ChatGPT : ఏఐ ఉపయోగించి రూ.1,32,00,000 సంపాదించిన మహిళ... ఎలాగో తెలుసా?
ChatGPT : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంలో ఓ మహిళ ఏకంగా $1,50,000 అంటే ఇండియన్ రూపాయల్లో 1,32,00,000 సంపాదించింది. ఏఐ ద్వారా ఇంతడబ్బు ఎలా వచ్చాయో ఇక్కడ తెలుసుకుందాం.

ఏఐతో కోట్లు గెలిచిన మహిళ
ChatGPT : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... ఇది నయా టెక్నాలజీ సృష్టించిన అద్భుతమనే చెప్పాలి. కొన్ని టెక్నాలజీలు ప్రపంచ గమనాన్నే మార్చేస్తుంటాయి... అలాంటిదే ఈ ఏఐ కూడా. ఇప్పుడు ప్రతి రంగంలోనూ ఏఐని ఉపయోగిస్తున్నారు... ఇది ఇప్పుడు నిత్యజీవితంలో భాగం అయిపోతోంది. విద్యార్థులకు చదువులో, ఉద్యోగులకు పనిలో, వ్యాపారులకు బిజినెస్ లో... ఇలా అదీఇదని లేదు అన్ని విషయాల్లోనూ ఏఐ ఎంతగానో సహాయం చేస్తోంది. చివరకు ఓ మహిళ కోట్ల రూపాయల లాటరీ గెలుచుకోవడంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం చేసిందట. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.
ఏఐ సాయంలో లాటరీ విజయం..
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని వర్జీనియా ప్రాంతానికి చెందిన క్యారీ ఎడ్వర్డ్ ఇటీవల ఓ లాటరీని కొనుగోలు చేసింది. ఈ సమయంలో ఆమె ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ చాట్ జిపిటిని సాయం కోరింది. అయితే ఈ నెల (సెప్టెంబర్ 8న) ఈ వర్జీనియా లాటరీ పవర్ బాల్ డ్రా విజేతలను ప్రకటించారు. ఇందులో ఈ చాట్ జిపిటి సూచించిన నంబర్ ఏకంగా 1,50,000 డాలర్లు గెలిచింది... అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాలా కోటి ముప్పైరెండు లక్షలను (రూ.1.32 కోట్లు) ఆమె గెలుచుకుంది.
చాట్ జిపిటి చలవే..
తాను సాధారణంగానే చాట్ జిపిటి ని లాటరీ నంబర్ అడిగానని.. అది ఇంత ఖచ్చితంగా గెలిచే నంబర్ సూచిస్తుందని అస్సలు ఊహించలేదని విజేత ఎడ్వర్డ్స్ చెబుతున్నారు. చాట్ జిపిటి సూచించిన నంబర్ లాటరీ గెలిచినట్లు తనకు మెసేజ్ వచ్చినా నమ్మలేదని... అదేదో స్కామ్ అనుకున్నానని అన్నారు. కానీ నిజంగానే లాటరీ గెలిచినట్లు కన్ఫర్మ్ అయ్యాక తన ఆనందానికి అవధులు లేవంటూ ఓ అమెరికన్ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు.
లాటరీ డబ్బులు ఎలా ఖర్చు చేస్తున్నారో తెలుసా?
గెలిచిన లాటరీ డబ్బులు రూ.1.32 కోట్లలో ఒక్క రూపాయి కూడా తాను సొంతంగా ఉపయోగించుకోనని... మొత్తం విరాళంగా ఇవ్వనున్నట్లు ఎడ్వర్డ్ ప్రకటించారు. ఈ డబ్బులు తాను కష్టపడితే వచ్చినవి కావు కాబట్టి వీటిని ప్రజల కోసం ఉపయోగిస్తున్నానని... అందుకే మూడు సంస్థలకు ఈ డబ్బులు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
కోట్లాది రూపాయలు విరాళం
తన భర్త 2024 లో అనారోగ్యంతో మరణించాడని... అతడిలా మరెవ్వరూ మరణించకూడదని ఆ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్న అసోసియేషన్ ఫర్ ఫ్రంటోటెంపోరల్ డీజెనరేషన్ (AFTD) కి లాటరీ డబ్బుల్లో కొంత విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక వ్యవసాయం, అహారభద్రతపై లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న షాలోమ్ ఫార్మ్స్‌కు కూడా విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే నేవీ మెరైన్ కార్ప్స్ రిలీఫ్ సొసైటీకి కూడా విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మూడు సంస్థలను తాను గెలిచిన కోటి రూపాయలకు పైగా లాటరీడబ్బులను ఇచ్చేస్తానని ప్రకటించి ఎడ్వర్డ్స్ గొప్ప మనసు చాటుకున్నారు.
Here are the three charities our Virginia Lottery Powerball player donated her $150,000 winnings to! @AFTDHope, @NMCRS1, and Shalom Farms (not on X) pic.twitter.com/HMTdEWtWvS
— Virginia Lottery (@VirginiaLottery) September 17, 2025