Donkey Route : అమెరికాలోకి అక్రమ చొరబాటు ఇంత కష్టమా... అయినా ఇంతమంది వెళ్లారా!
US Deportation : అమెరికాలో అక్రమంగా నివాసముంటున్న విదేశీయుల ఏరివేత కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇన్నిలక్షల మంది యూఎస్ లోకి ఎలా చొరబడ్డారు? ఏమిటీ డంకీ రూట్? ఇది ఎంత ప్రమాదకరం? తదితర విషయాాలు తెలుసుకుందాం.

US deportation of Indian migrants
US deportation of Indian migrants: రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో అక్రమంగా నివాసం వుంటున్న విదేశీయులపై ఉక్కుపాదం మోపుతున్నాడు. ఇలా ఇప్పటికే వేలాదిమందిని కాళ్లుచేతులు బంధించి ఆర్మీ విమానాల్లో వారివారి దేశాలకు పంపించారు.... ఇంకా పంపిస్తూనే వున్నారు. ఇలా ఇండియాకు కూడా ఓ అమెరికన్ ఆర్మీ విమానం వచ్చింది. దాదాపు వందమందికి పైగా ఇండియన్స్ ను తరలించింది ట్రంప్ సర్కార్... ఇంకా లక్షలాదిమంది భారతీయులు అమెరికాలో అక్రమ నివాసం వున్నారట... వారిని కూడా గుర్తించి తరిమికొడతామని అమెరికా స్పష్టం చేస్తోంది.
అసలు ఇన్ని లక్షలమంది అక్రమంగా అమెరికాకు ఎలా వెళ్ళారు? అసలు ఏమిటీ'డంకీ రూట్'... అందులో ఎదురయ్యే కష్టాలేంటి? విదేశీయులను విమానం ఎక్కించాక కూడా సంకెళ్లు ఎందుకు వేస్తున్నారు? ప్రస్తుతం అమెరికాలో విద్యార్థుల పరిస్థితేంటి? లక్షలు పోసి పిల్లలను విదేశాలకు పంపిస్తున్న తల్లిదండ్రుల పరిస్థితేంటి?... ఇలా అమెరికా అక్రమ వలసదారుల ఏరివేత నేపథ్యంలో అమర్‌నాథ్ వాసిరెడ్డి ఫేస్‌బుక్‌లో రాసిన ఈ ఆసక్తికర కథనంపై ఓ లుక్కేయండి.
Donkey Route
బతకడం కోసం చచ్చిపోతున్నారు!
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేవారిలో ఎక్కువ మంది వెళ్ళేది 'Donkey Route (గాడిద మార్గం)'. ఎల్ బుర్రో అనే స్పానిష్ మాటకు అర్థం గాడిద.గాడిదలా బరువులు మోసుకొంటూ అడ్డదిడ్డంగా వెళ్లడం అనే భావాన్నుంచి ఈ డంకీ రూట్ పదం పుట్టింది. గాడిద మార్గం రహదారి కాదు... ఎన్నెన్నో దొంగ మార్గాలు. ఇందులో ఒకటి దరియెన్ ఖాళీ స్థలం.
ఈ రూట్ అతి భయంకరమయిన కీకారణ్యం, చిత్తడి నేలల గుండా సాగుతుంది. దాదాపు 97 కిలోమీటర్లు దూరం వుంటుంది. పనామా, కొలంబియా మధ్య వుంది. పాములు,చిరుతల వంటి అడవి జంతువులు, విష కీటకాలు ఇక్కడ లెక్కకు మించి ఉంటాయి. ఎప్పుడూ భారీ వర్షం లేదంటే భారీ ఎండ, వేడి చెమటలు కారి పోతాయి. ఇలా కఠిన మార్గంలో ప్రయాణించాల్సి వుంటుంది.
ఇక అసలు సమస్య ఇక్కడ వున్న డ్రగ్ మాఫియాలతో. వీరికి ఆడవాసన తగిలితే వదిలిపెట్టరు. ఈ మార్గంలో వెళ్లేవారికి ఏజెంట్స్ ముందుగానే కండోమ్స్ ఇస్తారు. అంటే డ్రగ్ కేటుగాళ్లతో సంభోగానికి ఒప్పుకోవాలని ముందే చెప్పడం అన్నమాట. వారి మాట వినకుంటే చిత్రహింసలు పెట్టి రేప్ చేసి చంపేస్తారు. ఇవన్నీ లేకుండా ముందుగానే ఒప్పుకొంటే ప్రాణం దక్కుతుంది. ఎయిడ్స్ సోకకుండా రబ్బరు తొడుగు. వారు అడిగితే చేతిలో ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేయాలి. ఇలా మానప్రాణాలపై ఆశ వదులుకునిమరీ డంకీ రూట్ ఎంచుకుంటున్నారు.
రోజుకు ఒక చిన్న బ్రెడ్ ముక్క .. రెండు బిస్కెట్లు. తాగు నీరు పెద్దగా అందుబాటులో ఉండదు. దరియెన్ గాప్ ప్రయాణం వారం నుంచి 15 రోజులు పడుతుంది. అదేంటి కేవలం 97 కిలోమీటర్స్ కే అంత సమయం ఏంటని అనుకొంటున్నారా? కొండలు గుట్టలు, బురద నేలలు, చెట్లు చేమలు, పాములు దోమలు, అడుగు తీసి అడుగు వెయ్యాలంటేనే నరకం. ఇక అక్కడ అనారోగ్యం పాలయితే అంతే సంగతి. వారిని అక్కడే వదిలేసి బృందం ముందుకు వెళ్ళిపోతుంది. అంటే అక్కడే తిండి లేకుండా చచ్చిపోతారు. ఇలా జనాలు వెళుతుంటే దారిలో శవాలు ఆస్తి పంజరాలు కనిపిస్తాయి.
