RRB NTPC Results: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ రిజల్ట్స్‌పై అధికారిక ప్రకటన.. ఫలితాలు ఎప్పుడంటే..?
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (RRB NTPC) ఫలితాల కోసం వేచిచూస్తున్న అభ్యర్థులకు రైల్వే బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ ప్రిలిమినరీ ఫలితాల విడుదల తేదీని (RRB NTPC CBT-1 Result date) అధికారికంగా ప్రకటించింది.
ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ కేటగిరిలో దాదాపు 35 వేల పోస్టులను భర్తీ చేసేందుకు 2019లో నోటిఫికేషన్ విడుదల చేసింది. కోటిమందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే కరోనా, ఇతర కారణాల వల్ల పరీక్ష నిర్వహణ వాయిదా పడుతూ వచ్చింది.
చివరకు గతేడాది డిసెంబర్ 28 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 8 వరకు ఆరు దశలలో ఈ పరీక్షను నిర్వహించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఏడో దశను జూలై నెలలో నిర్వహించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆర్‌ఆర్‌బీ ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. వాటిని సరిచేసి ఫైనల్కీని కూడా విడుదల చేశారు. అయితే నెలలు గడిచిన కూడా ఫలితాలను మాత్రం విడుదల చేయలేదు.
ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు చాలా రోజులుగా ఫలితాల కోసం ఎప్పుడని ఎదురుచూస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా వేదికగా కూడా ఫలితాలు ఎప్పుడని రైల్వే శాఖను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్‌ఆర్‌బీ ఫలితాల విడుదల తేదీపై అధికారిక ప్రకటన చేసింది.
ప్రస్తుతం సీబీటీ-1 ఫలితాల ప్రక్రియ కొనసాగుతుందని.. ఫలితాలను 2022 జనవరి 15లోపు అధికార వెబ్‌సెట్‌లలో అందుబాటులో ఉంచనున్నట్టుగా తెలిపింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ జోనల్ వెబ్‌సైట్స్‌లో వారి ఫలితాలను చూసుకోవచ్చని తెలిపింది. ఉదాహరణకు సికింద్రాబాద్ జోన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. https://rrbsecunderabad.nic.in/ లో రిజల్ట్స్ విడుదలయ్యాక వారి ఫలితాలను చూసుకోవచ్చు.
షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు సీబీటీ–2ను 2022, ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు నిర్వహిస్తామని ఆర్‌ఆర్‌బీ తెలిపింది. (అయితే సీబీటీ-2 నిర్వహణ అనేది ప్రభుత్వం జారీచేసే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపింది)
అభ్యర్థులు ఫలితాలను చెక్ చేసుకోవడానికి, ఇతర వివరాల కోసం ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్స్‌ను మాత్రమే ఫాలో కావాలని సూచించింది. జాబ్‌ల కోసం ఆశపడి ఇతరులను నమ్మి మోసపోవద్దని కోరింది.