- Home
- Business
- ChatGPT: రూ. 20 లక్షల క్రెడిట్ కార్డ్ బిల్లు.. సింపుల్‌గా క్లియర్ చేయించిన చాట్‌జీపీటీ
ChatGPT: రూ. 20 లక్షల క్రెడిట్ కార్డ్ బిల్లు.. సింపుల్‌గా క్లియర్ చేయించిన చాట్‌జీపీటీ
ఒకప్పుడు ఏ సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేసేవారు. కానీ ప్రస్తుతం ఈ స్థానాన్ని చాట్ జీపీటీ భర్తీ చేస్తోంది. చివరికి ఆర్థిక సలహాలు కూడా ఇస్తోంది. తాజాగా ఓ మహిళ క్రెడిట్ కార్డు బిల్లును చాట్ జీపీటీ సహాయంతో క్లియర్ చేసింది.

అప్పుల్లో కూరుకుపోయిన మహిళ
అమెరికా డెలావేర్‌కు చెందిన 35 ఏళ్ల జెన్నిఫర్ అల్లన్ అనే మహిళ ఒక రియల్ ఎస్టేటర్‌గా పనిచేస్తోంది. మంచి ఆదాయం వస్తున్నా సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయింది. ముఖ్యంగా క్రెడిట్ కార్డును ఎడాపెడా వాడేసింది. బిల్లు ఏకంగా రూ. 20 లక్షలకు చేరింది.
దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. సంపాదనకు కొదవలేకున్నా ఆర్థిక క్రమశిక్షణ లేని కారణంగానే తాను ఇలా అప్పుల్లో కూరుకుపోవాల్సి వచ్చిందని ఆమె న్యూస్‌వీక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అప్పులు పెరగడానికి అదే కారణం
తనకు ఆ స్థాయిలో అప్పులు పెరగడానికి గల కారణాన్ని వివరిస్తూ.. కూతురు పుట్టిన తర్వాత ఒక్కసారిగా వైద్య ఖర్చులు, పిల్లకు కావాల్సిన అవసరాల కోసం ఖర్చులు పెరిగాయని తెలిపింది. వీటికోసం పూర్తిగా క్రెడిట్ కార్డులను ఉపయోగించానని చెప్పుకొచ్చింది. అయితే తాను ఎలాంటి లగ్జరీ అవసరాల కోసం అప్పులు చేయలేదని, కేవలం జీవించడం కోసం చేసిన ఖర్చులే ఇంతలా అప్పులు పెరగడానికి కారణమయ్యాయని తెలిపింది.
చాట్ జీపీటీ సలహా
ఒక్కసారిగా క్రెడిట్ కార్డు అప్పు పెరగడంతో ఏం చేయాలో తోచని ఆ మహిళ చాట్‌జీపీటీని ఆశ్రయించింది. దాని సహాయంతో 30 రోజుల ఫైనాన్స్ ఛాలెంజ్ తీసుకుంది. ప్రతీరోజూ ఏదో ఒక చిన్న పని – ఫ్రీలాన్స్ అవకాశాలు వెతకడం, వాడని సబ్‌స్క్రిప్షన్లను రద్దు చేయడం, మర్చిపోయిన ఖాతాల్లో డబ్బు చెక్ చేయడం ఇలా ప్రతిరోజూ ఒక్కో ముందడుగు వేసింది.
క్రమంగా డబ్బులు ఆదా
ఒకరోజు ఫైనాన్స్ యాప్స్‌ను పరిశీలించమని చెప్పిన ChatGPT సలహా మేరకు ఆమె 10,000 డాలర్లకుపైగా (రూ. 8.5 లక్షలకుపైగా) మర్చిపోయిన బ్రోకరేజ్ ఖాతాలో డబ్బును గుర్తించింది. అలాగే కిరాణా ఖర్చులను తగ్గించేందుకు గాను కొన్ని రోజుల పాటు కేవలం ఇంట్లో ఉన్న పదార్థాలతో వండే విధంగా 'ప్యాంట్రీ మీల్ ప్లాన్‌ను సూచించింది. దీంతో నెలకు సుమారు రూ. 50 వేల వరకు కిరాణా ఖర్చు తగ్గింది.
మొదలైన మార్పు
చాట్ జీపీటీ చెప్పిన వివరాలను ఫాలో కావడం వల్ల జెన్నిఫర్ ఆర్థిక స్థితి క్రమంగా మెరుగైంది. ఈ 30 రోజుల ఛాలెంజ్ తర్వాత జెన్నిఫర్ దాదాపు $12,078.93 (రూ. 10.3 లక్షలు) అప్పును తీర్చగలిగింది. ఇది ఆమె మొత్తం అప్పులో సగం కావడం విశేషం.
ఇప్పుడు మిగిలిన అప్పును తీర్చేందుకు మరో 30 రోజుల ఛాలెంజ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
"ఇది పెద్ద ఆర్థిక ట్రిక్ కాదు. ప్రతి రోజూ నా ఖర్చులను గమనించడం, చూస్తూ ఉండటం, భయపడకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైంది" అని ఆమె తెలిపింది. సమస్య నుంచి దూరంగా పరిగెత్తడం కాకుండా, సమస్యను అంగీకరించడమే మొదటి విజయం అని సూచిస్తోంది జెన్నిఫర్.