ట్రంప్ దే అమెరికా : కమలా హారిస్ కు తప్పని ఓటమి
అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అధిరోహించనున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఆయన మ్యాజిగ్ ఫిగర్ ను సాధించారు.
US Election Results 2024
US Election Results 2024 : అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. అమెరికా ప్రజలు రెండోసారి ట్రంప్ ను అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టేందుకు అంగీకరించారు. హోరాహోరీ పోరులో ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ 270 కి పైగా ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. దీంతో ఆయనకు అగ్రరాజ్యం అమెరికాను మరోసారి పాలించే అవకాశం దక్కింది. కమలా హారిస్ ప్రస్తుతం 214 ఎలక్టోరల్ ఓట్లను మాత్రమే సాధించారు. మరికొన్నిచోట్ల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.
US Election Results 2024
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా వున్నాయంటే :
నవంబర్ 05న అంటే నిన్న మంగళవారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. భారత కాలమానం ప్రకారం ఇవాళ (బుధవారం) ఉదయం వరకు పోలింగ్ కొనసాగింది. ఇలా పోలింగ్ ముగియగానే అలా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రపంచానికే పెద్దన్నలా వ్యవహరించే అగ్రరాజ్యం అమెరికాకు నూతన అధ్యక్షుడు ఎవరు అవుతారు? ఫలితాలు ఎలా వుంటాయోనని అమెరికన్లే కాదు యావత్ ప్రపంచం ఆతృతగా ఎదురుచూసింది.
ఉదయం నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగింది. అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు కలిపి 535 ఎలక్టోరల్ ఓట్లు వుంటాయి. వీటిలో సగం అంటే 270 ఓట్లు మ్యాజిక్ ఫిగర్... ఈ మార్కును దాటినవారు అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు. అయితే ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించి అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. ఇలా మరోసారి అమెరికాలో రిపబ్లికన్ పార్టీ పాలన కొనసాగనుంది.
ఇక ప్రస్తుత అధికార డెమొక్రటిక్ పార్టీ నుండి పోటీచేసిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఆమె కేవలం 226 ఎలక్టోరల్ ఓట్ల వద్ద నిలిచిపోయారు. ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోవడంతో ఆమె ఓటమి ఖాయమయ్యింది.
US Election Results 2024
ట్రంప్ గెలుపు సందేశం :
తన గెలుపు ఖాయం అయ్యాక డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. తన జీవితంలో ఇదో మరిచిపోలేని రోజు ... తన పాలనలో ఇక అమెరికా ప్రజలకు కష్టాలు వుండవన్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నా... మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేశానికి పూర్వ వైభవం తీసుకువస్తానని ట్రంప్ అన్నారు.
ఇంతటి ఘన విజయాన్ని తాను ఊహించలేదు... ముఖ్యంగా స్వింగ్ రాష్ట్రాల్లో ఊహించిన దానికంటే మంచి ఓట్లు వచ్చాయని ట్రంప్ అన్నారు. రిపబ్లికన్ పార్టీపై ప్రజలకు ఎంత నమ్మకం వుందో ఈ ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయని అన్నారు. మొత్తంగా 315కు పై ఎలక్టోరల్ ఓట్లను సాధిస్తానని ట్రంప్ ధీమా వ్యక్తం చేసారు.
తన గెలుపుకోసం సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని ట్రంప్ అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన గెలుపులో భార్య మెలానియా పాత్రకూడా చాలా వుందన్నారు.
మొత్తంగా అమెరికా 47వ అధ్యక్షుడిగా గెలుపొందిన ట్రంప్ మరోసారి పాలనాపగ్గాలు చేపట్టనున్నారు. అమెరికాకు మొదటి మహిళా అధ్యక్షురాలిగా కమలా హారిస్ మారతారన్న డొమొక్రట్ల ఆశలపై ఈ ఎన్నికల ఫలితాలు నీళ్లు చల్లాయి. భారత సంతతి మహిళ కావడంతో హారిస్ విజయం సాధించాలని చాలామంది భారతీయులు కోరుకున్నారు. కానీ చివరకు ట్రంప్ నే విజయం వరించింది.