కాలిపోతున్న కాలిఫోర్నియా.. వాతావరణ మార్పులే కారణమా? మరేదైనా కుట్ర ఉందా?
California Wildfires: కాలిఫోర్నియాలో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. 12 వేలకు పైగా ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్న ఈ కార్చిచ్చుకు వాతావరణ మార్పులే కారణమా? లేక మరెదైనా కుట్ర ఉందా?
California Wildfires: కాలిఫోర్నియా మంటల్లో కాలిపోతోంది. పెద్దఎత్తున చెలరేగుతున్న కార్చిచ్చు కారణంగా ఇప్పటికే వేల ఇళ్లు కాలి బూడిదయ్యాయి. లక్షల్లో ఆస్తి నష్టం సంభవించింది. భయం గుప్పిట ప్రాణాలు పెట్టుకుని ప్రజలు రోడ్లపైకి వచ్చి సాయం కోసం రోదిస్తున్నారు. ఇప్పటికీ కాలిఫోర్నియా మంటలు తగ్గలేదు. ఈ కార్చిచ్చు వెనుక వాతావరణ మార్పులు కారణంగా ఉన్నాయనే వాదనలో పాటు మరేదైనా కుట్ర కూడా దాగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాలిఫోర్నియా మంటలకు-పసిఫిక్ పాలిసాడ్స్‌లోని శాంటా య్నేజ్ రిజర్వాయర్ ఏంటి సంబంధం?
కాలిఫోర్నియా చరిత్రలో అతిపెద్ద అగ్ని విపత్తుగా పేర్కొంటున్న ఈ కార్చిచ్చుకు వాతావరణ మార్పులే నిజమైన కారణమా లేదా అంతకంటే భయంకరమైన ఏదైన కుట్ర దాగి వుందా? ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది. ఈ కార్చిచ్చుకు ఇప్పుడు ప్రధానమైన అంశంగా పసిఫిక్ పాలిసాడ్స్‌లోని శాంటా య్నేజ్ రిజర్వాయర్ నిలిచింది. అడవి మంటలను ఆర్పడానికి ఇక్కడి నుంచి నీరు అందుతుంది.
అయితే, కొంతకాలంగా కార్చిచ్చులు సంభవించినప్పుడు ఇది పనిచేయడం లేదు. ఫిబ్రవరి నుండి మరమ్మతుల కోసం దీనిని మూసివేశారు. ఈ కీలకమైన నీటి సరఫరా వ్యవస్థ ఇలాంటి అవసరమైన సమయంలో నిరుపయోగంగా మారింది. ఈ పరిస్థితులు కార్చిచ్చు సంక్షోభాన్నిమరింతగా పెంచుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ రిజర్వాయర్ కండిషన్ - ఇక్కడి కార్చిచ్చు ప్రమాదాల మధ్య సంబంధం గురించి పూర్తిగా అధికారులకు తెలుసో లేదో అనే చర్చ కూడా మొదలైంది. తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదా? అనే చర్చ సాగుతోంది. అయితే, ఒక కుట్ర ప్రకారమే మంటలకు కారణం అవుతున్నారనే వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవు.
స్మార్ట్ సిటీల పథకం మంటలకు కారణమైందా?
కాలిఫోర్నియా మంటలకు కారణంగా మరో వాదన కూడా తెరమీదకు వచ్చింది. అదే స్మార్ట్ సిటీల ఏర్పాటు. కాలిఫోర్నియా అంతటా స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన UN ఎజెండా 2030 పథకంలో ఈ కార్చిచ్చు కుట్ర భాగమనే చర్చ కూడా నడుస్తోంది. అయితే, ఇలాంటి కుట్రలకు ఎలాంటి ఆధారాలు లేవు.
