని ప్రభావం కూడా పిల్లలపై పడే ప్రమాదం ఉంది. పిల్లలు కూడా రేపు నలుగురితో అలానే ప్రవర్తించడం నేర్చుకుంటారు. ఇతరులను గౌరవించడం మానేసి, తోటివారిని తక్కువగా చూసే తత్వాన్ని అలవాటు చేసుకుంటారు. సమాజంలో అందరితో సఖ్యంగా ఉండే గుణం కరువైపోతుంది.
ఆచరించి చూపడమే గొప్ప పాఠం..
పిల్లలకు నీతి సూత్రాలు పుస్తకాలు చదివి వినిపిస్తే సరిపోదు; మనం ఎలా బతుకుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేదే వారిని నడిపిస్తుంది. మనం ఇతరులను గౌరవిస్తే, పిల్లలు పెద్దలను గౌరవిస్తారు. మనం కష్టపడే తత్వాన్ని చూపితే, వారు కూడా బాధ్యతాయుతంగా ఎదుగుతారు. ఇంట్లో ప్రశాంతమైన, పాజిటివ్ వాతావరణాన్ని అందిస్తే, పిల్లల మానసిక వికాసం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి, పిల్లల ముందు మాట్లాడే ప్రతీ మాటను బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం. మన ప్రవర్తనే వారికి మొదటి పాఠశాల అని గుర్తుంచుకుందాం.





