- Home
- International
- భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని.. రూ.6 కోట్ల శాలరీ జాబ్ వదులుకున్న భర్త.. కోర్టు ఆసక్తికర తీర్పు
భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని.. రూ.6 కోట్ల శాలరీ జాబ్ వదులుకున్న భర్త.. కోర్టు ఆసక్తికర తీర్పు
Alimony : కట్టుకున్న భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని ఓ భర్త అతితెలివి ప్రదర్శించాడు. కానీ కోర్టు అతడికి షాక్ ఇచ్చింది. అసలు ఆ భర్త ఏం చేశాడు..? కోర్టు ఏ తీర్పు ఇచ్చింది..? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

భార్యాభర్తల భరణం కేసులో కోర్టు సంచలన తీర్పు
మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోతున్నాయి. ఇటీవలకాలంలో వైవాహిక బంధాలు విచ్చిన్నం అవుతున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. సెలబ్రిటీలు, వీఐపిల నుండి సామాన్యుల వరకు అనేక జంటలు చిన్నచిన్న కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భార్య, పిల్లల ఖర్చులకోసం భరణంగా వందల కోట్లు ఇస్తున్నవారిని చూస్తున్నాం. అయితే కొందరు భరణం ఇవ్వాల్సి వస్తుందని విడాకులకు ముందే తనపేరిట ఉన్న ఆస్తిపాస్తులను ఇతర కుటుంబసభ్యుల పేరిట బదిలీ చేస్తున్న ఘటనలు చూస్తున్నాం. చాలామంది భర్తలు ఆదాయం తక్కువగా ఉందని... భార్య విలాసాల కోసం భరణం అడుగుతుందని మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు... ఇలాంటివారికి షాక్ ఇచ్చేలా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
ప్రియురాలి కోసం భార్యాపిల్లలను వదిలేసిన భర్త
కెనడాకు చెందిన ఓ వ్యక్తి సింగపూర్ లోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేసేవాడు. అతడి శాలరీ ఏడాదికి రూ.6 కోట్ల పైనే ఉండేది. అయితే అతడు కట్టుకున్న భార్య, నలుగురు పిల్లలను కాదని మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు... చివరకు ప్రియురాలి కోసం కుటుంబాన్నే వదిలేశాడు. 2023 నుండి అతడు భార్యాబిడ్డలకు దూరంగా ఉంటున్నాడు.
భర్త దూరం కావడంతో కుటుంబపోషణ భారంగా మారడంతో సదరు మహిళ సింగపూర్ కోర్టును ఆశ్రయించింది. తన భర్త నుండి కుటుంబపోషణ, పిల్లల చదువుల కోసం డబ్బులు ఇప్పించాలని కోరింది. దీంతో భార్యకు ఎక్కడ భరణం చెల్లించాల్సి వస్తుందోనని సదరు భర్త ఉద్యోగానికి రాజీనామా చేశాడు... తన దేశం కెనడాకు వెళ్లిపోయాడు.
సదరు భర్తకు షాకిచ్చిన కోర్టు
2023 నుండి భర్త నుండి డబ్బులు పొందేందుకు సదరు మహిళ పోరాటం చేస్తోంది... కానీ అతడు స్వదేశంలో ఉండి సింగపూర్ కోర్టుకు హాజరుకాలేకపోయాడు. దీంతో కోర్టు 2024 లో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది... దీంతో అతడు జూమ్ కాల్ ద్వారా కోర్టుకు హాజరయ్యాడు.
ఇరుపక్షాల వాదనను విన్న న్యాయస్థానం సరిగ్గా భార్య భరణం అడగ్గానే ఉద్యోగం మానేయడం బాధ్యతారాహిత్యమని కోర్టు వ్యాఖ్యానించింది. ఏదేమైనా భార్యకు భరణం చెల్లించాల్సిందేనని... గత 2023 సెప్టెంబర్ నుండి 2025 సెప్టెంబర్ వరకు ఇవ్వాల్సిన భరణం బకాయిలు రూ.4 కోట్లుగా తేల్చింది. ఈ మొత్తాన్ని భార్యకు చెల్లించాల్సిందిగా భర్తను ఆదేశించింది.
అయితే ప్రస్తుతం సదరు వ్యక్తి ఆదాయం తగ్గిన నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా భరణం నిర్ణయించింది. భార్య కూడా అతడి పరిస్థితిని అర్థం చేసుకోవాలని... ఇద్దరు కలిసి పిల్లల బాధ్యత చూసుకోవాలని సూచించింది. ఇలా భార్యకు భరణం ఇవ్వకుండా తప్పించుకోవాలని అనుకున్న భర్తకు సింంగపూర్ ఫ్యామిలీ కోర్ట్ షాక్ ఇచ్చింది.
భార్యాభర్తలకు కోర్టు సలహా...
భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా మరో మహిళతో ఉంటున్నాడని భార్య ఆరోపిస్తోంది. కానీ అతడు భార్య విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిందని... ఫార్ములా వన్ టికెట్స్, ఖరీదైన హాలిడేస్, కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేయించుకుంటోందని వాదించాడు. తన భార్యను స్వదేశం కెనడాకు తీసుకెళదామనుకున్నానని... అక్కడ స్కూలింగ్, హెల్త్ కేర్ ఫ్రీ కాబట్టి ఖర్చులు ఉండవన్నారు. కానీ ఆమె రాకపోవడంతో ఒక్కడినే వెళ్లాల్సి వచ్చిందని వాదించాడు. అయితే పిల్లలకు మెరుగైన జీవితం ఇవ్వాలనే తాను సింగపూర్ లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు భార్య తెలిపింది. ఇరువురి వాదన విన్న న్యాయస్థానం భార్య తన ఖర్చుల కోసం సొంతంగా సంపాదించుకోవాలని... భర్త పిల్లల చదువు, ఇతర ఖర్చుల కోసం భరణం ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. తండ్రి తన ఆర్థిక బాధ్యతల నుంచి తప్పించుకోలేడని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

