- Home
- International
- Mosquito drone: పెద్ద స్కెచ్చే... మస్కిటో డ్రోన్‌లను తీసుకొచ్చిన చైనా. వీటితో ఏం చేయనున్నారంటే.
Mosquito drone: పెద్ద స్కెచ్చే... మస్కిటో డ్రోన్‌లను తీసుకొచ్చిన చైనా. వీటితో ఏం చేయనున్నారంటే.
టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మస్కిటో డ్రోన్‌ను రూపొందించింది. ఇంతకీ ఏంటీ డ్రోన్.? వీటి ఉపయోగం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంటీ మస్కిటో డ్రోన్.?
టెక్నాలజీలో తమ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి చాటింది చైనా. మస్కిటో (దోమ) ఆకారంలో ఉన్న సూక్ష్మ డ్రోన్‌ను పరిచయం చేసింది. ఇది గూఢచర్యం, రహస్య పరిశోధనలకు ఉపయోగపడే ఆధునిక టెక్నాలజీని సూచిస్తోంది. హునాన్ ప్రావిన్స్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ (NUDT)లో ఈ డ్రోన్‌ను అభివృద్ధి చేశారు.
దీని ప్రత్యేకతలు ఏంటంటే.?
ఈ డ్రోన్ దాదాపు 1–2 సెం.మీ పొడవు మాత్రమే ఉంటుంది. దీని బరువు కేవలం 0.3 గ్రాములే. ట్రాన్సపరెంట్‌గా ఉండే రెండు రెక్కలు ఉంటాయి. ఇవి నిజమైన కీటకల్లా రెక్కలను ఆడిస్తూ గాల్లోకి ఎగురుతాయ్. అలాగే పలుచటి మూడు కాళ్లు ఉంటాయి.
నిలువుగా ఉండే నల్లని శరీరం (ఫ్యూసలాజ్) ఉంటుంది. మనిషిపై వాలినా తెలియనంత తేలికగా ఉంటుంది. చేతి వేలిపై కూడా వాలేంత చిన్నదిగా ఉంటుంది.
అసలు ఎందుకు తయారు చేశారు.?
ఈ డ్రోన్‌ను ప్రత్యేకంగా గూఢచర్యం, రహస్య మిషన్ల కోసం తయారు చేశారు. మైక్రో ఫ్లాపింగ్ వింగ్ ఏరియల్ వెహికిల్స్ రంగంలో భాగంగా ఈ డ్రోన్‌ను నిర్వహించారు. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు ఈ దిశగా పరిశోధనలు చేస్తున్నాయి. అయితే చైనా ఇందులో అందరికంటే ముందు వరసలో ఉంది. ఎవరికి తెలియకుండా సమాచారాన్ని సేకరించేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు.
వీటితో ఉన్న సవాళ్లు ఏంటి.?
అయితే ఈ డ్రోన్స్ విషయంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. చిన్న పరిమాణం ఉండడం వల్ల ఇందులోని బ్యాటరీ కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. తక్కువ బరువు ఉండడం వల్ల హై క్లారిటీ కెమెరాలు, మైకులు అమర్చడం కష్టం. అలాగే బయట వాతావరణాన్ని తట్టుకోలేదు. గాలికి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ల్యాబ్‌కే పరిమితం
ఇదిలా ఉంటే ఈ మస్కిటో డ్రోన్స్ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయని తెలుస్తోంది. ల్యాబ్‌లో ప్రోటోటైప్స్ దశలో ఉన్న ఈ డ్రోన్స్‌లను వందలు, వందలుగా పంపి శత్రువులపై గూఢచర్యానికి వాడతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాగా ఇలాంటి డ్రోన్ తయారీ చేయడం ఇదే తొలిసారి కాదు. అమెరికా DARPA సంస్థ రోబోబీ పేరుతో డ్రోన్స్‌ను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సూక్ష్మ డ్రోన్ పరిశోధనలు చేపడుతున్నాయి.
ప్రశ్నార్థకంగా భద్రత, గోప్యత
అయితే ఇలాంటి డ్రోన్స్ అందుబాటులోకి వస్తే భద్రత, ప్రైవసీ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పలువురు అబిప్రాయపడుతున్నారు. ప్రజలపై గూఢచర్యం చేసేందుకు ఇవి ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో వ్యక్తిగత జీవిత గోప్యత ఉండదని అంటున్నారు.
మొత్తం మీద చైనా రూపొందించిన ఈ మస్కిటో డ్రోన్ ప్రస్తుతానికి ప్రయోగాత్మక దశలో ఉన్నా, భవిష్యత్తులో గూఢచర్యం, యుద్ధ తంత్రాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలు ఇప్పుడే దీనిపై చట్టాలు, నియంత్రణ విధానాలు రూపొందించకపోతే, భవిష్యత్తులో ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రజల గోప్యతను సవాలుగా మారే ప్రమాదం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.