Government Jobs : తెలుగు యువతా బి రెడీ .. భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది
ఆంధ్ర ప్రదేశ్ యువతకు ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోంది. విద్యుత్ శాఖలో లైన్ మెన్ ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నామని… త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.

ఏపీలో ఉద్యోగ నోటిఫికేషన్లు
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు నిరుద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. ఇప్పటికే 629 అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టుల భర్తీకి పరీక్ష పూర్తయిందని, త్వరలో ఫలితాలను వెల్లడించి నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. ఈ నియామకాలు పూర్తయిన తర్వాత లైన్‌మెన్ పోస్టులను కూడా భర్తీ చేసేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
629 ఏఈ పోస్టుల పరీక్ష పూర్తి
విద్యుత్ శాఖలో మానవ వనరుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. సహాయ ఇంజనీర్ పోస్టులను పెంచాలని కోరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 629 పోస్టులను ఒకేసారి మంజూరు చేశారని చెప్పారు. ఈ పోస్టులకు ఇప్పటికే పరీక్ష పూర్తయిందని, ఫలితాలను పారదర్శకంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అనంతరం ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి అర్హులైన అభ్యర్థులకు నియామకాలు కల్పిస్తామని చెప్పారు.
629 ఏఈ పోస్టుల కోసం దాదాపు లక్ష మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, సుమారు 85 వేల మంది పరీక్షకు హాజరైనట్లు మంత్రి వెల్లడించారు. మొత్తం ప్రక్రియలో ఎలాంటి ఆరోపణలకు, విమర్శలకు అవకాశం లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు.
త్వరలో లైన్‌మెన్ పోస్టుల భర్తీ
విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలంటే క్షేత్రస్థాయిలో తగినంత మంది సిబ్బంది ఉండటం చాలా అవసరం అని మంత్రి గొట్టిపాటి అన్నారు. ముఖ్యంగా విద్యుత్ లైన్ల నిర్వహణ, మరమ్మతులు, అత్యవసర సేవలకు లైన్‌మెన్‌ల పాత్ర కీలకమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతితో లైన్‌మెన్ పోస్టులను కూడా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. దీనివల్ల విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత కొంతమేర తగ్గడంతో పాటు వినియోగదారులకు సేవలు మరింత వేగంగా అందే అవకాశం ఉంటుంది.
విద్యుత్ శాఖలో 7 వేల మంది వరకు సిబ్బంది
రాష్ట్రంలో విద్యుత్ శాఖకు అవసరమైన మానవ వనరులను సమకూర్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. గ్రామ సచివాలయాల్లో ఇంధన సహాయకులుగా పనిచేస్తున్న సిబ్బందిని విద్యుత్ శాఖలోకి తీసుకోవడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,500 నుంచి 7,000 మంది వరకు సిబ్బందిని సమకూర్చుకున్నామని చెప్పారు. విద్యుత్ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రతి పది రోజులకు ఒకసారి విద్యుత్ సరఫరా పరిస్థితి, సిబ్బంది, వినియోగదారులకు అందుతున్న సేవలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు.
445 మందికి పైగా కారుణ్య నియామకాలు
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గత రెండున్నర నుంచి మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను వేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. మూడు విద్యుత్ పంపిణీ సంస్థలతో పాటు విద్యుత్ ప్రసార, ఉత్పత్తి సంస్థల్లో కలిపి ఇప్పటివరకు 445 మందికి పైగా కారుణ్య నియామకాలు చేపట్టినట్లు వెల్లడించారు. అర్హులైన కుటుంబ సభ్యులు నియామకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
ఈ క్రమంలో ఏపీఈపీడీసీఎల్‌లో అర్హత పొందిన 43 మంది అభ్యర్థులకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగిని కోల్పోయిన కుటుంబంలో కనీసం ఒకరికి ఉపాధి కల్పించడం ద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు.
విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి
విద్యుత్ ఉద్యోగులు విధి నిర్వహణలో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి సూచించారు. విద్యుత్ సరఫరా నిలిపివేత, భద్రతా విధానాలపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ శాఖ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టర్లు, ఇతర సాంకేతిక సిబ్బందికి కూడా భద్రతా నిబంధనలపై పూర్తిస్థాయి శిక్షణ, అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ఒక ఉద్యోగి ప్రాణాలు కోల్పోతే ఆయన కుటుంబానికి ఉద్యోగం లేదా ఆర్థిక సాయం అందించగలిగినా, ఆ కుటుంబం కోల్పోయిన వ్యక్తిని తిరిగి తీసుకురాలేమని మంత్రి అన్నారు. అందువల్ల ప్రమాదాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే వాటిని నివారించడమే ముఖ్యమని స్పష్టం చేశారు.
విద్యుత్ చార్జీలు పెంచలేదన్న మంత్రి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు విద్యుత్ చార్జీలను పెంచలేదని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రానున్న ఐదేళ్లలో కూడా విద్యుత్ చార్జీలు పెంచకుండా వ్యవస్థను బలోపేతం చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని చెప్పారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడంతో పాటు హరిత విద్యుత్ ప్రసార మార్గాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా విద్యుత్‌ను సమర్ధవంతంగా వినియోగించాలని సూచించారు.
1912 కాల్ సెంటర్‌ను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి
మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏపీఈపీడీసీఎల్ 1912 కాల్ సెంటర్‌ను సందర్శించారు. అక్కడ వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, వాటిపై సిబ్బంది స్పందిస్తున్న తీరు, సమస్యల పరిష్కారానికి పడుతున్న సమయం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కాల్ సెంటర్ సిబ్బంది వినియోగదారులతో మాట్లాడుతున్న విధానాన్ని మంత్రి స్వయంగా పరిశీలించారు. కొంతమంది వినియోగదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి, నిర్ణీత సమయంలో పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విద్యుత్ శాఖలో సేవలందించే సమయంలో వినియోగదారులే ప్రధానంగా ఉండాలని, ఫిర్యాదులను కేవలం నమోదు చేయడంతో సరిపెట్టకుండా అవి పూర్తిగా పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.

