- Home
- International
- గ్రీస్ పడవ ప్రమాదం : ఆ సమయంలో బోటులో 700మంది... 79మంది మృతి, 104మంది క్షతగాత్రులు.. 500పై చిలుకు గల్లంతు..
గ్రీస్ పడవ ప్రమాదం : ఆ సమయంలో బోటులో 700మంది... 79మంది మృతి, 104మంది క్షతగాత్రులు.. 500పై చిలుకు గల్లంతు..
గ్రీస్ లో జరిగిన పడవ ప్రమాదంలో 79మంది మృతి చెందగా, 104మంది గాయపడ్డారు. అయితే ప్రమాదసమయంలో పడవలో 700మంది ఉన్నారని క్షతగాత్రులు చెబుతున్నారు.

ఏథెన్స్ : గ్రీస్ పడవ ప్రమాద మృతుల సంఖ్య 79కి చేరింది. ఇటీవలగ్రీస్ సమీపంలోని మెస్సేనియా పైలోస్ తీరంలో పడవ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 79 మంది మృతి చెందారు. 500 మందికి పైగా గల్లంతయినట్లను అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఇద్దరు యువకులు ఈ విషయాన్ని తెలిపారు. వీరిద్దరూ సిరియాకు చెందిన హసన్ (23), పాకిస్తాన్ కు చెందిన రాణా (24).
వారు తెలిపిన వివరాల మేరకు ప్రమాదానికి గురైన పడవలో ఆ సమయంలో మొత్తం 700 మంది శరణార్థులు.. 15 మంది సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన హసన్ మాట్లాడుతూ లిబియా నుండి అనేకమంది అక్రమ రవాణా దారులు చాలా ఏళ్లుగా శరణార్థులను ఇలా తరలిస్తున్నారని తెలిపాడు.
ఎక్కువ వేతనం కోసం తాను జర్మనీ వెళ్లాలన్న ఆలోచనతో ఈ ప్రయాణానికి సిద్ధమయ్యానని హసన్ తెలిపాడు. మరో యువకుడు రాణా మాట్లాడుతూ తమ దగ్గర నుంచి లిబియా అక్రమ రవాణాదారులు.. తమను తరలించడానిక పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని తెలిపాడు.
కానీ, పడవలో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదన్నాడు. చాలీచాలని నీళ్ళు, ఆహారం ఇచ్చి నాలుగు రోజులపాటు ప్రయాణంలో సర్దుకోవాలని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు పడవలో ఇసుకవేస్తే రాలనంత జనం ఉన్నారన్నాడు.
పడవ ప్రమాదం జరిగిన తీరును వివరించాడు. ప్రయాణం మొదలైన మూడవరోజు…పడవలోకి ఒకపక్క నుండి నీళ్లు రావడం మొదలైంది. దీంతో జనం అంతా కంగారుపడి రెండో పక్కకు కదిలారు. వెంటనే పడవ బ్యాలెన్స్ కోల్పోయి.. క్షణాల్లో నీటిలో మునిగిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే అందరూ నీళ్లల్లో ఉన్నారు.
గ్రీస్ కోస్ట్ గార్డ్ బృందం వీరందరినీ కాపాడింది. వారు వచ్చేవరకు తమకు ఏమీ తెలియదని.. నీళ్లలో పడడం మాత్రమే గుర్తుందని వాళ్ళు ఇద్దరు చెప్పుకొచ్చారు.గ్రీస్ కోస్ట్ అధికారులు ఈ ప్రమాదం గురించి తెలుపుతూ.. బోట్లో సుమారుగా 500 మంది ప్రయాణిస్తున్నారని వారిలో 79 మంది మృతదేహాలను మాత్రమే గుర్తించామని అన్నారు. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన 104 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.
వీరుకాక మిగిలిన వారు గల్లంతయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ యువకులు చెబుతున్నదానితో గల్లంతైన వారే 500 మందికి పైగా ఉండొచ్చని తెలుస్తోంది. వారి కోసం బోట్లు, డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.