ఇంతటి దారుణమయిన మార్గం లో ఎవరు వెళుతారు అనుకొంటున్నారా ? 2023లో మొత్తం అయిదు లక్షల మంది ఇలాగే డంకీ రూట్ లో వెళ్లారు . అంతకు ముందు సంవత్సరం కంటే ఇది డబుల్.
US deportation of Indian migrants
విమానం లో ఎక్కించినా బేడీలు ఎందుకు?
భయం... భయపెట్టడం. "మా దేశానికి అక్రమమార్గంలో వస్తే పర్యవసానాలు ఇలా ఉంటాయి!" అని అందరికీ హెచ్చరిక. సైకలాజికల్ వార్నింగ్. ఇప్పుడు అమెరికా చేస్తోందిదే. ఇటీవల భారతీయులను కూడా ఇలాగే అమృత్ సర్ కు తరలించారు... వాళ్ల సంకెళ్ళ వీడియోను అమెరికా ప్రభుత్వం అధికారికంగా పెట్టింది. ''దరియెన్ గ్యాప్ లో ఎన్నో కష్టాలు పడి మా దేశం లో దూరినా... పట్టుకొంటాము. చీకటి గదుల్లో బందిస్తాము. అవమానకర రీతిలో చేతులకు కాళ్లకు బేడీలు వేసి గెంటేస్తాము''అని వారు అధికారికంగా చెబుతున్నారు. { గెంటేస్తాము అనే మాట వారు వాడింది }
శిక్షించవచ్చు కదా?
టైటిల్ 8 సెక్షన్ 1325.. యూఎస్ కోడ్ ప్రకారం ఆ దేశం లో అక్రమమగా చొరబడితే రెండేళ్లు జైలు .. రెండు లక్షల యాభై వేల డాలర్స్ అపరాధం. ఇప్పుడు గెంటివేయబడ్డ వారు ఇటీవలే వెళ్ళినవారు. వీరిలో చాలా మంది బోర్డర్ లోనే పట్టుబడి ఇన్నాళ్లు జైళ్లలో ఉన్నవాళ్లే . ఆస్తి మొత్తం అమ్మి ఏజెంట్స్ కు అప్పచెప్పి అమెరికా లో చొరబడి ... అప్పుడే పట్టుబడితే వారి దగ్గర ఏం ఉంటుంది ? ఇరవై లక్షలు కట్టగలరా ? అందుకే పంపేస్తున్నారు.ఇది వరకే అక్కడ చొరబడి కాస్తో కూస్తో డబ్బు సంపాదించిన వారితో ఎలా వ్యవహరిస్తారో చూడాలి .
Indian Students in US
విద్యార్థుల సంగతి ఏంటి?
స్టడీ వీసా పై వెళ్లిన వారు క్యాంపస్ బయట ఉద్యోగాలు చేయకూడదు. ఇన్నాళ్లు సాగింది. ఇప్పుడు పట్టుబడిపోతాము అని భయంతో టెక్సాస్ లాంటి చోట్ల ఎవరూ బయట ఉద్యోగాలకు వెళ్లడం లేదు. వీరు వెళ్లినా పార్ట్ టైం ఉద్యోగాలు ఇవ్వడానికి వారు రెడీగా లేరు. పరిస్థితి దారుణంగా వుంది.
ఆయనకో షాప్ వుంది . వ్యాపారం వారి కుల వృత్తి. కొడుకు భవిష్యత్ బావుంటుందని అరవై లక్షల అప్పు చేసి అమెరికా పంపించాడు. అటుపై మరో ఇరవై లక్షల అప్పు. వీటికి వడ్డీలు కట్టలేక ఇటీవలే ఆత్మ హత్య చేసుకొన్నాడు. ఇలా కొడుకు బంగారు భవిత కోసం ప్రాణం విడిచిన తండ్రి. ఎవరిదీ పాపం?
ఇంతజరిగినా జనాలకు ఇప్పటికీ సరైన సమాచారం ఇచ్చేవారు లేరు. "పక్కవాళ్ళు వెళ్లారు .. మనం కూడా వెళ్ళాలి" అనే తపనే. గాడిద మార్గంలో అమెరికాకు పంపే ఏజెంట్స్ కోటీశ్వరులు అయిపోయారు. అమెరికా కేసినోలలో ఒక రాత్రి పూట వారు పందెంకాచే డబ్బు చూసి ఆ దేశ సంపన్నులే కళ్ళు తేలేస్తున్నారు.
నాశనం అయిపోతోంది మనోళ్లే ...దోచుకొంటోంది మనోళ్లే... మొసలి కన్నీరు కారుస్తోంది మనోళ్లే... డాలర్ డ్రీమ్స్ కాస్త డాలర్ నైట్ మెర్ అయ్యింది. బహుశా మరో రెండేళ్లకు ప్రతిభ వున్నవారికి ఇండియాలో ఫ్లైట్ ఎక్కేముందే గ్రీన్ కార్డు చేతిలో పెట్టి మేళతాళాలతో అమెరికా ఆహ్వానించవచ్చు. రహదారికి అడ్డదారి కి తేడా ఇప్పటికైనా తెలుసుకొంటే అందరూ బాగుపడతారు .