నీటికంటే వేగంగా మంటలు ఆర్పే కెమికల్ ... ఏమిటీ Phos Chek? ఇదేమైనా ప్రమాదకారా?
లాస్ ఏంజిల్స్ లో చెలరేగిన కార్చిచ్చును అదుపు చేసేందుకు అక్కడి ఫైర్ సిబ్బంది ఓ పింక్ కెమికల్ ను ఉపయోగిస్తున్నారు. ఈ కెమికల్ నీటికంటే వేగంగా మంటలను అదుపు చేయగలదు. ఇంతకు ఇదేంటో తెలుసా?
Phos Chek
Los Angeles Wild Fire : అత్యాధునిక టెక్నాలజీకి ఏమాత్రం కొదవలేని దేశం అమెరికా. ప్రపంచ దేశాలకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా పెద్దన్నలా వ్యవహరిస్తున్న ఈ దేశాన్ని ఇటీవల కార్చిచ్చు వణికించింది. ఈ మంటల్లో దాదాపు 12 వేల ఇళ్లు దగ్దమయ్యాయంటేనే ఈ కార్చిచ్చు ఏ స్థాయిలో చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు. చివరకు పలువరు హాలీవుడ్ తారల ఇండ్లు కూడా మంటల్లో కాలిబూడిదయ్యాయి.
ఈ కార్చిచ్చు 16 మంది ప్రాణాలను బలితీసుకుంది. అలాగే వేలాది ఎకరాల అడవి, పంట భూములను నాశనం చేసింది. మంటలు అదుపు చేయడానికి నీటి కొరత వుండటంతో అధికారులు కొత్త కెమికల్ ను ఉపయోగించారు.ఈ Phos Chek (పింక్ ఫైర్ రెటార్డెంట్) ను ఉపయోగించారు. ఆ క్రమంలో ఈ ఫైర్ రెటార్డెంట్ కెమికల్ చర్చనీయాంశంగా మారింది... కాబట్టి దీని గురించి తెలుసుకుందాం.
Phos Chek
ఏమిటీ Phos Chek :
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో కార్చిచ్చు వేగంగా వ్యాపించి ఆస్తినష్టమే కాదు ప్రాణనష్టాన్ని సృష్టించింది. ఈ వైల్డ్ ఫైర్ కారణంగా కొందరు కట్టుబట్టలతో మిగిలారు...వారి ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. ఇక మరికొందరు ఈ మంటల కారణంగా చేతికి అందివవచ్చిన పంటను కోల్పోయారు. ఇలా లాస్ ఏంజిల్స్ లో కార్చిచ్చు చాలామందితో కంటనీరు తెప్పించింది.
దావానంలో వ్యాపిస్తున్న మంటలను కేవలం నీటితో అదుపుచేయలేకపోయారు అమెరికా అగ్నిమాపక సిబ్బంది. దీంతో మంటలను అదుపుచేయడానికి ఉపయోగించే ఓ కెమికల్ ను ఉపయోగించారు. పింక్ కలర్ లో వుండే ఈ కెమికల్ ను ఎయిర్ ట్యాంకర్లు మంటలను ఆర్పుతున్న వీడియోలు వైరల్ గా మారాయి.
ఈ కెమికల్ పేరు Phos Chek. దీన్ని పెరిమీటర్ అనే కంపనీ విక్రయిస్తుంది. ఇందులో 80 శాతం నీరు, 14 శాతం కెమికల్స్, 6 శాతం రంగులు, ఇతర పదార్థాలు వుంటాయి. ఇది మంటలను ఆర్పడంలో నీటికంటే ఎక్కువ ప్రభావంతో పనిచేస్తుంది. అమెరికాలో తరచూ వ్యాపించే కార్చిచ్చులను అదుపు చేయడానికి ఈ కెమికల్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
అయితే ఈ పింక్ ఫైర్ రెటార్డెంట్ (Phos Chek) అత్యవసర సమయాల్లో మంటలు ఆర్పేందుకు ఉపయోగపడుతుంది. కానీ ఇందులోని కెమికల్స్ పర్యావరణానికి హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రకృతికే కాదు వన్యప్రాణులకు ఈ మంటలను ఆర్పే కెమికల్ చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
Phos Chek
పింక్ ఫైర్ రెటార్డెంట్ అంత ప్రమాదకరమా! :
సాధారణంగా పింక్ ఫైర్ రెటార్డెంట్ (Phos Chek) మంటలను అదుపుచేయడంలో ఉపయోగపడుతుంది. ఇందులో అమ్మోనియం పాస్పేట్ వంటివి వుంటాయి. ఇందులోని నీరు, కెమికల్స్ కలిసి మంటకు ఆక్సిజన్ అందకుండా చేస్తాయి. దీంతో వేగంగా వ్యాపించే మంటలు నెమ్మదించడం జరుగుతుంది... అప్పుటు వాటిని పూర్తిగా ఆర్పేయడం సులువు అవుతుంది.
చాలా దేశాల్లో దశాబ్దాలుగా ఈ Phos Chek కెమికల్ ను మంటలు అదుపు చేసేందుకు ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు తర్వాత దీనిపై పెద్ద చర్చ సాగుతోంది. ఇది మంటలు అదుపుచేయడం వరకు బాగుంది... కానీ ఆ తర్వాత దీనివల్ల చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఫైర్ రెటర్డెంట్ Phos Chek గాలిలో నుండి మంటపై స్ప్రే చేస్తారు. దీనివల్ల ఇది గాలితో పాటు నీటిలో కలుస్తుంది. తద్వారా జంతువులు, మనుషుల్లోకి చేరి ఆరోగ్య సమస్యలు సృష్టిస్తుందట. ఇందులో చాలా విషపూరిత కెమికల్స్ వున్నాయని అధ్యయనాల్లో తేలింది. ఇందులోని క్రోమియం, క్యాడ్మియం వంటివి చాలా అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి. వీటివల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు అవయవాలు దెబ్బతినడం కూడా జరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక పర్యావరణానికి కూడా ఇది చాలా హాని చేస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇది భూమిలో లేదా గాలిలో కలుసి చాలాకాలం వుంటుంది.. కాబట్టి మంటలు అదుపులోకి వచ్చాక కూడా ప్రమాదానికి కారణమవుతాయి. ఇలా దీనివల్ల భూమి, నీరు కూడా కాలుష్యం అవుతుంది. లాస్ ఏంజిల్స్ లో మంటలు అదుపులోకి వచ్చాక ప్రజలు, వన్యప్రాణులపై ఈ Phos Chek ప్రభావం లేకుండా చూడాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.