- Home
- International
- Donald Trump: ఒబామా అరెస్ట్ అయ్యారా.? వీడియో పోస్ట్ చేసిన ట్రంప్... అసలేం జరిగిందంటే..?
Donald Trump: ఒబామా అరెస్ట్ అయ్యారా.? వీడియో పోస్ట్ చేసిన ట్రంప్... అసలేం జరిగిందంటే..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడేం చేస్తారో ఎవరూ ఊహించరు. ఒకసారి ఎంతో సీరియస్‌గా మట్లాడుతారు. అప్పుడే ఫన్నీగా స్పందిస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ట్రంప్ తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో వివాదాస్పదంగా మారింది.

సంచలనం రేపుతోన్న వీడియో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ట్రూత్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతికి సంకెళ్లు వేస్తూ ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేస్తున్నట్లు చూపించడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో రూపొందించిన ఈ దృశ్యాలు వాస్తవం కాకపోయినా, అందులో ఉన్న సందేశం మాత్రం రాజకీయ ఉదృతిని పెంచింది.
“చట్టానికి ఎవరూ అతీతులు కారు” అంటూ..
వీడియోపై “చట్టానికి ఎవరూ అతీతులు కాదు” అని రాసి ఉంది. ట్రంప్, ఒబామా మధ్య ఓవల్ ఆఫీసులో సంభాషన జరుగుతుండగా, ఎఫ్‌బీఐ అధికారులు లోపలికి ప్రవేశించి ఒబామాను అరెస్టు చేస్తారు. ఆ సమయంలో ట్రంప్ చిరునవ్వుతో చూసే సన్నివేశం ఈ వీడియోలో కనిపిస్తోంది.
ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేశారు.?
ఈ వీడియోను ట్రంప్ ఒక రాజకీయ సందేశంగా ఉపయోగించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ట్రంప్ చేసిన ఆరోపణల ప్రకారం ఒబామా వర్గం 2016 అధ్యక్ష ఎన్నికల్లో భారీ స్థాయిలో మోసాలకు పాల్పడిందని పేర్కొన్నారు. ట్రంప్ విజయం తర్వాత తమ నియంత్రణ కోల్పోయిన వర్గాలు రష్యా జోక్యం వాదనను బలవంతంగా లేవనెత్తాయని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలతో ఈ వీడియోకు సంబంధం ఉందని విశ్లేషణలు ఊపందుకున్నాయి.
🚨#BREAKING: President Trump posted an AI video of Barack Obama being ARRESTED by FBI and rotting in a prison cell.
Arrest him, no one is above the law! pic.twitter.com/XEHaCSlcAI— Trump Man (@trumpman77777) July 21, 2025
సంచలనంగా మారి తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలు
గత వారం అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఒబామా హయాంలో పనిచేసిన వారు ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని అబద్ధ ప్రచారం చేశారని ఆమె ఆరోపించారు. 2016 ఎన్నికల్లో రష్యా జోక్యం వాదనను సృష్టించి ప్రజల్లో అపోహలు కలిగించారని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె వద్ద ఇందుకు సంబంధించి బలమైన ఆధారాలున్నాయని తెలిపిన తులసీ.. ఒబామా ప్రభుత్వంలో పనిచేసిన వారందరినీ విచారించాలని కూడా పిలుపునిచ్చారు.
వెల్లువెత్తుతోన్న విమర్శలు
ఓవాల్ ఆఫీసులో ఒబామా అరెస్ట్ అయినట్లు ఉన్న వీడియో ఏఐతో రూపొందించినట్లు స్పష్టమవుతుంది. ఇప్పుడీ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఎఐ టూల్స్‌ను ఉపయోగించడం ప్రమాదకరమని పలువురు విమర్శిస్తున్నారు. అసత్యాన్ని వాస్తవంగా చూపించే ప్రయత్నం ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల అనవసరమైన అనిశ్చితిని సృష్టిస్తుందని అంటున్నారు. అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి ఫేక్ వీడియోలను పోస్ట్ చేయడం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.