అలాగే, వివాదాస్పదమైన ఒక కథనం డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇన్ క్లూజన్ (డీఈఐ) విధానాలు సమర్థవంతమైన కార్చిచ్చు ప్రతిస్పందన ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించింది. సంక్షోభ సమయంలో సకాలంలో చర్యలు తీసుకోవడానికి ఈ చర్యలు ఆటంకం కలిగించాయని ప్రముఖ మితవాద గ్రూపులు పేర్కొంటున్నాయి. అయితే, ఇటువంటి వాదనలు జవాబుదారీతనం, నిజమైన పరిష్కారాల నుండి దృష్టి మళ్లిస్తాయని నిపుణులు నొక్కి చెబుతున్నారు.
california fire
కాలిఫోర్నియా మంటలు-సైనిక-గ్రేడ్ సాంకేతికత కారణం అయిందా?
మరో హాట్ టాపిక్ బీమా సంస్థలు పాలసీలను ఇవ్వకుండా ఉండటం. కార్చిచ్చులు ప్రారంభమవడానికి కొన్ని నెలల ముందు బీమా సంస్థలు పాలసీలను ఇవ్వలేదు. అలాగే, కొన్ని పాలసీలను రద్దు చేసుకున్నాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. బీమా కంపెనీలు లాభం పొందడం కోసం ఇలా చేశాయనీ, ఈ విపత్తుల వెనుక ఆర్థిక ఉద్దేశాల గురించి కుట్ర సిద్ధాంతాలకు ఆజ్యం పోశాయనే వాదనలు కూడా తెరమీదకు వచ్చాయి.
ఈ వింత వాదనల మధ్య, మరొక రకమైన వాదనలు కూడా తెరమీదకు వచ్చాయి. మంటలను మరింత పెంచడానికి శక్తి ఆయుధాలను ఉపయోగించారని చర్చ సాగుతోంది. కాలిపోయిన నిర్మాణాల పక్కన ఉన్న చెట్లను ఎలాంటి మంటలు తాకకపోయినా అవి అంటుకోవడం సైనిక-గ్రేడ్ సాంకేతికతను సూచిస్తాయని కొందరు పేర్కొన్నారు. ఇటువంటి వాదనలకు శాస్త్రీయ మద్దతు లేదు. పెరుగుతున్న తప్పుడు సమాచారం ప్రమాద విషయాలను పక్కదారి పట్టిస్తోంది.
కాలిఫోర్నియా మంటలు - వాస్తవాలు అర్థం చేసుకోవడం ముఖ్యం
కాలిఫోర్నియా కార్చిచ్చు-లాహైనా వంటి ఇతర విపత్కర సంఘటనల మధ్య పోలికలు గీస్తున్నందున, కుట్ర సిద్ధాంతాలు ప్రకృతి వైపరీత్యాల ముసుగులో భూ కబ్జాలకు సమన్వయ ఎజెండాను సూచిస్తున్నాయి. అయినప్పటికీ, ఈ కథనాలు నిరాధారమైనవని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
అయితే, వాస్తవ పరిస్థితులు గమనిస్తే.. వాతావరణ మార్పులు కార్చిచ్చు, అడవి మంటలను పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిరమైన వాతావరణ కారకాలు భయంకరమైన కార్చిచ్చులకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ విపత్తుల వెనుక దాగి ఉన్న ఉద్దేశాలను వెతకడం ప్రేరణ కలిగించినప్పటికీ, మూల కారణాలను పరిష్కరించడానికి, భవిష్యత్తు విషాదాలను నివారించడానికి వాస్తవాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
కాబట్టి సంబంధంలేని, వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉండే సిద్దాంతాలు కాకుండా అసలైన పరిష్కారాల వైపు చూడటం ముఖ్యం. ప్రకృతిని పరిరక్షించే చర్యల దిశగా ప్రభుత్వాలు ముందడుగు వేయాలి. భయంకరమైన విపత్తులు, వైపరిత్యాలు రాకుండా శాస్త్రీయంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే మున్ముందు కూడా జీవ మనుగడ సాగుతుంది.